Sunil Gavaskar: పంత్‌.. ఆ విషయాన్ని మర్చిపోయి ఉండొచ్చు.. ఒకసారి ఆలోచించుకో: గావస్కర్‌

 తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన టీమ్‌ఇండియా.. మూడో టీ20లో నెగ్గి సిరీస్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది. సమస్యలైతే అలాగే ఉన్నాయి. ముఖ్యంగా పంత్‌ ఫామ్‌ ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో అతడు తన బ్యాటింగ్‌పై ఆ

Updated : 16 Jun 2022 08:25 IST

ముంబయి:  తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన టీమ్‌ఇండియా.. మూడో టీ20లో నెగ్గి సిరీస్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది. సమస్యలైతే అలాగే ఉన్నాయి. ముఖ్యంగా పంత్‌ ఫామ్‌ ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో అతడు తన బ్యాటింగ్‌పై ఆత్మపరిశీలన చేసుకోవాలని మాజీ కెప్టెన్‌ గావస్కర్‌ వ్యాఖ్యానించాడు. భారత టీ20 లీగ్‌లో పెద్దగా రాణించలేకపోయిన పంత్‌ దక్షిణాఫ్రికాపైనా పేలవ ప్రదర్శన చేస్తు విమర్శలు ఎదుర్కొంటున్నాడు. 25, 5, 6.. దక్షిణాఫ్రికాతో గత మూడు టీ20ల్లో అతడి గణాంకాలివి. ‘‘పంత్‌ వచ్చీ రాగానే ఫోర్లు, సిక్స్‌లు కొట్టాలని జనం ఆశిస్తారు. గత 3-4 ఏళ్లలో అతడు గొప్పగా రాణించడమే అందుకు కారణం. అందుకే అతడిపై అంచనాలతో ఉన్నారు. దాని వల్లే నిరాశచెందుతున్నారు. ఇప్పుడు అతడు అవలోకనం చేసుకోవాలన్నది నా ఉద్దేశం. ఓ ఆటగాడు కెప్టెన్సీ వల్ల కొన్ని సార్లు తన ఆట గురించి తాను ఆలోచించుకోడు. ఇతరులు (బౌలర్లు లేదా బ్యాటర్లు) గురించి ఆలోచిస్తాడు. పంత్‌ ఇప్పుడు తన సొంత బ్యాటింగ్‌లో ఏమైనా సాంకేతిక సమస్యలు ఉండొచ్చన్న విషయాన్ని మర్చిపోయాడు. ఇప్పుడిక పంత్‌ కూర్చుని దాని గురించి ఆలోచించుకోవాలి. అన్నింటికన్నా ముందు.. మూడో టీ20లో భారత్‌ గెలవడం వల్ల అతడు కాస్త తేలికపడతాడు. ఒత్తిడి తగ్గిపోతుంది. అప్పుడు తన బ్యాటింగ్‌ గురించి ఆలోచించుకోవాలి’’ అని గావస్కర్‌ వ్యాఖ్యానించాడు. తన ఔట్‌ కావడానికి కారణమవుతున్న షాట్లను ఆడకుండా ఉండేందుకు ప్రయత్నించాలని పంత్‌కు అతడు సూచించాడు. భారీ షాట్లు ఆడే క్రమంలో పంత్‌ వికెట్‌ పోగొట్టుకుంటున్న నేపథ్యంలో గావస్కర్‌ ఈ సలహా ఇచ్చాడు. అతడు స్ట్రెయిట్‌గా షాట్లు ఆడితే మంచి ఫలితం ఉంటుందన్న అభిప్రాయం అతడు వ్యక్తం చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని