t20 world cup 2022: పంత్‌ అవసరం ఉంది: రాహుల్‌ ద్రవిడ్‌

టీ20 ప్రపంచకప్‌లో లేకలేక ఆడే అవకాశం దక్కించుకున్న పంత్‌ జింబాబ్వేపై విఫలమయ్యాడు. దీంతో మిగతా మ్యాచ్‌ల్లో అతణ్ని ఆడిస్తారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.  అతని విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని, రాబోయే మ్యాచ్‌ల్లో జట్టుకు పంత్‌ అవసరం ఉందని టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ సంకేతాలిచ్చాడు.

Updated : 08 Nov 2022 09:11 IST

మెల్‌బోర్న్‌: టీ20 ప్రపంచకప్‌లో లేకలేక ఆడే అవకాశం దక్కించుకున్న పంత్‌ జింబాబ్వేపై విఫలమయ్యాడు. దీంతో మిగతా మ్యాచ్‌ల్లో అతణ్ని ఆడిస్తారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కానీ అతని విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని, రాబోయే మ్యాచ్‌ల్లో జట్టుకు పంత్‌ అవసరం ఉందని టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ సంకేతాలిచ్చాడు.

‘‘ఒక్క మ్యాచ్‌ ఆధారంగా ఆటగాడిపై నిర్ణయానికి రాలేం. కొన్నిసార్లు ప్రత్యర్థిని బట్టి జట్టు కూర్పు ఉంటుంది. ఏ బౌలర్‌ను ఎదుర్కొనేందుకు ఎలాంటి నైపుణ్యాలు ఉన్న ఆటగాడు కావాలో అని చూస్తాం. నిర్ణయాలు తీసుకునేముందు చాలా విషయాలను పరిగణనలోకి తీసుకుంటాం. పంత్‌పై మేమెప్పుడూ విశ్వాసం కోల్పోలేదు. 15 మంది ఆటగాళ్లపైనా మాకు నమ్మకం ఉంది. అవసరాలను బట్టి 11 మంది ఆడతారంతే. దీంతో కొంతమంది పక్కన కూర్చోక తప్పదు. కొంతకాలంగా మాతో కలిసి ప్రయాణిస్తున్న పంత్‌కు ఇది తెలుసు. నెట్స్‌లో, మైదానంలో సాధన కొనసాగిస్తూనే వచ్చాడు. జింబాబ్వేతో మ్యాచ్‌లో అతణ్ని ఆడించే అవకాశం వచ్చింది.

లెఫ్మార్మ్‌ స్పిన్నర్‌పై ఎదురు దాడి చేసే క్రమంలో ఔటయ్యాడు. కానీ ఎలాంటి ఆందోళన లేదు. అదే అతని పాత్ర. కొన్ని సార్లు రాణించడం, మరి కొన్నిసార్లు విఫలమవడం సాధారణం. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని మా ప్రత్యామ్నాయాలను చూసుకోవాలి’’ అని ద్రవిడ్‌ చెప్పాడు. అడిలైడ్‌లో ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్‌ దృష్టిలో పెట్టుకుని జింబాబ్వేతో మొదట కావాలనే బ్యాటింగ్‌ చేశామని అతనన్నాడు. ‘‘పాక్‌తో మొదట బౌలింగ్‌ చేశాం. కానీ మొదట బ్యాటింగ్‌ చేస్తే ఎంత స్కోరు సాధించగలమనేది కూడా తెలుసుకోవాలి. 20 ఓవర్లు ఆడే అవకాశం ఆటగాళ్లకు ఇవ్వాలి. నేను చూసిన మ్యాచ్‌ల్లో అడిలైడ్‌ పిచ్‌ నెమ్మదిగా స్పందించింది. బంతి తిరిగింది. బంగ్లాతో మ్యాచ్‌లో వాడిన పిచ్‌పై బంతి తిరగలేదు. కానీ సెమీస్‌లో కొత్త పిచ్‌పై ఆడబోతున్నాం. ఒకవేళ  పిచ్‌ మందకొడిగా ఉంటే అందుకు తగినట్లు ఆడాలి. పిచ్‌ను చూశాక జట్టుపై నిర్ణయం  తీసుకుంటాం’’ అని ద్రవిడ్‌ చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని