Arjun Kapoor: జస్‌ప్రీత్‌కు సెల్యూట్‌..అతడికి సాయం చేయాలనుంది: బాలీవుడ్‌ నటుడి పోస్ట్‌

విధి తల్లిదండ్రులను దూరం చేసినా ఆ బాలుడు అధైర్య పడలేదు. పదేళ్ల పసిప్రాయంలో కష్టాలను దిగమింగుతూ జీవితంలో ముందడుగు వేశాడు. అతడికి సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరలవ్వడంతో ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. సహాయం చేస్తామని పలువురు ముందుకువస్తున్నారు.

Published : 08 May 2024 18:04 IST

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: తల్లిదండ్రులు లేకపోయినా ఎవరిపైనా ఆధారపడకుండా స్ట్రీట్‌ ఫుడ్‌ సెంటర్‌ నడుపుతూ.. చదువుకుంటూ, తన సోదరిని చూసుకుంటున్న ఓ బాలుడి వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై బాలీవుడ్‌ నటుడు అర్జున్ కపూర్ స్పందించారు. చిన్నారి వీడియో తనను ఎంతగానో ఆకర్షించిందన్నారు. అతడికి సహాయం చేయాలని ఉందని, బాలుడి వివరాలు తెలిసినవారు తనకు తెలియజేయాలని నెటిజన్లను కోరారు. ‘జస్‌ప్రీత్‌ చిరునవ్వుతో తన జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎదుర్కొంటున్నాడు. ఈ చిన్నారి ధైర్యానికి సెల్యూట్‌ చేయకుండా ఉండలేకపోతున్నాను. తనను గాని, తన సోదరిని గానీ చదివించాలనుకుంటున్నాను. జస్‌ప్రీత్‌ వివరాలు తెలిసిన వారు నాకు తెలియజేయండి’’ అని అర్జున్‌కపూర్‌ ఇన్‌స్టా వేదికగా పోస్టు చేశారు.

దిల్లీకి చెందిన జస్‌ప్రీత్ అనే 10 ఏళ్ల బాలుడి తండ్రి అనారోగ్య కారణాల వల్ల ప్రాణాలు కోల్పోయారు. పిల్లలను చూసుకోలేనంటూ అతడి తల్లి వారిని విడిచి వెళ్లిపోయింది. అయినా ఆ బాలుడు కుంగిపోకుండా, తన తండ్రి నడిపిన స్ట్రీట్‌ ఫుడ్‌ సెంటర్‌ను నడుపుతూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. 

తాజాగా ఈ వీడియోపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా స్పందించారు. ‘‘ఈ ధైర్యం పేరు జస్‌ప్రీత్‌. బాధ్యత కారణంగా తన చదువుకు ఎలాంటి ఆటంకం కలగకూడదు. అందుకోసం ఆ బాలుడిని చదివించేందుకు మహీంద్రా ఫౌండేషన్‌ ముందుకొచ్చింది. అతడి వివరాలు తెలిస్తే దయచేసి నాకు తెలియజేయండి’’ అని మహీంద్రా కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని