Mithali Raj: శభాష్‌.. మిథూ

అదో ముళ్ల బాట.. సన్నటి ఓ దారి మాత్రమే ఉంది. దానిపై నుంచే ఒక్కొక్కరు ముందుకు వెళ్తున్నారు. ఆ మార్గాన్ని చూసి భయపడి కొంతమంది వెనకడగు వేశారు. మరికొంత మంది ఇక తమ వల్ల కాదంటూ.. మధ్యలోనే పయనాన్ని ఆపేశారు. కానీ ఆ అమ్మాయి తొలి అడుగుతోనే సరికొత్త చరిత్రకు నాంది పలికింది.

Updated : 09 Jun 2022 07:37 IST

ఈనాడు - హైదరాబాద్‌


అదో ముళ్ల బాట.. సన్నటి ఓ దారి మాత్రమే ఉంది. దానిపై నుంచే ఒక్కొక్కరు ముందుకు వెళ్తున్నారు. ఆ మార్గాన్ని చూసి భయపడి కొంతమంది వెనకడగు వేశారు. మరికొంత మంది ఇక తమ వల్ల కాదంటూ.. మధ్యలోనే పయనాన్ని ఆపేశారు. కానీ ఆ అమ్మాయి తొలి అడుగుతోనే సరికొత్త చరిత్రకు నాంది పలికింది.
ధైర్యంగా నడక మొదలెట్టిన తను.. ఒడుదొడుకులు ఎదురైనా ముందుకే సాగింది. కింద పడ్డా తిరిగి పైకి లేచింది. అస్తవ్యస్తంగా ఉన్న ఆ దారిని.. అకుంఠిత దీక్షతో ఆకట్టుకునే రహదారిగా మార్చింది. ఇప్పుడా మార్గంలో ఎంతో మంది తమ కలలను నిజం చేసుకునేందుకు ప్రయాణం చేస్తున్నారు. అడ్డంకులను దాటి అసాధ్యాన్ని అందుకున్న ఆమె పేరు మిథాలీ రాజ్‌. భారత మహిళల క్రికెట్‌కు సరికొత్త ఊపిరి పోసి.. భవిష్యత్‌ తరాల కోసం ఆ మార్గాన్ని పటిష్ఠంగా నిర్మించి.. ఇప్పుడు ఆట నుంచి పక్కకు తప్పుకున్న దిగ్గజం. దేశంలో అమ్మాయిల ఆటకు ఆదరణ పెంచిన స్ఫూర్తి శిఖరం.

 

సవాళ్లను దాటి..

మిథాలీ రాజ్‌.. భారత మహిళల క్రికెట్‌కు దిక్సూచి. రెండు దశాబ్దాలకు పైగా అమ్మాయిల ఆటకు కర్త, కర్మ, క్రియ అన్నీ తానే. అసలు అమ్మాయిల క్రికెట్‌ అనేది ఒకటుందని కూడా దేశంలో అధిక శాతం జనాలకు తెలియని రోజుల్లో మిథాలీ ఆటలో అడుగుపెట్టింది. తొమ్మిదేళ్ల వయసులోనే బ్యాట్‌ పట్టి.. అప్పటి నుంచి ఆటే లోకంగా పెరిగిన ఆమె భారత మహిళల క్రికెట్‌ తలరాతనే మార్చింది. తన తండ్రి ప్రోత్సాహంతో ఆటలో అడుగుపెట్టి చిన్నప్పటి నుంచే అద్భుతమైన ఆటతీరుతో ప్రతి దశలోనూ సవాళ్లను సమర్థంగా దాటుకుంటూ ముందుకు సాగింది. ఆమె ఆట మొదలెట్టిన తొలినాళ్లలో తనతో కలిసి సాధన చేసేందుకు మరో అమ్మాయి కూడా లేదు. అయినా అబ్బాయిలతోనే కలిసి ఆడుతూ.. అంచెలంచెలుగా ఎదిగింది. వసతుల లేమి.. ఆర్థిక ఇబ్బందులు.. సరైన మార్గనిర్దేశనం లేకపోవడం.. ఇలా ఎన్ని సమస్యలు ఎదురైనా ఆమె ఆగలేదు. 14 ఏళ్లకే 1997 ప్రపంచకప్‌ కోసం ప్రకటించిన భారత జట్టు ప్రాబబుల్స్‌కు ఎంపికై సంచలనం సృష్టించింది. అప్పుడు తుదిజట్టులో అవకాశం రాలేదు. అయితేనేం 1999లో ఐర్లాండ్‌తో వన్డేతో 16 ఏళ్లకే అంతర్జాతీయ అరంగేట్రం చేసి తొలి మ్యాచ్‌లోనే అజేయ సెంచరీతో అదరగొట్టింది. ఇక ఆ తర్వాత జరిగిందంతా ఓ చరిత్రే. ఆమె ఆటకు రికార్డులు సలామ్‌ కొట్టాయి. గణాంకాలు ఆమె ముందు మోకరిల్లాయి.


అదే నిబద్ధత..  

ఎన్ని ఆటంకాలు ఎదురైనా తన కెరీర్‌ సాంతం నిబద్ధతతో మిథాలీ ముందుకు సాగింది. అమ్మాయిల ఆటకు ఆర్థికంగా ఎలాంటి అండ లేదు. అప్పటికీ బీసీసీఐ కూడా పట్టించుకోవడం లేదు. మ్యాచ్‌లాడేందుకు వెళ్తే ఎలాంటి ఆదాయం లేకపోగా చేతి నుంచి ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఇదీ 2006లో బీసీసీఐ గొడుకు కిందకు చేరే వరకు మహిళల క్రికెట్‌ పరిస్థితి. దీంతో చాలా మంది అమ్మాయిల మధ్యలోనే ఆట వదిలేశారు. కానీ మిథాలీ మాత్రం ఏనాడూ అలాంటి ఆలోచన కూడా చేయలేదు. ఎంత కష్టమైనా భరించింది. దేశానికి ప్రాతినిథ్యం వహిస్తూ మైదానంలో అడుగుపెట్టడమే తనకు ఆనందమని తలచింది. అందుకే 16 ఏళ్ల వయసులో తొలి మ్యాచ్‌ ఆడినప్పుడు.. 39 ఏళ్ల వయసులో చివరి మ్యాచ్‌ ఆడినప్పుడూ ఆమెలో అదే తపన. పెళ్లి తర్వాత క్రికెట్‌లో కొనసాగకూడదని అబ్బాయి షరతు పెట్టడంతో వివాహమే వద్దనుకుంది. ఆర్థికంగా ఎదిగేందుకు ఇతర అవకాశాలు వచ్చినా.. ఆటనే నమ్ముకుంది. ఆమెకు రైల్వేలో ఉద్యోగం తర్వాత పరిస్థితి కాస్త ఆశాజనకంగా మారింది. బీసీసీఐలో మహిళల క్రికెట్‌ విలీనంతో దశ తిరిగింది. కానీ ఏమీ లేని రోజుల్లో ఆటనే పట్టుకుని కూర్చుని.. జట్టును విజయాల వైపు నడిపించిన ఆమె నిబద్ధత గొప్పది.


తరాలు మారినా..

మిథాలీ అంటే కేవలం ఓ బ్యాటర్‌, కెప్టెన్‌ మాత్రమే కాదు. భారత మహిళల క్రికెట్‌ జట్టు ఆత్మ ఆమె. ఆటలో ఆమె ఎదుగుదల కేవలం తనకే పరిమితం కాలేదు. అది మొత్తం జట్టును అభివృద్ధి వైపు నడిపించిన మంత్రం అనే చెప్పాలి. జాతీయ జట్టును, మిథాలీని వేరు చేసి చూడడం అసాధ్యం. ఎలాంటి ఆసరా, కెరీర్‌పై భరోసా లేని సమయంలో దేశం కోసం నిలబడ్డ ఆమె జట్టును ఉన్నత శిఖరాలకు చేర్చింది. తన కంటే సీనియర్లు, తన సహచరులు, తన జూనియర్లు.. ఇలా మూడు తరాల క్రికెటర్లతో కలిసి ఆడింది. 16 ఏళ్ల వయసులో.. పూర్ణిమారావు, అంజుమ్‌ చోప్రా లాంటి సీనియర్లతో.. 2005 నాటికి జట్టులోని తన ఈడు వాళ్లతో.. 2009 తర్వాత తన కంటే జూనియర్లతో కలిసి సాగింది. 22 ఏళ్లకే సారథ్య పగ్గాలు చేపట్టి సీనియర్లు మొదలు.. తన అంతర్జాతీయ కెరీర్‌ అంత అనుభవం లేని జూనియర్లకూ కెప్టెన్‌గా వ్యవహరించింది. టీ20లకు వీడ్కోలు పలికాక.. వన్డే, టెస్టు జట్లకు నాయకురాలిగా కొనసాగింది. ఆమెను స్ఫూర్తిగా తీసుకుని ఎంతో మంది అమ్మాయిలు క్రికెట్‌ వైపు నడిచారు.  


ఇంత చేస్తే..

ఎలాంటి ఆదరణ దక్కని రోజుల్లో అమ్మాయిల ఆటకు అండగా మిథాలీ నిలిచింది. 2005 వన్డే ప్రపంచకప్‌లో సారథిగా జట్టును ఫైనల్‌ చేర్చడం ఆమె కెరీర్‌లో ఓ కీలక మైలురాయి అని చెప్పొచ్చు. దాని తర్వాతే అమ్మాయిల ఆటపై దేశంలో ఆసక్తి పెరిగింది. ఇక 2017 ప్రపంచకప్‌లో కెప్టెన్‌గా మరోసారి జట్టును టైటిల్‌ పోరుకు తీసుకెళ్లింది. ఫైనల్లో జట్టు ఓడినా దేశం మొత్తం అమ్మాయిలకు అండగా నిలబడడం, స్వదేశానికి తిరిగొచ్చిన వాళ్లకు మునుపెన్నడూ లేని విధంగా అపూర్వ స్వాగతం పలకడం ప్రత్యేకంగా నిలిచిపోయింది. ఆ తర్వాతే దేశంలో మహిళల క్రికెట్‌కు ఊపొచ్చింది. ఇంత చేసిన మిథాలీకి 2018లో ఓ చేదు అనుభవం ఎదురైంది. వేగంగా ఆడలేకపోతుందంటూ ఆ ఏడాది టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌ మ్యాచ్‌ ఆడకుండా ఆమెపై వేటు వేశారు. ఇలా ఎందుకు చేశారని అడిగితే తను నెమ్మదిగా ఆడుతుందంటూ ఆమె నిబద్ధతను ప్రశ్నించారు. దీంతో తీవ్ర ఆవేదన చెందిన ఆమె.. అది తనకు చీకటి రోజని వ్యాఖ్యానించింది. ఆ సంఘటనతో కుంగిపోకుండా మళ్లీ పుంజుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని