IND vs ZIM: ధావన్‌ కాదు రాహుల్‌

జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్‌కు  టీమ్‌ఇండియా కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌ వ్యవహరించనున్నాడు. అతను పూర్తి ఫిట్‌నెస్‌ సాధించాడని బీసీసీఐ వైద్య బృందం నిర్ధరించడంతో పగ్గాలు అప్పగించారు. నిజానికి వెస్టిండీస్‌తో సిరీస్‌లో రాహుల్‌ ఆడాల్సింది. హెర్నియా శస్త్రచికిత్స నుంచి కోలుకున్న తర్వాత అతనికి కరోనా సోకడంతో ఆ పర్యటనకు దూరమయ్యాడు.

Updated : 12 Aug 2022 08:57 IST

జింబాబ్వేతో సిరీస్‌కు భారత కెప్టెన్‌గా కేఎల్‌
దిల్లీ

జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్‌కు  టీమ్‌ఇండియా కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌ వ్యవహరించనున్నాడు. అతను పూర్తి ఫిట్‌నెస్‌ సాధించాడని బీసీసీఐ వైద్య బృందం నిర్ధరించడంతో పగ్గాలు అప్పగించారు. నిజానికి వెస్టిండీస్‌తో సిరీస్‌లో రాహుల్‌ ఆడాల్సింది. హెర్నియా శస్త్రచికిత్స నుంచి కోలుకున్న తర్వాత అతనికి కరోనా సోకడంతో ఆ పర్యటనకు దూరమయ్యాడు. మొదట జింబాబ్వేతో సిరీస్‌కు ఎంపిక చేసిన 15 మంది ఆటగాళ్ల జట్టులోనూ అతనికి చోటు ఇవ్వలేదు. ఆసియాకప్‌నకు ముందు అతను పూర్తిస్థాయిలో కోలుకోవాలనే ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు ధావన్‌ను సారథిగా ప్రకటించారు. కానీ ఇప్పుడు ఫిట్‌నెస్‌ సాధించిన రాహుల్‌ జట్టులోకి తిరిగొచ్చాడు. అన్ని ఫార్మాట్లలోనూ తొలి ప్రాధాన్య వైస్‌ కెప్టెన్‌ కాబట్టి ఇప్పుడు పగ్గాలు రాహుల్‌కే అందించారు. ధావన్‌ ఈ సిరీస్‌కు వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. రాహుల్‌ రాకతో ఆటగాళ్ల సంఖ్య 16కు పెరిగింది. రుతురాజ్‌ గైక్వాడ్‌కు తుది జట్టులో చోటు దక్కడం కష్టమే. ఈ నెల 18న ఆరంభమయ్యే ఈ సిరీస్‌ నుంచి సారథి రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, పంత్‌, శ్రేయస్‌, బుమ్రా, షమి విశ్రాంతి తీసుకున్న సంగతి తెలిసిందే. వెన్ను గాయంతో బుమ్రా ఆసియా కప్‌నకూ దూరమయ్యాడు.

భారత జట్టు: కేఎల్‌ రాహుల్‌ (కెప్టెన్‌), ధావన్‌ (వైస్‌ కెప్టెన్‌), రుతురాజ్‌, శుభ్‌మన్‌ గిల్‌, దీపక్‌ హుడా, రాహుల్‌ త్రిపాఠి, ఇషాన్‌ కిషన్‌, శాంసన్‌, వాషింగ్టన్‌ సుందర్‌, శార్దూల్‌, కుల్‌దీప్‌, అక్షర్‌, అవేశ్‌, ప్రసిద్ధ్‌, సిరాజ్‌, దీపక్‌ చాహర్‌.

సుందర్‌కు మళ్లీ గాయం: టీమ్‌ఇండియా స్పిన్‌ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ మరోసారి గాయపడ్డాడు. ఇంగ్లాండ్‌లో జరుగుతున్న రాయల్‌ లండన్‌ వన్డే కప్‌లో లాంక్‌షైర్‌ తరపున ఆడుతున్న అతనికి వర్సెస్టర్‌షైర్‌తో మ్యాచ్‌లో భుజం గాయమైంది. ఫీల్డింగ్‌లో డైవ్‌ చేసినప్పుడు సుందర్‌ ఎడమ భుజంపై భారం పడింది. దీంతో అతను మైదానాన్ని వీడాడు. ఈ విషయాన్ని లాంక్‌షైర్‌ క్రికెట్‌ ట్వీట్‌ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి సుందర్‌ భారత జట్టుకు ఆడలేదు. ఐపీఎల్‌లో చేతి గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఈ గాయం నుంచి కోలుకున్న అతను లాంక్‌షైర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. కానీ ఇప్పుడు జింబాబ్వేలో భారత పర్యటన ముందు మళ్లీ గాయపడ్డాడు. జింబాబ్వేతో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు సుందర్‌ జట్టులో ఉన్నాడు. కానీ ఇప్పుడు గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే అతను ఈ సిరీస్‌కూ దూరమయ్యే అవకాశం ఉంది. సుందర్‌ గాయంపై బీసీసీఐ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు.

జింబాబ్వే కెప్టెన్‌గా చకబ్వ: భారత్‌తో మూడు వన్డేల సిరీస్‌లో తలపడే జింబాబ్వే జట్టుకు బ్యాటర్‌ రెజిస్‌ చకబ్వ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. రెగ్యులర్‌ కెప్టెన్‌ క్రెయిగ్‌ ఇర్విన్‌ గాయపడడంతో చకబ్వాకు పగ్గాలు అప్పగించారు. ఆగస్టు 18న తొలి వన్డే.. 20, 22 తేదీల్లో రెండు, మూడు వన్డేలు జరుగుతాయి.

జింబాబ్వే జట్టు: చకబ్వ (కెప్టెన్‌), చివాంగ, ఇవాన్స్‌, జాంగ్వె, ఇన్నోసెంట్‌ కయా, కైటానో, మద్వెరె, మరుమని, మసారా, మన్యంగ, గవారా, న్యూచి, సికిందర్‌ రజా, షుంబా, టిరిపానో, బర్ల్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని