స్వర్ణం నెగ్గకపోవడం నిరాశ కలిగించింది

చెస్‌ ఒలింపియాడ్‌లో భారత మహిళల జట్టు స్వర్ణం గెలవకపోవడం నిరాశ కలిగించిందని గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక చెప్పింది. కానీ జట్టు కాంస్యం నెగ్గడం సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొంది. నిండు గర్భంతో ఉన్నా హారిక ఈ టోర్నీలో ఆడింది.

Published : 14 Aug 2022 04:01 IST

చెన్నై: చెస్‌ ఒలింపియాడ్‌లో భారత మహిళల జట్టు స్వర్ణం గెలవకపోవడం నిరాశ కలిగించిందని గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక చెప్పింది. కానీ జట్టు కాంస్యం నెగ్గడం సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొంది. నిండు గర్భంతో ఉన్నా హారిక ఈ టోర్నీలో ఆడింది. ‘‘చెస్‌ ఒలింపియాడ్‌లో భారత మహిళల జట్టు ఈసారి స్థిరంగా రాణించింది. స్వర్ణం గెలవకపోవడం నిరాశ కలిగించింది. కాంస్యం గెలవడం కూడా గొప్ప ప్రదర్శనే. నాకు ఇది వరుసగా తొమ్మిదో ఒలింపియాడ్‌. ఏ భారత అమ్మాయి ఇన్ని చెస్‌ ఒలింపియాడ్‌లు ఆడి ఉండదు. ఈ ఈవెంట్లో టీమ్‌ పతకం గెలవాలని చాలా ఏళ్లుగా కోరుకుంటున్నా’’ అని హారిక చెప్పింది. ఒలింపియాడ్‌ భారత్‌లో కాకుండా విదేశాల్లో జరిగి ఉంటే ఆడేదాన్ని కాదేమోనని హారిక పేర్కొంది. ‘‘నిండు గర్భంతో ఉన్నా. చెస్‌ ఒలింపియాడ్‌ విదేశాల్లో జరిగి ఉంటే ఆడకపోయేదాన్ని. కానీ డాక్టర్‌ భరోసా ఇవ్వడంతో ఈ టోర్నీ బరిలో దిగాను. ఫలితాల కంటే నా ఆట పట్ల సంతృప్తిగా ఉన్నా. అవసరమైతేనే నన్ను ఆడించాలని అనుకున్నారు. కానీ బలమైన ప్రత్యర్థి జట్లు ఎదురు పడడంతో పోటీపడాల్సి వచ్చింది. కాంస్యాలు గెలిచిన భారత జట్లకు తమిళనాడు ప్రభుత్వం చెరో రూ.కోటి ప్రకటించడం చాలా సంతోషంగా అనిపించింది. సాధారణంగా భారత చెస్‌లో ఇలా నగదు బహుమతులు ఇవ్వడం అరుదు’’ అని హారిక చెప్పింది. హారిక, కోనేరు హంపి, వైశాలి, తానియా సచ్‌దేవ్‌, భక్తి కులకర్ణిలతో కూడిన భారత మహిళల జట్టు టీమ్‌ విభాగంలో కాంస్యం గెలిచి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. 2004లో హారిక తొలి ఒలింపియాడ్‌ ఆడింది.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని