IND-ZIM: నేడే జింబాబ్వేతో భారత్‌ పోరు.. జరభద్రం

సంచలనాలకు వేదికగా మారిన టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు కీలక సమరానికి సిద్ధమైంది. ఆదివారం సూపర్‌-12 దశ చివరి మ్యాచ్‌లో జింబాబ్వేను రోహిత్‌ సేన ఢీకొనబోతోంది.

Updated : 06 Nov 2022 08:36 IST

తేలనున్న సెమీస్‌ బెర్తులు
మధ్యాహ్నం 1.30 నుంచి

సంచలనాలకు వేదికగా మారిన టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు కీలక సమరానికి సిద్ధమైంది. ఆదివారం సూపర్‌-12 దశ చివరి మ్యాచ్‌లో జింబాబ్వేను రోహిత్‌ సేన ఢీకొనబోతోంది. మామూలుగా అయితే జింబాబ్వేతో మ్యాచ్‌ అంటే ఫలితం గురించి ఎలాంటి ఆందోళనా ఉండదు. కానీ ఈ ప్రపంచకప్‌లో చిన్న జట్లు పెద్ద జట్లకు ఇచ్చిన షాక్‌లు చూశాక.. టీమ్‌ఇండియా జాగ్రత్తగా ఉండాల్సిందే. తమ మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా, పాకిస్థాన్‌ విజయం సాధిస్తే.. జింబాబ్వేను ఓడిస్తేనే భారత్‌కు సెమీస్‌ బెర్తు దక్కుతుంది. కాబట్టి ఏమాత్రం ఉదాసీనత ప్రదర్శించడానికి వీల్లేదు. సూపర్‌-12 దశకు నేడే ముగింపు. భారత్‌-జింబాబ్వే మ్యాచ్‌ ముందు నెదర్లాండ్స్‌తో దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌తో పాకిస్థాన్‌ తలపడనున్నాయి. ఈ ఫలితాలను బట్టే సెమీస్‌ బెర్తులు ఖరారవుతాయి.

టీ20 ప్రపంచకప్‌ సూపర్‌-12 దశలో గ్రూప్‌-1 నుంచి రెండో స్థానంతో ఇంగ్లాండ్‌ సెమీస్‌ చేరుకుంది. అంటే మన కోసం నాకౌట్‌ ప్రత్యర్థి సిద్ధంగా ఉన్నట్లే! ఆదివారం జింబాబ్వేను ఓడిస్తే గ్రూప్‌-2 నుంచి భారత్‌దే అగ్రస్థానం. అప్పుడు మన సెమీస్‌ ప్రత్యర్థి ఇంగ్లిష్‌ జట్టే అవుతుంది. అయితే బలహీన జట్టనుకున్న లంకపై గెలవడానికి బలమైన ఇంగ్లాండ్‌ ఎంత కష్టపడిందో తెలిసిందే. భారత్‌ తన చివరి మ్యాచ్‌లో బంగ్లాను ఓడించడానికి కూడా అంతే కష్టపడింది. ఇక ఈ ప్రపంచకప్‌లో పెద్ద జట్లకు చిన్న జట్లు షాకిచ్చిన మ్యాచ్‌లు చాలానే ఉన్నాయి. జింబాబ్వే.. పాకిస్థాన్‌ను ఓడించిన విషయమూ మరువరాదు. కాబట్టి ఆ జట్టుతో రోహిత్‌ సేన జాగ్రత్తగా ఉండాల్సిందే.

ఇప్పుడైనా మారుస్తారా?: తుది జట్టులో కొన్ని స్థానాల విషయంలో ఎన్ని విమర్శలు వచ్చినా, కొందరు ఆటగాళ్ల సామర్థ్యంపై ఎన్ని ప్రశ్నలు రేకెత్తినా జట్టు యాజమాన్యం పట్టించుకోవడం లేదు. మరో బలమైన ఓపెనర్‌ లేడు కాబట్టి రాహుల్‌ను తప్పక కొనసాగించారు. అతను బంగ్లాపై కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు కాబట్టి సంతోషమే. కానీ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ దినేశ్‌ కార్తీక్‌.. స్పిన్నర్లు అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌ ఎన్ని వైఫల్యాలు చవిచూసినా వారి స్థానాలకు ఢోకా లేకుండా పోతోంది. రిషబ్‌ పంత్‌, చాహల్‌, హర్షల్‌ పటేల్‌ లాంటి వాళ్లు తుది జట్టులో చోటు కోసం ఎదురు చూస్తున్నా వారిపై కోచ్‌, కెప్టెన్‌ దృష్టి పడట్లేదు. మరి జింబాబ్వేపై అయినా తుది జట్టును మారుస్తారేమో చూడాలి. ముఖ్యంగా కార్తీక్‌, అశ్విన్‌ల స్థానంలో పంత్‌, చాహల్‌లను ఎంచుకోవాలన్న డిమాండ్లు గట్టిగా వినిపిస్తున్నాయి. కీలకమైన సెమీస్‌ ముందు తప్పులు దిద్దుకోవడానికి, మార్పులు చేర్పులు చేసుకోవడానికి జింబాబ్వే మ్యాచ్‌ ఓ అవకాశం కాబట్టి జట్టు యాజమాన్యం ఈ దిశగా ఆలోచిస్తుందేమో చూడాలి. కెప్టెన్‌ రోహిత్‌, ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ల బ్యాటింగ్‌ ఫామ్‌ జట్టుకు ఆందోళన కలిగిస్తోంది. రాహుల్‌తో పాటు కోహ్లి, సూర్యకుమార్‌ జోరు కొనసాగించాల్సిన అవసరముంది. ప్రతిభావంతులైన జింబాబ్వే బౌలర్లను బ్యాట్స్‌మెన్‌ కొంచెం జాగ్రత్తగా ఆడాల్సిందే. యువ పేసర్‌ అర్ష్‌దీప్‌ బౌలింగ్‌ దాడిని ముందుండి నడిపిస్తున్నాడు. షమి, భువి కూడా పర్వాలేదు.

పేరుకే చిన్న జట్టు..: ఒకప్పుడు పెద్ద జట్లకు గట్టి పోటీనిచ్చి, మధ్యలో పతనం చవిచూసిన జింబాబ్వే.. గత కొన్నేళ్లలో ఎంతో మెరుగైంది. సికిందర్‌ రజా, సీన్‌ విలియమ్స్‌, ముజరబాని, ఎంగర్వ లాంటి ప్రతిభావంతులు ఆ జట్టు ఎదుగుదలతో కీలక పాత్ర పోషించారు. పాక్‌పై జింబాబ్వే ఎలా పోరాడిందో, ఆ జట్టుకు ఎలా షాకిచ్చిందో తెలిసిందే. ప్రస్తుత టోర్నీలో ఇప్పటిదాకా అత్యుత్తమ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన రజాదే కావడం విశేషం. విలియమ్స్‌ కూడా నిలకడగా రాణిస్తున్నాడు. వీరికి తోడు కెప్టెన్‌ ఎర్విన్‌ బ్యాటింగ్‌లో కీలకం. బౌలింగ్‌లో ముజరబాని, ఎంగర్వ, జాంగ్విలతో జాగ్రత్తగా ఉండాల్సిందే. బర్ల్‌ ఆ జట్టులో మరో ప్రతిభావంతుడైన ఆల్‌రౌండర్‌.
రద్దయితే..ఈ ప్రపంచకప్‌లో మెల్‌బోర్న్‌కు కేటాయించిన అయిదు మ్యాచ్‌ల్లో మూడు వర్షార్పణం అయ్యాయి. భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ మాత్రమే పూర్తిగా జరిగింది. అయితే ఆదివారం భారత్‌-జింబాబ్వే పోరుకు వర్షం ముప్పు లేదు. ఒకవేళ అనుకోని వర్షంతో ఈ మ్యాచ్‌ రద్దయితే భారత్‌కు సెమీస్‌ బెర్తు ఖరారవుతుంది. నెదర్లాండ్స్‌పై దక్షిణాఫ్రికా గెలిచి.. భారత మ్యాచ్‌ రద్దయితే.. రోహిత్‌ సేన రెండో స్థానంతో ముందంజ వేసి, సెమీస్‌లో న్యూజిలాండ్‌ను ఢీకొంటుంది. ఒకవేళ దక్షిణాఫ్రికా ఓడితే.. జింబాబ్వేతో మ్యాచ్‌ ఫలితంతో సంబంధం లేకుండా భారత్‌ సెమీస్‌ చేరుతుంది.  

పాక్‌ పరిస్థితేంటో?: దక్షిణాఫ్రికాతో భారత్‌ తలపడుతున్నపుడు మన జట్టు గెలవాలని కోరుకున్న పాకిస్థాన్‌.. ఇప్పుడు నెదర్లాండ్స్‌ చేతిలో దక్షిణాఫ్రికా ఓటమి కోసం ఎదురు చూస్తోంది. 4 మ్యాచ్‌ల్లో రెండు ఓడి, రెండు నెగ్గిన పాక్‌ ఖాతాలో 4 పాయింట్లే ఉన్నాయి. ఆదివారం జరిగే తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా (5 పాయింట్లు) ఓడి, తర్వాత బంగ్లాతో జరిగే మ్యాచ్‌లో పాక్‌ గెలిస్తే ఆ జట్టుకు సెమీస్‌ బెర్తు ఖరారవుతుంది. దక్షిణాఫ్రికా గెలిస్తే.. ఇక బంగ్లాను పాక్‌ ఓడించినా ముందంజ వేసే అవకాశాలు తక్కువే. అప్పుడు భారత్‌ (6 పాయింట్లు).. జింబాబ్వే చేతిలో ఓడితేనే ఆ జట్టుకు అవకాశముంటుంది.

పిచ్‌ పేసర్లదే
మెల్‌బోర్న్‌ పిచ్‌ పేసర్లకే అనుకూలం. ఆరంభంలో ఫాస్ట్‌బౌలర్లను కాచుకోవడం కష్టమే. నెమ్మదిగా పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారుతుంది. క్రీజులో కుదురుకుంటే పరుగులు చేయొచ్చు.
తుది జట్లు (అంచనా)
భారత్‌: రోహిత్‌ (కెప్టెన్‌), రాహుల్‌, కోహ్లి, సూర్యకుమార్‌, హార్దిక్‌, దినేశ్‌ కార్తీక్‌, అక్షర్‌ పటేల్‌, అశ్విన్‌, భువనేశ్వర్‌, షమి, అర్ష్‌దీప్‌.
జింబాబ్వే: ఎర్విన్‌ (కెప్టెన్‌), మదివీర, చకబ్వా, సీన్‌ విలియమ్స్‌, సికిందర్‌ రజా, షుంబా, బర్ల్‌, జాంగ్వి, ముజరబాని, ఎంగర్వ, చటార.


టీ20 ప్రపంచకప్‌లో నేటి ఇతర మ్యాచ్‌లు
దక్షిణాఫ్రికా × నెదర్లాండ్స్‌
వేదిక: అడిలైడ్‌, ఉ।। 5.30
పాకిస్థాన్‌ × బంగ్లాదేశ్‌
వేదిక: అడిలైడ్‌, ఉ।। 9.30

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని