రియా.. పసిడి బోణీ

జాతీయ క్రీడల్లో తెలంగాణకు తొలి స్వర్ణం. స్కేటర్‌ రియా సాబూ రాష్ట్రానికి మొదటి పసిడిని అందించింది. శుక్రవారం సింగిల్‌ ఫ్రీస్టైల్‌ ఆర్టిస్టిక్‌ విభాగంలో 19 ఏళ్ల రియా ఛాంపియన్‌గా నిలిచింది.

Published : 01 Oct 2022 02:53 IST

ఈనాడు, హైదరాబాద్‌, విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: జాతీయ క్రీడల్లో తెలంగాణకు తొలి స్వర్ణం. స్కేటర్‌ రియా సాబూ రాష్ట్రానికి మొదటి పసిడిని అందించింది. శుక్రవారం సింగిల్‌ ఫ్రీస్టైల్‌ ఆర్టిస్టిక్‌ విభాగంలో 19 ఏళ్ల రియా ఛాంపియన్‌గా నిలిచింది. కాళ్లకు చక్రాలతో కళ్లుచెదిరేలా నృత్య విన్యాసాలు చేసిన ఆమె అగ్రస్థానాన్ని దక్కించుకుంది. 112.4 పాయింట్లతో బంగారు పతకం పట్టేసింది. ఏపీ స్కేటర్లు సంహిత (107), అన్మిషా (97.8) వరుసగా రజత, కాంస్య పతకాలు గెలుచుకున్నారు. చిన్నప్పటి నుంచే స్కేటింగ్‌లో దూసుకెళ్తోన్న రియా.. 2018 ఆసియా రోలర్‌ స్కేటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం సొంతం చేసుకుంది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లోనూ ఆకట్టుకుంది. మరోవైపు ఏపీ అమ్మాయిలు యర్రాజి జ్యోతి 100మీ. పరుగులో, జ్యోతికశ్రీ 400మీ. పరుగులో ఫైనల్స్‌కు అర్హత సాధించారు.

నెట్‌బాల్‌లో రజతం: పురుషుల నెట్‌బాల్‌లో తెలంగాణ రజతం గెలిచింది. ఫైనల్లో తెలంగాణ 73-75 తేడాతో హరియాణా చేతిలో పోరాడి ఓడింది. మ్యాచ్‌ను మెరుగ్గా మొదలెట్టిన మన జట్టు ఆ తర్వాత నెమ్మదించింది. తొలి క్వార్టర్‌లో 16-9తో తెలంగాణ 7 పాయింట్ల ఆధిక్యం సాధించింది. కానీ ఆ తర్వాత తడబడింది. రెండో క్వార్టర్‌లో 12-18తో, మూడో క్వార్టర్‌లో 16-20తో వెనుకంజ వేసింది. మూడు క్వార్టర్స్‌ ముగిసే సరికి ప్రత్యర్థి కంటే 3 పాయింట్లు వెనకాల నిలిచింది. నాలుగో క్వార్టర్‌లో గొప్పగా పోరాడి 29-28తో పైచేయి సాధించినా.. ఓవరాల్‌గా 2 పాయింట్ల తేడాతో ఓడింది.

కేంద్ర క్రీడల మంత్రితో భేటీ: జాతీయ క్రీడల సందర్భంగా గుజరాత్‌ వెళ్లిన తెలంగాణ రాష్ట్ర క్రీడల మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌.. కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, ఆటల ప్రగతిపై ఆయన కేంద్ర మంత్రికి వివరించారు. ఈ భేటీలో శ్రీనివాస్‌ గౌడ్‌తో కలిసి సింధు కూడా పాల్గొంది. అంతకు ముందు రోజు రాత్రి సింధు అక్కడి సంప్రదాయక గర్భా నృత్యాన్ని ఆస్వాదించింది.

మెరిసిన స్టార్లు: జాతీయ క్రీడల్లో భారత అగ్రశ్రేణి అథ్లెట్లు అంచనాలను నిలబెట్టుకుంటూ సత్తాచాటారు. షూటింగ్‌ (10మీ.ఎయిర్‌ రైఫిల్‌)లో ఇలవెనిల్‌ వలరివన్‌, వెయిట్‌లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను (191 కేజీలు), ఫెన్సింగ్‌లో భవానీ దేవి, రెజ్లింగ్‌లో దివ్య కక్రాన్‌ స్వర్ణాలు గెలిచారు. అథ్లెటిక్స్‌లో ఏకంగా తొమ్మిది క్రీడల రికార్డులు బద్దలయ్యాయి. జావెలిన్‌ త్రో ఒలింపిక్‌ ఛాంపియన్‌ నీరజ్‌ చోప్రా ముఖ్య అతిథిగా హాజరై అథ్లెటిక్స్‌ పోటీలను ప్రారంభించాడు. ఓ భవన నిర్మాణ కూలీ తనయ మునిత (ఉత్తర్‌ప్రదేశ్‌) మహిళల 20 కిలోమీటర్ల నడకలో రికార్డు (1 గంటా 38 నిమిషాల 20 సెకన్లు) ప్రదర్శనతో పసిడి సాధించింది. 2018 ఆసియా క్రీడల డెకథ్లాన్‌ ఛాంపియన్‌ స్వప్న బర్మన్‌ ఈ క్రీడల హైజంప్‌లో 1.83మీ. ప్రదర్శనతో స్వర్ణం నెగ్గింది.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts