logo

అగ్రాసనం అంటివి.. మరణశాసనం రాస్తివి

వ్యవసాయం దండగ కాదు.. పండగ చేస్తామని ఆర్భాటపు ప్రకటనలిచ్చిన సీఎం జగన్‌ ఆచరణలో అన్నదాతను గాలికొదిలేశారు.

Updated : 26 Apr 2024 05:07 IST

 వ్యవసాయాన్ని పండగ చేస్తానని పట్టించుకోని జగన్‌
 సాగు సాగక.. ప్రభుత్వ సాయమందక
 ఉరికొయ్యల పాలవుతున్న అన్నదాతలు

చిత్తూరు(వ్యవసాయం), న్యూస్‌టుడే: వ్యవసాయం దండగ కాదు.. పండగ చేస్తామని ఆర్భాటపు ప్రకటనలిచ్చిన సీఎం జగన్‌ ఆచరణలో అన్నదాతను గాలికొదిలేశారు. సాగుకు బ్యాంకుల నుంచి రుణాలు అందక, అధిక వడ్డీలకు తెచ్చి పంట పండిస్తే గిట్టుబాటు ధర దక్కక రైతు కుప్పకూలుతున్నాడు. ప్రభుత్వం ఆపన్నహస్తం అందిచకపోవడంతో కర్షకులు ఉరికొయ్యల పాలవుతున్నారు. వైకాపా ఐదేళ్ల పాలనలో పలమనేరు, పుంగనూరు, కుప్పం, పూతలపటు,్ట, నగరి నియోజకవర్గాల్లో ప్రభుత్వ లెక్కల ప్రకారం 31 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. అనధికారికంగా పెద్దసంఖ్యలో ప్రాణాలు తీసుకున్నారు.

ఆర్భాటానికే ఆర్బీకేలు..

రైతుభరోసా కేంద్రాలు ఆర్భాటానికే తప్ప అన్నదాతకు ఒనగూరింది శూన్యం. జిల్లాలో 502 ఆర్బీకేలు ఉన్నప్పటికీ ఆధునిక సాగు విస్తరణ సేవలు అన్నదాత దరి చేరడం లేదు. యూరియా మినహా మిగిలిన ఎరువులు ఉండవు. ఇక పురుగు మందులు, విత్తనాల విక్రయాల ఊసే లేదు.

వడ్డీ లేని రుణాలా.. తూచ్‌

రైతులకు వడ్డీ లేని పంట రుణాలు ఇస్తామన్నారు. తీరా అధికారంలోకి వచ్చాక రూ.లక్ష వరకే అని నిబంధన పెట్టారు. అదీ వడ్డీతో సహా ముందే కట్టిస్తున్నారు. కొర్రీలపై కొర్రీలేసి కొందర్ని తప్పించి వడ్డీ రాయితీ ఎప్పుడిస్తారో తెలియని పరిస్థితి. పావలా వడ్డీ ఎత్తేశారు. ఈ-పంట నమోదు నిబంధన పేరుతో వడ్డీ రాయితీని అధిక శాతం మంది రైతులకు దూరం చేశారు.

బిందు సేద్యం చుట్టేశారు

వైకాపా ప్రభుత్వం రాగానే బిందుసేద్యానికి మంగళం పాడారు. తొలుత మూడేళ్లు పరికరాల పంపిణీ ఊసే లేకపోగా గతేడాది కొందరికి నామమాత్రంగా అందజేసి చేతులు దులుపుకొన్నారు. డ్రిప్‌ కంపెనీలకు బిల్లులు ఇవ్వకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది.

మామిడి బోర్డు ఎక్కడ?

జిల్లాలో ప్రధాన వాణిజ్య పంట మామిడి. 53 వేల హెక్టార్లలో మామిడి విస్తరించింది. వైకాపా ప్రభుత్వం మామిడి బీమా పథకాన్ని ఎత్తివేసి ప్రోత్సాహక పథకాలను ఆపేసింది. గత ఎన్నికల ప్రచారంలో జగన్‌ ఇచ్చిన మామిడి బోర్డు ఏర్పాటు హామీ కలగా మిగిలిపోయింది.

పట్టు పథకాలకు మంగళం

జగన్‌ పట్టు సాగు పథకాలకు మంగళం పాడారు. పట్టుగూళ్ల ప్రోత్సాహక నగదు ఇవ్వలేదు. రాయితీ వేపపిండి, క్రిమిసంహారక మందులు, యంత్ర పరికరాలు, షెడ్ల నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా నగదు అందలేదని రైతులు వాపోతున్నారు.

అప్పుల భారం తీరలేదు

బైరెడ్డిపల్లె మండలం ఎర్రకదిరేపల్లెకు చెందిన రైతు హనుమంతరెడ్డి రెండెకరాల పొలంలో బోరు బావి ద్వారా పంటలు సాగు చేసేవారు. అవి చేతికందకపోవడం, బావి అడుగంటడంతో గతేడాది ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్య సుజాత రెండు ఆవుల పెంపకంతో కుమార్తె గౌతమిని కేజీబీవీలో చదివిస్తోంది. ప్రభుత్వం నుంచి సాయమందినా అప్పులు తీర్చలేకపోయింది.

‘స్రాగు కలిసి రాక.. కుమార్తె ఆరోగ్యం సరిలేక్ఞ

బైరెడ్డిపల్లె: వ్యవసాయం కలిసి రాక రమేష్‌రెడ్డి ఏడాది కిందట తనువు చాలించాడు. 3 ఎకరాల్లో బోర్లు వేసి పంటల సాగుకు రూ.లక్షల్లో అప్పులు చేశారు. ఇంతలో ఏడాదిన్నర కుమార్తెకు క్యాన్సర్‌ అని తెలియడంతో కాపాడుకోవడానికి రూ.10 లక్షలు అప్పు చేసి ఖర్చు పెట్టారు. పంటలకు గిట్టుబాటు ధర లేక వచ్చిన ఆదాయం సాగు అప్పు కూడా తీరలేదు.  చిన్నారి ఆరోగ్యం నయం కాకపోగా అప్పుల భారంతో పొలంలోనే ఉరేసుకున్నాడు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదు. ‘భర్తను కోల్పోయా. బిడ్డనూ బతికించుకోలేకపోయా. ప్రభుత్వం వితంతు పింఛను కూడా ఇవ్వలేకపోయింది’ అంటూ మూగనపల్లెకు చెందిన రమేష్‌రెడ్డి భార్య సావిత్రి కన్నీటి పర్యంతమైంది.

ఐదేళ్లలో జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతులు - 42
ప్రభుత్వ లెక్కల ప్రకారం నమోదైన సంఖ్య - 31


సాగు అంటేనే

భయమేస్తోంది: నాలుగెకరాల్లో మిరప సాగు చేశా. మల్చింగ్‌ పద్ధతిలో చేద్దామంటే రాయితీల్లేవు. పంటకు తెగుళ్లు సోకి నష్టపోయా. ఇంత జరుగుతున్నా వైకాపా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

 కమలాకర్‌, రైతు, పేయనపల్లి, గుడిపాల

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని