Cricket news: శ్రేయస్‌ అదరహో..

టీమ్‌ ఇండియా జోరును కొనసాగించింది. వెస్టిండీస్‌ పర్యటనను ఘనంగా ముగించింది. ముందే టీ20 సిరీస్‌ గెలిచిన భారత్‌ ఆదివారం, చివరిదైన అయిదో మ్యాచ్‌లో 88 పరుగుల తేడాతో

Updated : 08 Aug 2022 04:07 IST

ఆఖరి టీ20లో విండీస్‌ చిత్తు
సిరీస్‌ 4-1తో భారత్‌ వశం

లాడెర్‌హిల్‌: టీమ్‌ ఇండియా జోరును కొనసాగించింది. వెస్టిండీస్‌ పర్యటనను ఘనంగా ముగించింది. ముందే టీ20 సిరీస్‌ గెలిచిన భారత్‌ ఆదివారం, చివరిదైన అయిదో మ్యాచ్‌లో 88 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును చిత్తు చేసింది. శ్రేయస్‌ అయ్యర్‌ (64; 40 బంతుల్లో 8×4, 2×6) చెలరేగడంతో మొదట భారత్‌ 7 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఛేదనలో వెస్టిండీస్‌ తడబడింది. రవి బిష్ణోయ్‌ (4/16), అక్షర్‌ పటేల్‌ (3/15), కుల్‌దీప్‌ యాదవ్‌ (3/12) ధాటికి 15.4 ఓవర్లలో 100 పరుగులకే ఆలౌటైంది. హెట్‌మయర్‌ (56; 35 బంతుల్లో 5×4, 4×6) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. సిరీస్‌ 4-1తో టీమ్‌ ఇండియా సొంతమైంది. ఈ మ్యాచ్‌లో భారత్‌.. రోహిత్‌, పంత్‌, భువనేశ్వర్‌, సూర్యకుమార్‌కు విశ్రాంతినిచ్చింది. జట్టుకు హార్దిక్‌ నాయకత్వం వహించాడు.

శ్రేయస్‌ ధనాధన్‌: భారత్‌ ఇన్నింగ్స్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ ఆటే హైలైట్‌. చెలరేగి ఆడిన అతడు జట్టు మెరుగైన స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. టీమ్‌ఇండియా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఇషాన్‌ కిషన్‌ (11)తో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభించిన శ్రేయస్‌ చకచకా బౌండరీలు బాదాడు. అయిదో ఓవర్లో ఇషాన్‌ నిష్క్రమించేటప్పటికి స్కోరు 38. చక్కని బ్యాటింగ్‌ను కొనసాగించిన శ్రేయస్‌.. ఆ తర్వాత దీపక్‌ హుడా (38; 25 బంతుల్లో 3×4, 2×6)తో కలిసి మరో విలువైన భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ధాటిగా ఆడిన ఈ జోడీ రెండో వికెట్‌కు వేగంగా 76 పరుగులు జోడించడంతో 12వ ఓవర్లో భారత్‌ 114/1తో బలమైన స్థితిలో నిలిచింది. కానీ అదే ఓవర్లో హుడా వెనుదిరిగాడు. ఆ తర్వాతి ఓవర్లోనే శ్రేయస్‌ ఔటయ్యాడు. ఆ తర్వాత హార్దిక్‌ (28; 16 బంతుల్లో 2×4, 2×6).. సంజు శాంసన్‌ (15)తో నాలుగో వికెట్‌కు 20, కార్తీక్‌ (12)తో అయిదో వికెట్‌కు 16, అక్షర్‌ పటేల్‌ (9)తో ఆరో వికెట్‌కు 23 పరుగులు జోడించి ఆఖరి ఓవర్లో రనౌటయ్యాడు. హోల్డర్‌ వేసిన ఇన్నింగ్స్‌ 19వ ఓవర్లో హార్దిక్‌ వరుసగా 6, 4, 6 బాదేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని