ఆరేళ్ల తర్వాత

ఆరేళ్లు దాటిపోయింది.. పాకిస్థాన్‌ చేతిలో అసలు ఓటమి అన్నదే లేదు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విజయం.. మహిళల ఆసియా కప్‌లో భారత జట్టుకు ఎదురన్నదే లేదు.

Updated : 08 Oct 2022 04:03 IST

పాకిస్థాన్‌ చేతిలో భారత్‌ పరాజయం
మహిళల ఆసియా కప్‌ క్రికెట్‌

ఆరేళ్లు దాటిపోయింది.. పాకిస్థాన్‌ చేతిలో అసలు ఓటమి అన్నదే లేదు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విజయం.. మహిళల ఆసియా కప్‌లో భారత జట్టుకు ఎదురన్నదే లేదు. పసికూన థాయ్‌లాండ్‌ చేతిలో పరాజయంపాలైన పాకిస్థాన్‌ను ఓడించడం కష్టమే కాదన్న ధీమా! గెలుపుపై అతివిశ్వాసమే కొంపముంచిందేమో.. హ్యాట్రిక్‌ విజయాలతో జోరుమీదున్న హర్మన్‌సేన ఈ ఆసియా కప్‌లో తొలి ఓటమి రుచిచూసింది. కనీస పోటీ అయినా ఇస్తుందా అనుకున్న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ చేతిలో 13 పరుగుల తేడాతో ఓడిపోయింది. శుక్రవారం బౌలర్లు సత్తాచాటినా.. నిలకడ లేని బ్యాటింగ్‌తో భారత్‌ మూల్యం చెల్లించుకుంది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 137 పరుగులు రాబట్టింది. 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన పాక్‌ను కెప్టెన్‌ బిస్మా మారూఫ్‌ (32; 35 బంతుల్లో 2×4), ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ నిదా దార్‌ (56; 37 బంతుల్లో 5×4, 1×6) ఆదుకున్నారు. నాలుగో వికెట్‌కు 76 పరుగులు జోడించి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించారు. భారత బౌలర్లలో రేణుక సింగ్‌ (1/24), దీప్తిశర్మ (3/27), పూజ వస్త్రకార్‌ (2/3) రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనలో టీమ్‌ఇండియా తడబడింది. 19.4 ఓవర్లలో 124 పరుగులకే ఆలౌటైంది. పాక్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తూ క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టారు. క్రీజులో కుదురుకున్న సబ్బినేని మేఘన (15; 14 బంతుల్లో 1×4, 1×6), స్మృతి మంధాన (17; 19 బంతుల్లో 2×4), హేమలత (20; 22 బంతుల్లో 3×4), దీప్తిశర్మ (16; 11 బంతుల్లో 3×4) అనవసరంగా వికెట్లు పారేసుకున్నారు. మంచి ఫామ్‌లో ఉన్న కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (12; 12 బంతుల్లో 1×4) ఏడో నంబరులో బ్యాటింగ్‌కు రావడం భారత్‌కు నష్టం చేసింది. వికెట్‌ కీపర్‌ రిచా ఘోష్‌ (26; 13 బంతుల్లో 1×4, 3×6) భారీ షాట్లతో ఆశలు రేకెత్తించినా ఫలితం లేకపోయింది. బౌలింగ్‌లో సత్తాచాటిన సాదియా ఇక్బాల్‌ (2/24), నిదా దార్‌ (2/23), నష్రా సంధూ (3/30).. కీలక సమయాల్లో మూడు క్యాచ్‌లు అందుకున్న ఆలియా రియాజ్‌ పాక్‌ విజయంలో కీలకపాత్ర పోషించారు. ఇక టీ20 ఫార్మాట్‌లో ఇప్పటి వరకు భారత్‌, పాక్‌లు 13 మ్యాచ్‌ల్లో తలపడగా.. దాయాదికి ఇది మూడో గెలుపు. 10 మ్యాచ్‌ల్లో టీమ్‌ఇండియా నెగ్గింది. పాక్‌పై వరుసగా అయిదు విజయాల తర్వాత భారత్‌కు ఇది మొదటి ఓటమి. చివరగా 2016 టీ20 ప్రపంచకప్‌లో పాక్‌ చేతిలో భారత జట్టు ఓడింది. ఆసియా కప్‌ పట్టికలో ఆరేసి పాయింట్లతో భారత్‌ ప్రథమ, పాక్‌ ద్వితీయ స్థానాల్లో కొనసాగుతున్నాయి. నాలుగేసి మ్యాచ్‌లాడిన భారత్‌, పాక్‌.. మూడింట్లో నెగ్గి, ఒకదాంట్లో ఓడాయి. శనివారం బంగ్లాదేశ్‌తో భారత్‌ తలపడనుంది.

బ్యాటింగ్‌ ప్రయోగాలే దెబ్బతీసింది: హర్మన్‌
మహిళల ఆసియా కప్‌లో పాకిస్థాన్‌ చేతిలో ఓటమికి బ్యాటింగ్‌ ప్రయోగాలే కారణమని భారత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ తెలిపింది. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌ నేపథ్యంలో బ్యాటర్లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలన్న ఆలోచన దెబ్బతీసిందని చెప్పింది. ‘‘అది ఛేదించదగిన లక్ష్యం. మధ్య ఓవర్లలో సింగిల్స్‌ తీయలేకపోయాం. స్ట్రైక్‌ రొటేట్‌ చేయలేకపోయాం. డాట్‌ బాల్స్‌ ఎక్కువ ఆడాం. ఇతర బ్యాటర్లకు అవకాశాలు ఇవ్వాలనుకున్నాం. టోర్నీలో అలా చేయాల్సి ఉంటుంది. కాని అదే ఎదురుదెబ్బ తీసింది. మ్యాచ్‌ను కోల్పోయేలా చేసింది. జట్టులోకి ఎవరు కొత్తగా వచ్చినా ప్రపంచకప్‌కు ముందు కావాల్సినన్ని మ్యాచ్‌లు ఆడాలన్నది నా అభిప్రాయం. ఇతర క్రికెటర్లకు ఇది మంచి అవకాశం’’ అని అంది. ఈ మ్యాచ్‌లో తాము ఉదాసీనత ప్రదర్శించలేదని హర్మన్‌ చెప్పింది. ‘‘ఏ జట్టును మేం తేలిగ్గా తీసుకోం. ఆటలో భాగమిది. వాళ్లు బాగా ఆడారు. విజయానికి అర్హులు. మేం కొన్ని విభాగాలపై దృష్టిసారించాలి. ధైర్యంగా ఉండాలి’’ అని ఆమె పేర్కొంది.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts