ఫార్మాట్‌ ఏదైనా అదే ఉత్సాహం

దేశంలో ఏ ఫార్మాట్లో క్రికెట్‌ ఆడినా ఎంతో ఉత్సాహం ఉంటుందని భారత మహిళా బ్యాటర్‌ స్మృతి మంధాన చెప్పింది. ప్రస్తుతం ఆమె ఇంగ్లాండ్‌లో మహిళల హండ్రెడ్‌ లీగ్‌లో సౌథర్న్‌ బ్రేవ్‌ జట్టుకు ఆడుతోంది. ఓవల్‌ ఇన్విన్సిబుల్స్‌తో మ్యాచ్‌లో 25 బంతుల్లోనే 46

Published : 16 Aug 2022 02:49 IST

దిల్లీ: దేశంలో ఏ ఫార్మాట్లో క్రికెట్‌ ఆడినా ఎంతో ఉత్సాహం ఉంటుందని భారత మహిళా బ్యాటర్‌ స్మృతి మంధాన చెప్పింది. ప్రస్తుతం ఆమె ఇంగ్లాండ్‌లో మహిళల హండ్రెడ్‌ లీగ్‌లో సౌథర్న్‌ బ్రేవ్‌ జట్టుకు ఆడుతోంది. ఓవల్‌ ఇన్విన్సిబుల్స్‌తో మ్యాచ్‌లో 25 బంతుల్లోనే 46 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. ఆ మ్యాచ్‌ అనంతరం ‘‘భారత్‌లో వచ్చే ఏడాది మహిళల ఐపీఎల్‌ జరగనుంది. అప్పుడు సొంతగడ్డపై ఇదే ఉత్సాహం ఉంటుందా?’’ అని విలేకరి అడిగిన ప్రశ్నకు ఆమె నవ్వుతూ, తల ఆడిస్తూ సమాధానమిచ్చింది. ‘‘ఫార్మాట్‌తో సంబంధం లేకుండా స్వదేశంలో ఎప్పుడు ఆడినా ఎంతో ఉత్సాహం ఉంటుందని అనుకుంటున్నా. భారత అభిమానులు క్రికెట్‌ను ప్రేమిస్తారు. వన్డే లేదా టీ20.. ఇలా ఏ ఫార్మాట్లోనైనా వాళ్లు మాకు మద్దతుగా నిలుస్తారు. కాబట్టి మహిళల ఐపీఎల్‌ ఇంకా గొప్పగా ఉండబోతుంది’’ అని ఆమె పేర్కొంది. 2023లో మహిళల ఐపీఎల్‌కు శ్రీకారం చుట్టడం కోసం బీసీసీఐ కసరత్తులు చేస్తోంది. అందుకు అనువైన సమయం కోసం షెడ్యూల్‌ను రూపొందించే పనిలో ఉంది. పురుషుల ఐపీఎల్‌తో పాటు అమ్మాయిల కోసం 2018 నుంచి టీ20 ఛాలెంజ్‌ టోర్నీ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు పూర్తిస్థాయిలో మహిళల ఐపీఎల్‌ మొదలెట్టనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని