IND vs ENG: రోహిత్‌ కష్టమే.. బుమ్రాకు పగ్గాలు!

ఇంగ్లాండ్‌తో టెస్టు మ్యాచ్‌లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఆడే అవకాశం దాదాపు లేనట్లే.  కొన్ని రోజుల కిందట కరోనా బారిన పడ్డ రోహిత్‌కు తాజాగా నిర్వహించిన పరీక్షల్లో మరోసారి పాజిటివ్‌ వచ్చింది. దీంతో శుక్రవారం ఆరంభమయ్యే టెస్టుకు దూరమవక తప్పేలాలేదు.

Updated : 30 Jun 2022 08:49 IST

దిల్లీ: ఇంగ్లాండ్‌తో టెస్టు మ్యాచ్‌లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఆడే అవకాశం దాదాపు లేనట్లే.  కొన్ని రోజుల కిందట కరోనా బారిన పడ్డ రోహిత్‌కు తాజాగా నిర్వహించిన పరీక్షల్లో మరోసారి పాజిటివ్‌ వచ్చింది. దీంతో శుక్రవారం ఆరంభమయ్యే టెస్టుకు దూరమవక తప్పేలాలేదు. ‘‘రోహిత్‌కు తాజాగా నిర్వహించిన ఆర్టీ పీసీఆర్‌ పరీక్షలో పాజిటివ్‌ వచ్చింది. ఇంకా ఐసోలేషన్‌లోనే ఉన్న అతను.. ఇంగ్లాండ్‌తో టెస్టుకు అందుబాటులో ఉండడు. కేఎల్‌ రాహుల్‌ కూడా అందుబాటులో లేడు కాబట్టి గతంలో వైస్‌కెప్టెన్‌గా వ్యవహరించిన బుమ్రా జట్టు పగ్గాలు చేపడతాడు’’ అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. కానీ టీమ్‌ఇండియా కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మాత్రం రోహిత్‌ మ్యాచ్‌కు దూరమైనట్లు ధ్రువీకరించలేదు. ‘‘రోహిత్‌ పరిస్థితిని వైద్య బృందం సమీక్షిస్తోంది. అతనింకా మ్యాచ్‌కు దూరం కాలేదు. అందుబాటులోకి రావాలంటే రెండుసార్లు కొవిడ్‌ పరీక్షల్లో నెగెటివ్‌ రావాలి. బుధవారం రాత్రి, గురువారం ఉదయం పరీక్షలు జరుగుతాయి. ఏం జరుగుతుందో చూద్దాం’’ అని ద్రవిడ్‌ పేర్కొన్నాడు. రోహిత్‌ మ్యాచ్‌కు దూరమైతే ఫాస్ట్‌బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా టీమ్‌ఇండియా సారథ్య బాధ్యతలు చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ విషయమై ద్రవిడ్‌ను అడిగితే.. దీనిపై ప్రకటన చేయాల్సింది చీఫ్‌ సెలక్టర్‌ చేతన్‌ శర్మ అని, తాను కాదని పేర్కొన్నాడు. బుమ్రాకు పగ్గాలు దక్కితే కపిల్‌ దేవ్‌ (1987) తర్వాత టెస్టుల్లో భారత జట్టుకు నాయకత్వం వహించనున్న ఫాస్ట్‌బౌలర్‌గా రికార్డులకెక్కుతాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని