Updated : 01 Jun 2022 08:04 IST

మళ్లొచ్చాడు.. మెరుపు వీరుడు

టీ20 లీగ్‌ ఇన్నేళ్లలో ఎందరో ఆణిముత్యాల్ని వెలుగులోకి తెచ్చింది. అందులో హార్దిక్‌ పాండ్య కూడా ఒకడు. ఎలాంటి బౌలింగ్‌నైనా తుత్తునియలు చేయగల విధ్వంసక బ్యాటింగ్‌, ఎంతటి బ్యాట్స్‌మెన్‌నైనా బోల్తా కొట్టించగల పదునైన బౌలింగ్‌తో భారత క్రికెట్‌ అభిమానుల మనసు దోచిన ఈ కుర్రాడు.. సరైన ఆల్‌రౌండర్‌ కోసం ఎన్నో ఏళ్ల టీమ్‌ఇండియా ఎదురు చూపులకు తెరదించినట్లే కనిపించాడు. మరో కపిల్‌దేవ్‌ అంటూ అతడిపై ప్రశంసలు.. భారీ అంచనాలు! కొంత కాలం ఆ అంచనాలకు తగ్గ ఆటతీరునే ప్రదర్శించిన హార్దిక్‌.. ఉన్నట్లుండి కింద పడ్డాడు. అందరి నమ్మకాన్ని కోల్పోయాడు. ఇక అతడి పనైపోయినట్లే అనుకుంటుండగా.. ఈ టీ20 లీగ్‌లో ఆటగాడిగా, కెప్టెన్‌గా సత్తా చాటుకుని ఎంతో ఎత్తుకు ఎదిగిపోయాడు.

ఈనాడు క్రీడావిభాగం

2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ గుర్తుందా? భారత అభిమానులకు తీవ్ర మనోవేదన కలిగించిన ఆ మ్యాచ్‌లో.. ఊరట హార్దిక్‌ పాండ్య మెరుపులే. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో భారత్‌ ముందు 338 పరుగుల భారీ లక్ష్యం నిలిస్తే.. 72 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి మన జట్టు ఘోర పరాభవం దిశగా సాగుతున్న దశలో మేటి పాక్‌ బౌలింగ్‌ను ఉతికారేస్తూ హార్దిక్‌ ఆడిన 76 పరుగుల ఇన్నింగ్స్‌ (43 బంతుల్లో 4×4, 6×6)ను అంత సులువుగా మరిచిపోలేం. ఇక తర్వాతి ఏడాది దక్షిణాఫ్రికా పర్యటన సందర్భంగా టెస్టు మ్యాచ్‌లో కఠినమైన కేప్‌టౌన్‌ పిచ్‌పై భారత్‌ 92/7తో నిలిచిన దశలో హార్దిక్‌ వీరోచిత ఇన్నింగ్స్‌ (95 బంతుల్లో 93; 14×4, 1×6)ను కూడా అభిమానులకు ఇంకా గుర్తే. ఇది హార్దిక్‌కు తొలి విదేశ పర్యటన, తనకది నాలుగో టెస్టు మాత్రమే. ఈ రెండు మ్యాచ్‌ల్లో హార్దిక్‌ బంతితోనూ సత్తా చాటడం విశేషం. అందుకే అతణ్ని మరో కపిల్‌ అంటూ అప్పుడందరూ కీర్తించారు. ఆ తర్వాత కొంత కాలం హార్దిక్‌ ఆట బాగానే సాగింది. మూడు ఫార్మాట్లలో ఆల్‌రౌండర్‌గా సేవలందిస్తూ జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు.

2019.. అంతా తలకిందులు

టీ20 లీగ్‌లో ముంబయి తరఫున అదరగొట్టడం ద్వారా వెలుగులోకి వచ్చాడు హార్దిక్‌. బ్యాటుతో, బంతితో సత్తా చాటడంతో అతను టీమ్‌ఇండియాలోకి రావడానికి ఎంతో సమయం పట్టలేదు. 2016లో టీ20 జట్టులోకి వచ్చిన అతను.. ఏడాదిన్నరకే టెస్టు జట్టులో అడుగు పెట్టాడు. రెండేళ్లలో టీమ్‌ఇండియా ప్రధాన ఆటగాళ్లలో ఒకడయ్యాడు. కానీ 2019లో అతడి కెరీర్‌ అనూహ్యంగా పక్కదారి పట్టింది. ఆ ఏడాది ఆరంభంలో ఒక టీవీ షోలో మహిళల గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా తీవ్ర విమర్శలు ఎదుర్కొని కొన్ని మ్యాచ్‌ల పాటు బీసీసీఐ నిషేధానికి గురయ్యాడు హార్దిక్‌. ఆ ప్రభావం అతడి ఆటపై పడింది. దీనికి తోడు వెన్ను గాయం అతడి కెరీర్‌కు బ్రేకులేసింది. 2019లో వెన్నుకు శస్త్రచికిత్స చేయించుకున్నాక కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. పైగా అప్పట్నుంచి అతడి శరీరం సున్నితంగా మారి, బౌలింగ్‌కు దూరం కావాల్సి వచ్చింది. 2020  టీ20 లీగ్‌ ద్వారా ఆటలోకి పునరాగమనం చేసినప్పటికీ సీజన్‌ మొత్తం బౌలింగే చేయలేదు. ఆపై టీమ్‌ఇండియాలోకి తిరిగి వచ్చినా పూర్తి స్థాయిలో బౌలింగ్‌ చేయలేకపోయాడు. ఫిట్‌నెస్‌ సమస్యలు కొనసాగడం, బౌలింగ్‌ చేయలేని పరిస్థితికి రావడం, బ్యాటింగ్‌ అంతంతమాత్రంగా ఉండడంతో టీమ్‌ఇండియాలో హార్దిక్‌కు చోటు గల్లంతైంది. టీ20 లీగ్‌లో మొదట్నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముంబయి సైతం అతణ్ని వదిలి పెట్టింది. దీంతో హార్దిక్‌ పనైపోయిందని అంతా ఓ నిర్ణయానికి వచ్చేశారు.

ఒక్క దెబ్బతో..

టీ20 లీగ్‌లోకి కొత్తగా అడుగు పెడుతున్న గుజరాత్‌.. హార్దిక్‌ పాండ్యను కెప్టెన్‌గా ఎంచుకోవడం చూసి జాలిపడ్డ వాళ్లే ఎక్కువమంది. అతడి ఫామ్‌ అలా ఉంది మరి. కానీ అంత గొప్పగా ఏమీ లేని జట్టు అద్భుత ప్రదర్శనతో టైటిల్‌ గెలవడంలో హార్దికే అత్యంత కీలక పాత్ర పోషించాడు. ఆటగాడిగా, కెప్టెన్‌గా అతను వేసిన ముద్ర చాలా ప్రత్యేకమైంది. కెప్టెన్‌గా తనపై ఎంత బాధ్యత ఉందో గుర్తించి టీ20 లీగ్‌ ఆరంభానికి ముందు అతను ఫిట్‌నెస్‌ మీద దృష్టిసారించాడు. మళ్లీ దృఢంగా తయారయ్యాడు. బౌలింగ్‌నూ మెరుగుపరుచుకున్నాడు. తొలి మ్యాచ్‌ నుంచే బంతి అందుకుని నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి తన ఫిట్‌నెస్‌, బౌలింగ్‌ నైపుణ్యాలపై సందేహాలు వ్యక్తం చేసిన వారికి సమాధానం చెప్పాడు. అలాగే బ్యాటుతోనూ అదరగొట్టాడు. 15 మ్యాచ్‌ల్లో 487 పరుగులతో టోర్నీ టాప్‌స్కోర్లలో నాలుగో స్థానం సాధించాడు. గుజరాత్‌ తరఫున అత్యధిక పరుగుల వీరుడు పాండ్య. అంతే కాక అతను 8 వికెట్లు కూడా పడగొట్టాడు. ఫైనల్లో 3 వికెట్లు, 34 పరుగులతో ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గానూ నిలిచి జట్టు కప్పు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు హార్దిక్‌. ఇక కెప్టెన్‌గానూ హార్దిక్‌ జట్టును నడిపించిన వైనం, చూపిన పరిణతి దిగ్గజాలను ఆకట్టుకుంది. సునీల్‌ గావస్కర్‌ సహా చాలామంది అతడిపై ప్రశంసల జల్లు కురిపించారు. అతణ్ని టీమ్‌ఇండియా భావి కెప్టెన్‌గా అభివర్ణించారు. హార్దిక్‌ ఈ ప్రదర్శనతో వెంటనే టీమ్‌ఇండియాలో మళ్లీ చోటు సంపాదించాడు. కోహ్లి నుంచి కొత్తగా పగ్గాలందుకున్న రోహిత్‌కు 35 ఏళ్లొచ్చేశాయి. అతను వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్‌ తర్వాత సారథిగా కొనసాగడం అనుమానమే. కేఎల్‌ రాహుల్‌ ఇప్పటిదాకా కెప్టెన్‌గా రుజువు చేసుకున్నది లేదు. కాబట్టి హార్దిక్‌ ఆటగాడిగా నిలకడను కొనసాగిస్తూ, టీ20 లీగ్‌ కెప్టెన్‌గా మరో ఏడాది బలమైన ముద్ర వేయగలిగితే భవిష్యత్‌లో టీమ్‌ఇండియా పగ్గాలు అందుకోవడం లాంఛనమే కావచ్చు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని