Mithali Raj: కెరీర్‌ చివరికి వచ్చేశానని అప్పుడే తెలుసు..

మిథాలీ రాజ్‌ లేని భారత మహిళల క్రికెట్‌ను ఊహించలేం. దేశంలో అతివల క్రికెట్‌కు ప్రాచుర్యం లభించడంలో ఆమె పాత్ర అంత ముఖ్యమైంది. మిథాలీ 23 ఏళ్ల కెరీర్‌లో ఆసక్తికర విశేషాలెన్నో! సుదీర్ఘ ప్రయాణాన్ని ముగిస్తూ.. ఆటకు వీడ్కోలు పలికిన ఆమె తన కెరీర్‌ను ఓసారి అవలోకనం చేసుకుంది. ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన విషయాలివి.

Updated : 10 Jun 2022 06:59 IST

దిల్లీ

మిథాలీ రాజ్‌ లేని భారత మహిళల క్రికెట్‌ను ఊహించలేం. దేశంలో అతివల క్రికెట్‌కు ప్రాచుర్యం లభించడంలో ఆమె పాత్ర అంత ముఖ్యమైంది. మిథాలీ 23 ఏళ్ల కెరీర్‌లో ఆసక్తికర విశేషాలెన్నో! సుదీర్ఘ ప్రయాణాన్ని ముగిస్తూ.. ఆటకు వీడ్కోలు పలికిన ఆమె తన కెరీర్‌ను ఓసారి అవలోకనం చేసుకుంది. ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన విషయాలివి.

అందుకు సిద్ధంగా ఉన్నా: నా కెరీర్‌ ముగింపునకు వచ్చేసిందని నాకు తెలుసు. అందుకు నేను సిద్ధంగానే ఉన్నా. న్యూజిలాండ్‌లో వన్డే ప్రపంచకప్‌కు ముందే అదే నా చివరి ప్రపంచకప్‌ అని నాకు తెలుసు. నిర్ణయం తీసుకోవడానికి నాకు కొంత సమయం అవసరమైందంతే. ఇంత సుదీర్ఘకాలం దేశానికి సేవ చేసినందుకు సంతోషంగా ఉంది.

మార్పులకు తగినట్లు..: 2005 ప్రపంచకప్‌ ఫైనల్‌ తర్వాత భారతదేశంలో మహిళల క్రికెట్‌కు గుర్తింపు రావడం మొదలైంది. బీసీసీఐ నియంత్రణలోకి రావడం, సెంట్రల్‌ కాంట్రాక్టులు ఇవ్వడం కూడా మహిళల క్రికెట్‌ ఎదుగుదలకు కారణమయ్యాయి. దేశవాళీ క్రికెట్‌ వ్యవస్థ కూడా మెరుగైంది. జాతీయ క్రికెట్‌ అకాడమీకి వెళ్లి అత్యుత్తమ సౌకర్యాలను ఉపయోగించుకునే అవకాశం దక్కింది. టీ20 ఫార్మాట్‌ రావడం కూడా ఆటకు ఉపకరించింది. మార్పులకు అనుగుణంగా నేను కూడా సర్దుకుపోయా. ఆధునిక క్రికెట్‌కు తగినట్లుగా ఆటలో మార్పులు చేసుకున్నా.

అవి మరిచిపోలేనివి: నా కెరీర్‌లో ఎన్నో మరిచిపోలేనేని సందర్భాలు ఉన్నాయి. విదేశాల్లో గెలవడం, రెండు సార్లు వన్డే ప్రపంచకప్‌ ఫైనల్స్‌ చేరడం అందులో కొన్ని. కొన్ని వైఫల్యాలు కూడా ఉన్నాయి. అవి నాలో పట్టుదలను పెంచాయి. నా కెప్టెన్సీలో భారత జట్టు 2013 ప్రపంచకప్‌లో కనీసం సూపర్‌ 6 దశకు చేరలేపోయింది. అది తీవ్ర నిరాశను కలిగించింది. 2017 ప్రపంచకప్‌కు ఇంకా మంచి జట్టుతో దిగాలనుకున్నా. కోచ్‌లు, సెలక్టర్ల సహకారంతో ఆ దిశగా పని చేశా. ఫలితంగా మేం 2017 ప్రపంచకప్‌ ఫైనల్‌ చేరుకున్నాం.

అప్పుడే వీడ్కోలు చెబుదామనుకున్నా..: కెరీర్‌లో అత్యుత్తమ స్థితిలో ఉన్నప్పుడు గాయాల బారిన పడడం నా కెరీర్‌లో అత్యంత క్లిష్టమైన దశ. నొప్పితో ఆడి బాగా ఇబ్బంది పడ్డా. 2009లో అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్‌ కావడం గురించి కూడా ఆలోచించా. రిటైరైనంత మాత్రానా క్రికెట్‌కు దూరం కాను. ఇక ముందు కూడా క్రికెట్‌ ప్రాచుర్యాన్ని పెంచడం కోసం పని చేస్తా. చిన్నప్పటి నుంచి క్రికెట్టే నా జీవితం. అవకాశం వస్తే ఏ హోదాలోనైనా దేశంలో మహిళల క్రికెట్‌ కోసం పని చేయడానికి నేను సిద్ధమే.


అమ్మాయిలకు నువ్వు స్ఫూర్తి: సచిన్‌

ముంబయి: ఉజ్వల కెరీర్‌ను ముగించిన మిథాలీ రాజ్‌కు సచిన్‌ అభినందనలు తెలిపాడు. ఆమ్మాయిలకు ఆమె స్ఫూర్తిగా నిలిచిందని అన్నాడు. ‘‘నీ కెరీర్‌ అద్భుతం. అభినందనలు మిథాలీ రాజ్‌. 23 ఏళ్ల పాటు భారత క్రికెట్‌కు ఎంతో చేశావు. భారత్‌కు ఆడాలనుకునే అమ్మాయిలకు నువ్వు స్ఫూర్తి. నీ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నా’’ అని సచిన్‌ ట్వీట్‌ చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని