ఎదురులేని స్వైటెక్‌

ఫ్రెంచ్‌ ఓపెన్లో పోలెండ్‌ స్టార్‌ ఇగా స్వైటెక్‌ దూసుకెళ్తోంది. ఈ టాప్‌సీడ్‌ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రిక్వార్టర్స్‌లో ప్రవేశించింది. మహిళల సింగిల్స్‌ మూడో రౌండ్లో స్వైటెక్‌ 6-3, 7-5తో కొవినిచ్‌ (మాంటెనెగ్రో)పై విజయం సాధించింది.

Published : 29 May 2022 02:22 IST

ప్రిక్వార్టర్స్‌లో ప్రవేశం
మెద్వెదెవ్‌, జ్వెరెవ్‌ ముందంజ

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్లో పోలెండ్‌ స్టార్‌ ఇగా స్వైటెక్‌ దూసుకెళ్తోంది. ఈ టాప్‌సీడ్‌ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రిక్వార్టర్స్‌లో ప్రవేశించింది. మహిళల సింగిల్స్‌ మూడో రౌండ్లో స్వైటెక్‌ 6-3, 7-5తో కొవినిచ్‌ (మాంటెనెగ్రో)పై విజయం సాధించింది. తొలి సెట్‌ 8వ గేమ్‌లో కొవినిచ్‌ సర్వీస్‌ బ్రేక్‌ చేసిన స్వైటెక్‌.. అదే జోరుతో సెట్‌ గెలిచింది. కానీ రెండో సెట్లో ప్రత్యర్థి నుంచి స్వైటెక్‌కు ప్రతిఘటన ఎదురైంది. కానీ పదొకొండో గేమ్‌లో కొవినిచ్‌ చేసిన అనవసర తప్పిదాన్ని సొమ్ము చేసుకుంటూ స్వైటెక్‌ సెట్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. ఆమెకిది వరుసగా 31వ సింగిల్స్‌ విజయం. మూడో సీడ్‌ బదోసా (స్పెయిన్‌) ఇంటిముఖం పట్టింది. కుదెరెమెత్సోవా (రష్యా)తో పోరులో 3-6, 1-2తో ఉన్న స్థితిలో గాయం కారణంగా బదోసా పోటీ నుంచి తప్పుకుంది. ఏడో సీడ్‌ సబలెంకా 6-4, 1-6, 0-6తో గియార్గి (ఇటలీ) చేతిలో కంగుతింది. జంగ్‌ (చైనా), కమెలియా (రొమేనియా), జెస్సికా (అమెరికా), కసకీనా (రష్యా) కూడా ప్రిక్వార్టర్స్‌ చేరారు.

మెద్వెదెవ్‌ తేలిగ్గా..: పురుషుల సింగిల్స్‌లో మెద్వెదెవ్‌ ప్రిక్వార్టర్స్‌ చేరాడు. ఈ రెండో సీడ్‌ పెద్దగా కష్టపడకుండానే ముందంజ వేశాడు. మూడో రౌండ్లో మెద్వెదెవ్‌ 6-2, 6-4, 6-2తో కెమనోవిచ్‌ (సెర్బియా)ను ఓడించాడు. యువ కెరటం అల్కరస్‌ (స్పెయిన్‌), జర్మనీ స్టార్‌ జ్వెరెవ్‌ కూడా ప్రిక్వార్టర్స్‌ చేరారు. అల్కరస్‌ 6-4, 6-4, 6-2తో కొర్డా (అమెరికా)పై నెగ్గగా.. జ్వెరెవ్‌ 7-6 (7/2), 6-3, 7-6 (7/5)తో నకషిమా (అమెరికా)ను ఓడించాడు. ఏడో సీడ్‌ రుబ్‌లెవ్‌ (రష్యా) 6-4, 3-6, 6-2, 7-6 (13/11)తో గారిన్‌ (చిలీ)పై.. సినర్‌ (ఇటలీ) 6-3, 7-6 (8/6), 6-3తో మెక్‌డొనాల్డ్‌ (అమెరికా)పై, సిలిచ్‌ (క్రొయేషియా)   6-0, 6-3, 6-2తో సైమన్‌ (ఫ్రాన్స్‌)పై నెగ్గి ప్రిక్వార్టర్స్‌ చేరారు.

బోపన్న జోడీ సంచలనం: భారత స్టార్‌ రోహన్‌ బోపన్న-మాట్‌ మిడిల్‌కాప్‌ (నెదర్లాండ్స్‌) జంట ఫ్రెంచ్‌ ఓపెన్లో సంచలనం సృష్టించింది. మూడో రౌండ్లో బోపన్న జంట 6-7 (5/7), 7-6 (7/3), 7-6 (12/10)తో వింబుల్డన్‌ ఛాంపియన్లు, రెండోసీడ్‌ జంట మెటిచ్‌-పవిచ్‌ (క్రొయేషియా)కు షాకిచ్చింది. ఈ పోరులో అయిదు మ్యాచ్‌ పాయింట్ల కాపాడుకుని మరీ భారత్‌-నెదర్లాండ్స్‌ జంట గెలవడం విశేషం. మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలి రౌండ్లో బోపన్న-క్లెపాక్‌ (స్లోవేనియా) 6-1, 6-4తో మహ్మద్‌ (అమెరికా)-గ్లాస్‌పోల్‌ (బ్రిటన్‌)పై నెగ్గారు. మహిళల డబుల్స్‌ రెండో రౌండ్లో సానియా-హెడ్రెకా (చెక్‌ రిపబ్లిక్‌) 6-3, 6-4తో జువాన్‌-జిదాన్‌సెక్‌ (స్లొవేనియా)పై గెలిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని