అండగా నిలిస్తే అద్భుతాలే: గోపీచంద్‌

అథ్లెటిక్స్‌లో చిన్నగా మొదలుపెట్టిన ప్రయత్నాలు గొప్ప ఫలితాల్ని అందిస్తున్నాయని జాతీయ బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ అన్నాడు. రెండు రాష్ట్రాల నుంచి ఎంతోమంది అథ్లెట్లు ఛాంపియన్లుగా నిలుస్తున్నారని.. జీవితంలో స్థిరపడుతున్నారని తెలిపాడు.

Published : 19 Aug 2022 02:35 IST

ఈనాడు, హైదరాబాద్‌: అథ్లెటిక్స్‌లో చిన్నగా మొదలుపెట్టిన ప్రయత్నాలు గొప్ప ఫలితాల్ని అందిస్తున్నాయని జాతీయ బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ అన్నాడు. రెండు రాష్ట్రాల నుంచి ఎంతోమంది అథ్లెట్లు ఛాంపియన్లుగా నిలుస్తున్నారని.. జీవితంలో స్థిరపడుతున్నారని తెలిపాడు. సాయ్‌- గోపీచంద్‌- మైత్రా ఆధ్వర్యంలో శిక్షణ తీసుకుంటున్న ద్యుతి చంద్‌, యర్రాజి జ్యోతి, రజిత, నందిని అంతర్జాతీయ వేదికలపై సత్తాచాటడం గర్వంగా ఉందని చెప్పాడు. కామన్వెల్త్‌ క్రీడల్లో 4×100 మీ రిలేలో ఫైనల్‌ చేరిన ద్యుతి చంద్‌, జ్యోతి.. ప్రపంచ అండర్‌-20 అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు అర్హత సాధించిన రజిత, నందినిలను గురువారం గోపీచంద్‌ అభినందించాడు. ఆరేళ్లుగా మైత్రా అందిస్తున్న సహకారంతో ఎంతోమంది క్రీడాకారులు ప్రతిభ కనబరుస్తున్నారని ఈ సందర్భంగా గోపీచంద్‌ వ్యాఖ్యానించాడు. ‘‘2004లో హైదరాబాద్‌ 10కె రన్‌ అథ్లెటిక్స్‌ పోటీలు ప్రారంభించాం. రన్‌తో వచ్చే ప్రైజ్‌మనీతో చాలామంది అథ్లెట్లకు ఉపయోగపడింది. 2015లో ద్యుతి చంద్‌కు గోపీచంద్‌ అకాడమీలో వసతి కల్పించాం. ద్రోణాచార్య అవార్డీ నాగపురి రమేశ్‌ శిక్షణలో ఆమె అద్భుతాలు చేస్తోంది. మైత్రా సహాయంతో ద్యుతి, జ్యోతి, నందిని, ప్రణయ్‌ వంటి అథ్లెట్లు సత్తాచాటుతున్నారు. అత్యంత పేదరికం నుంచి వచ్చిన వీళ్లంతా గొప్పగా రాణిస్తున్నారు. కాస్త అండగా నిలిస్తే అద్భుతాలు చేస్తున్నారు. తాజాగా ‘ఈనాడు’ కూడా అథ్లెట్లను ప్రోత్సహిస్తుంది. రామోజీరావు మార్గనిర్దేశనంలో ‘లక్ష్య’ ప్రాజెక్టు రెండు రాష్ట్రాల్లో సుమారు వెయ్యి మంది చిన్నారులకు తర్ఫీదు ఇస్తోంది. ఇప్పటి వరకు వాళ్లు జాతీయ స్థాయిలో 58, రాష్ట్ర స్థాయిలో 244 పతకాలు సాధించారు. తెలుగు రాష్ట్రాల అథ్లెటిక్స్‌లో ‘లక్ష్య’ కీలక మలుపు కానుంది’’ అని గోపీచంద్‌ తెలిపాడు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts