ముగింపు ఘనంగా..

ప్రపంచకప్‌ స్టేజ్‌- 2 ఆర్చరీ టోర్నీని భారత్‌ ఘనంగా ముగించింది. శనివారం పురుషుల కాంపౌండ్‌ జట్టు స్వర్ణం నెగ్గింది. గత నెల స్టేజ్‌- 1 ఫైనల్లో ఫ్రాన్స్‌ను చిత్తుచేసిన అభిషేక్‌ వర్మ, అమన్‌ సైని, రజత్‌ చౌహాన్‌ త్రయం..

Published : 22 May 2022 04:03 IST

కాంపౌండ్‌ పురుషుల జట్టుకు స్వర్ణం

గ్వాంగ్జు: ప్రపంచకప్‌ స్టేజ్‌- 2 ఆర్చరీ టోర్నీని భారత్‌ ఘనంగా ముగించింది. శనివారం పురుషుల కాంపౌండ్‌ జట్టు స్వర్ణం నెగ్గింది. గత నెల స్టేజ్‌- 1 ఫైనల్లో ఫ్రాన్స్‌ను చిత్తుచేసిన అభిషేక్‌ వర్మ, అమన్‌ సైని, రజత్‌ చౌహాన్‌ త్రయం.. ఈ సారి కూడా అదే ప్రత్యర్థిని ఓడించి వరుసగా రెండో బంగారు పతకాన్ని ముద్దాడింది. తుదిపోరులో భారత్‌ 232-230 తేడాతో ఫ్రాన్స్‌పై గెలిచింది. తొలి రెండు రౌండ్లు ముగిసే సరికి ప్రత్యర్థి కంటే ఒక పాయింట్‌ వెనకబడ్డా.. ఆ తర్వాత భారత ఆర్చర్లు అద్భుతంగా పుంజుకున్నారు. లక్ష్యానికి సరిగ్గా బాణాలను గురిపెట్టి పాయింట్లు సాధించారు. మూడో రౌండ్లో ఆరు సార్లు పదికి పది పాయింట్లు ఖాతాలో వేసుకున్నారు. ప్రత్యర్థి ఆర్చర్లు 56 పాయింట్లు మాత్రమే రాబట్టడంతో ఆ రౌండ్‌ ముగిసే సరికి భారత్‌కు మూడు పాయింట్ల ఆధిక్యం దక్కింది. ఇక చివరి రౌండ్లో 58-59తో నిలిచినా ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది. ఓవరాల్‌గా రెండు పాయింట్ల తేడాతో భారత్‌ జయకేతనం ఎగురవేసింది. మరోవైపు కాంపౌండ్‌ పురుషుల వ్యక్తిగత విభాగంలో సంచలన ప్రదర్శనతో ప్రపంచ 223వ ర్యాంకర్‌ భరద్వాజ్‌ రజతం సొంతం చేసుకున్నాడు. 32 ఏళ్ల అతను సెమీస్‌లో 143-141తో ప్రపంచ ఛాంపియన్‌ నికో వీనర్‌ (ఆస్ట్రియా)కు షాకిచ్చాడు. ఫైనల్లో అతను 141-149తో ప్రపంచ నంబర్‌వన్‌ మైక్‌ షులోసర్‌ (నెదర్లాండ్స్‌) చేతిలో ఓడాడు. ఇక కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ కాంస్య పతక పోరులో అభిషేక్‌- అవ్‌నీత్‌ జోడీ 156-155తో అమిక్రాన్‌- సుజర్‌ (టర్కీ)పై గెలిచింది. దీంతో భారత్‌ ఓ స్వర్ణం సహా అయిదు పతకాలతో టోర్నీ ముగించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని