Delhi: గెలిచి నిలిచింది.. దిల్లీకి ఏడో విజయం

దిల్లీ ప్లేఆఫ్స్‌ ఆశలు సజీవం. అస్థిరమైన ఆటతో పడుతూ లేస్తూ సాగుతున్న ఆ జట్టు ఈ టోర్నీలో తొలిసారి వరుసగా రెండో విజయాన్నందుకుంది. ఎక్కువ స్కోరు చేయకున్నా.. సూపర్‌ బౌలింగ్‌తో పంజాబ్‌ను మట్టికరిపించిన దిల్లీ ఏడో విజయాన్ని....

Updated : 17 May 2022 07:08 IST

రాణించిన మార్ష్‌, శార్దూల్‌
పంజాబ్‌ పరాజయం
నవీ ముంబయి

దిల్లీ ప్లేఆఫ్స్‌ ఆశలు సజీవం. అస్థిరమైన ఆటతో పడుతూ లేస్తూ సాగుతున్న ఆ జట్టు ఈ టోర్నీలో తొలిసారి వరుసగా రెండో విజయాన్నందుకుంది. ఎక్కువ స్కోరు చేయకున్నా.. సూపర్‌ బౌలింగ్‌తో పంజాబ్‌ను మట్టికరిపించిన దిల్లీ ఏడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అయితే తేలిగ్గా గెలిచేలా కనిపించిన ఆ జట్టును జితేశ్‌ శర్మ కంగారు పెట్టాడు. దిల్లీ తరఫున బ్యాటుతో మిచెల్‌ మార్ష్‌ మెరిస్తే.. బంతితో కుల్‌దీప్‌, శార్దూల్‌ రాణించారు. దిల్లీ లాగే పంజాబ్‌ ఇంకో మ్యాచ్‌ ఆడాల్సివుంది. కానీ ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లే నెగ్గిన పంజాబ్‌ ముందంజ వేయడం చాలా కష్టం.

కీలక మ్యాచ్‌లో దిల్లీ అదరగొట్టింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో 17 పరుగుల తేడాతో పంజాబ్‌పై ఘనవిజయం సాధించింది. మిచెల్‌ మార్ష్‌ (63; 48 బంతుల్లో 4×4, 3×6) రాణించడంతో మొదట దిల్లీ 7 వికెట్లకు 159 పరుగులు చేసింది. లివింగ్‌స్టోన్‌ (3/27), అర్ష్‌దీప్‌ (3/37) ఆ జట్టుకు కళ్లెం వేశారు. ఛేదనలో తడబడ్డ పంజాబ్‌ 9 వికెట్లకు 142 పరుగులే చేయగలిగింది. శార్దూల్‌ (4/36), కుల్‌దీప్‌ యాదవ్‌ (2/14), అక్షర్‌ పటేల్‌ (2/14) ఆ జట్టును దెబ్బతీశారు. జితేశ్‌ శర్మ (44; 34 బంతుల్లో 3×4, 2×6) పోరాటం.. పంజాబ్‌కు సరిపోలేదు.  

పంజాబ్‌ తడబాటు: పెద్దదేమీ కాని లక్ష్య ఛేదనలో పంజాబ్‌కు అదిరే ఆరంభం లభించింది. బెయిర్‌స్టో (28; 15 బంతుల్లో 4×4, 1×6) మెరుపులతో 3.4 ఓవర్లలో 38/0తో నిలిచింది. కానీ ఇన్నింగ్స్‌ అనూహ్యంగా గాడి తప్పింది. బెయిర్‌స్టోను ఔట్‌ చేయడం ద్వారా నోకియా వికెట్ల పతనాన్ని ఆరంభించాక.. మిగతా బౌలర్లూ పంజాబ్‌ను దెబ్బతీశారు. శార్దూల్‌ ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్లో రాజపక్స (4), శిఖర్‌ ధావన్‌ (19)ను ఔట్‌ చేసి ఆ జట్టుకు పెద్ద షాకిచ్చాడు. ఆ తర్వాత స్పిన్నర్లు అక్షర్‌, కుల్‌దీప్‌ విజృంభించడంతో మయాంక్‌ (0), లివింగ్‌స్టోన్‌ (3), హర్‌ప్రీత్‌  బ్రార్‌ (1), రిషి ధావన్‌ (4) పెవిలియన్‌కు   క్యూ కట్టారు. పంజాబ్‌ 13 ఓవర్లలో 82/7కు పరిమితం కావడంతో దిల్లీ విజయం లాంఛనమే అనిపించింది. కానీ కథ అంత తేలిగ్గా ముగియలేదు. వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మన్‌ జితే2శ్‌ శర్మ దిల్లీని కంగారు పెట్టాడు. అప్పటిదాకా మరోవైపు వికెట్లు పోతున్నా పట్టుదలగా నిలిచిన అతడు.. క్రమంగా భారీ షాట్లు ఆడాడు. అతడికి అండగా నిలిచిన రాహుల్‌ చాహర్‌ (25 నాటౌట్‌) కూడా భారీ షాట్లు ఆడడంతో మ్యాచ్‌ ఆసక్తికరంగా మారింది. పంజాబ్‌ చివరి మూడు ఓవర్లలో 39 పరుగులు చేయాల్సిన పరిస్థితి. కానీ ప్రమాదకరంగా కనిపిస్తోన్న జితేశ్‌ను శార్దూల్‌ ఔట్‌ చేయడంతో దిల్లీ ఊపిరిపీల్చుకుంది. శార్దూల్‌ నకుల్‌ బాల్‌కు భారీ షాట్‌ ఆడబోయిన జితేశ్‌.. వార్నర్‌ ముందుకు దూకుతూ అందుకున్న చక్కని క్యాచ్‌కు నిష్క్రమించాడు. రబాడ ఓ సిక్స్‌ కొట్టినా.. తర్వాతి బంతికే వెనుదిరిగాడు. 19వ ఓవర్లో అద్భుతంగా బౌలింగ్‌ చేసిన నోకియా కేవలం మూడు పరుగులే ఇచ్చాడు. చివరి ఓవర్లో 26 పరుగులు చేయాల్సిన స్థితిలో పంజాబ్‌ ఓటమి ఖాయమైపోయింది.

రాణించిన మార్ష్‌: అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దిల్లీకి.. లివింగ్‌స్టోన్‌ తొలి బంతికే షాకిచ్చాడు. ఓపెనర్‌ వార్నర్‌ను అతడు ఔట్‌ చేశాడు. అయితే మరోవైపు మిచెల్‌ మార్ష్‌, మరో ఓపెనర్‌ సర్ఫరాజ్‌ (32) ధాటైన బ్యాటింగ్‌తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. 4 ఓవర్లకు స్కోరు 45/1. అయితే అదే దూకుడుతో అర్ష్‌దీప్‌ బౌలింగ్‌లో సిక్స్‌కు ప్రయత్నించిన సర్ఫరాజ్‌.. ఓ స్లో బంతికి బోల్తా కొట్టాడు. మిడాన్‌లో చాహర్‌కు చిక్కాడు. క్రీజులో నిలదొక్కుకున్న మార్ష్‌.. లలిత్‌ (24)తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించాడు. స్కోరు వేగం తగ్గినా.. 11వ ఓవర్లో 98/2తో దిల్లీ మెరుగ్గానే కనిపించింది. కానీ ఓవైపు మార్ష్‌ నిలబడ్డా.. చకచకా లలిత్‌, పంత్‌ (7), పావెల్‌ (2) వికెట్లు కోల్పోయి 112/5తో ఇబ్బందుల్లో పడింది. ఆ దశలో అక్షర్‌ పటేల్‌ (17 నాటౌట్‌)తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించిన మార్ష్‌.. కొన్ని చక్కని షాట్లు ఆడాడు. 18 ఓవర్లలో స్కోరు 149/5. అయితే చివరి రెండు ఓవర్లలో రబాడ, అర్ష్‌దీప్‌ పది పరుగులే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టారు. 19వ ఓవర్లో మార్ష్‌ను రబాడ వెనక్కి పంపాడు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని