తడిసిన హృదయంతో ఉద్వేగానికి లోనైన నాదల్‌

శుక్రవారం అర్ధరాత్రి 2:30 దాటింది.. లేవర్‌ కప్‌లో ఓ డబుల్స్‌ మ్యాచ్‌ ముగిసింది.. స్టేడియంలో ఉన్న అభిమానుల్లో దుఃఖం కట్టలు తెంచుకుంది. సహచర, ప్రత్యర్థి ఆటగాళ్లూ బాధలో మునిగిపోయారు. అందరి కళ్లు నీళ్లతో నిండిపోయాయి. అక్కడ ముగిసింది కేవలం ఓ మ్యాచ్‌ మాత్రమే కాదు..

Published : 25 Sep 2022 03:26 IST

ప్రొఫెషనల్‌ ఆటకు ఫెదరర్‌ గుడ్‌బై

శుక్రవారం అర్ధరాత్రి 2:30 దాటింది.. లేవర్‌ కప్‌లో ఓ డబుల్స్‌ మ్యాచ్‌ ముగిసింది.. స్టేడియంలో ఉన్న అభిమానుల్లో దుఃఖం కట్టలు తెంచుకుంది. సహచర, ప్రత్యర్థి ఆటగాళ్లూ బాధలో మునిగిపోయారు. అందరి కళ్లు నీళ్లతో నిండిపోయాయి. అక్కడ ముగిసింది కేవలం ఓ మ్యాచ్‌ మాత్రమే కాదు.. ఓ టెన్నిస్‌ వీరుడి ప్రొఫెషనల్‌ కెరీర్‌. తన కళాత్మక ఆట సొగసుతో ప్రపంచ టెన్నిస్‌ అభిమానులను కట్టిపడేసిన ఫెదరర్‌ చివరి మ్యాచ్‌ ఆడేశాడు. ఉబికి వస్తున్న కన్నీళ్లతో.. తడబడుతున్న మాటలతో..   తడిసిన హృదయంతో కోర్టును వీడాడు. అతని నిష్క్రమణతో ప్రత్యర్థి నాదల్‌ కూడా వెక్కివెక్కి ఏడ్చాడు.

లండన్‌

20 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు ఖాతాలో వేసుకున్న ఫెదరర్‌ ఓటమితో ప్రొఫెషనల్‌ టెన్నిస్‌కు వీడ్కోలు పలికాడు. టీమ్‌ యూరోప్‌ కోసం తన చివరి మ్యాచ్‌లో నాదల్‌తో కలిసి డబుల్స్‌ ఆడాడు. ఫెదరర్‌- నాదల్‌ జోడీ 6-4, 6-7 (2-7), 9-11 తేడాతో తియోఫొ- సాక్‌ (టీమ్‌ వరల్డ్‌) చేతిలో ఓడింది. కేవలం అధికారిక రికార్డుల కోసమే ఈ గణాంకాలు. ఈ మ్యాచ్‌లో గెలుపోటములు ఎవరికీ అవసరం లేదు. అందరి దృష్టి ఫెదరర్‌ మీదే. చివరి సారి కోర్టులో తన సొగసైన ఆటను చూడడం మీదే. మ్యాచ్‌ పాయింట్‌ కోసం చేసిన సాక్‌ సర్వీస్‌ను రిటర్న్‌ చేస్తూ చివరగా ఫెదరర్‌ నాలుగు షాట్లు ఆడాడు. కోర్టులో మరో మూలకు సాక్‌ బంతిని కొట్టడంతో మ్యాచ్‌ ముగిసింది. ఆ వెంటనే నాదల్‌, తియోఫొ, సాక్‌లను ఫెదరర్‌ హత్తుకున్నాడు. కోర్టు బయట ఉన్న జకోవిచ్‌తో సహా ఇతర ఆటగాళ్లను కలుస్తూ.. అభిమానులకు అభివాదం చేస్తూ తన్నుకు వస్తున్న కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు. స్టాండ్స్‌లో ఉన్న అతని భార్య మిర్కా కన్నీళ్లు పెట్టుకుంది. ఆటగాళ్లు, ప్రేక్షకులూ భావోద్వేగానికి గురయ్యారు. అతని పక్కన కూర్చున్న నాదల్‌ కూడా బోరుమన్నాడు. 18 ఏళ్లుగా మైదానంలో ప్రత్యర్థులుగా తలపడి, బయట మంచి మిత్రులుగా ఎదిగిన ఈ ఇద్దరూ ఇలా కన్నీళ్లు పెడుతుంటే టెన్నిస్‌ లోకమే కరిగిపోయింది. ఆట ప్రమాణాలు పెంచి, టెన్నిస్‌కే ఆకర్షణగా నిలిచిన ఈ ద్వయం తమ స్నేహ బంధంతో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారు. కోర్టులో ప్రత్యర్థులు ఎంత తీవ్రతతో తలపడాలో చూపించిన ఈ ఇద్దరు.. బయట ఒకరిపై మరొకరికి గౌరవం ఉండాలనే విషయాన్ని చాటిచెప్పారు. టెన్నిస్‌లో ఎంతోమంది ఆటగాళ్లు రావొచ్చు. దిగ్గజాలుగా ఎదగొచ్చు. కానీ మరో ఫెదరర్‌ మాత్రం రాడు. అతని లాంటి ఆటగాణ్ని టెన్నిస్‌ ప్రపంచం మళ్లీ చూడడం కష్టమే.


ఇదో అద్భుతమైన రోజు. నేను సంతోషంగానే ఉన్నా. నా బూట్లు వేసుకోవడం దగ్గర నుంచి చివరిసారిగా కోర్టులో గడిపిన సమయాన్ని ఆస్వాదించా. ఎలాంటి గాయం లేకుండా మ్యాచ్‌ ముగించా. నాదల్‌తో కలిసి ఆడడం గొప్పగా ఉంది. కోర్టు నుంచి బయటకు వెళ్లాక ఒక్కసారిగా ఒంటరిగా అనిపించింది. కానీ జట్టుగా ఆడుతూ గుడ్‌బై చెప్పడం బాగుంది. నా కెరీర్‌లో టైటిళ్ల గురించి ఆలోచించకుండా ఆటను ఆస్వాదించా. స్నేహితులతో సమయం గడిపా. ఈ ప్రయాణం పరిపూర్ణమైంది. మరోసారి ఇదే బాటలో సాగాలని ఉంది. ఈ ప్రయాణంలో నా కుటుంబం అండగా నిలిచింది. నా తల్లిదండ్రులు, పిల్లలు, భార్య మిర్కా ఇక్కడే ఉన్నారు. మిర్కా నన్ను నడిపించింది. చాలా కాలం క్రితమే కావాలనుకుంటే ఆమె నన్ను ఆపేది. కానీ ఆడమని ప్రోత్సహించింది. నా తల్లిదండ్రులకు కృతజ్ఞతలు. చివరగా అందరికీ ధన్యవాదాలు’’

- కన్నీళ్లతో ఫెదరర్‌


‘‘ఎవరైనా అనుకున్నారా.. మైదానంలో ఇద్దరు శత్రువులు ఇలా ఒకరికోసం ఇంకొకరు బాధపడతారని. అదే ఆట అందం. నా వరకైతే ఇదే అత్యుత్తమ క్రీడా చిత్రం’’ అని నాదల్‌, ఫెదరర్‌ కన్నీళ్లు పెట్టుకున్న ఫొటోను కోహ్లి ట్వీట్‌ చేశాడు.


ఆటలోనే ప్రత్యర్థులు.. బాధలో స్నేహితులు

ఫెదరర్‌, నాదల్‌.. టెన్నిస్‌ కోర్టులో విజయం కోసం ప్రాణం పెట్టి పోరాడిన వీరులు. హోరాహోరీ పోరాటాల్లో బద్ధ శత్రువుల్లాగా తలపడ్డారు. ఒకరిపై మరొకరి ఆధిపత్యం కోసం చెమట చిందించారు. అలాంటి ప్రత్యర్థులే తమలో ఒకరు ప్రొఫెషనల్‌ ఆటకు వీడ్కోలు పలుకుతున్నారనే నిజాన్ని జీర్ణించుకోలేక.. ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకోలేకపోయారు. ఫెదరర్‌తో ఇక పోటీపడలేమని తెలిశాక నాదల్‌ హృదయం ద్రవించింది. ఫెదరర్‌ చివరి మ్యాచ్‌ ఆడిన తర్వాత.. ఇలా ఈ ఇద్దరూ కలిసి కన్నీళ్లు పెట్టుకుంటున్న దృశ్యం.. టెన్నిస్‌ ప్రపంచాన్ని కదిలించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని