T20 World Cup 2022: ముందే వచ్చేశారు.. మంచిది!

‘‘ముందే ఓడి మంచి పని చేశారు. ఇదే ఆటతో ఫైనల్లో పాకిస్థాన్‌ చేతిలో ఓడితే తట్టుకోలేకపోయేవాళ్లం’’ఇంగ్లాండ్‌తో గురువారం టీమ్‌ఇండియా సెమీస్‌ ఓటమి తర్వాత సామాజిక మాధ్యమాల్లో కొందరు అభిమానుల స్పందన ఇది!

Updated : 11 Nov 2022 04:38 IST

‘‘ముందే ఓడి మంచి పని చేశారు. ఇదే ఆటతో ఫైనల్లో పాకిస్థాన్‌ చేతిలో ఓడితే తట్టుకోలేకపోయేవాళ్లం’’
ఇంగ్లాండ్‌తో గురువారం టీమ్‌ఇండియా సెమీస్‌ ఓటమి తర్వాత సామాజిక మాధ్యమాల్లో కొందరు అభిమానుల స్పందన ఇది!
చిత్రంగా అనిపించినా.. వాస్తవం ఇదే! ఈ జట్టుతో, ఈ ఆటతో ఫైనల్‌ చేరి ఏం సాధిస్తారన్నది అభిమానుల బాధ!
సూపర్‌-12 దశలో మాదిరి అదృష్టం కలిసొచ్చి విజేతగా నిలవాలి తప్ప.. నిజంగా మన జట్టుకు ప్రపంచకప్‌ గెలిచే సత్తా ఉందా అంటే సందేహమే! కూర్పులో, ఆటతీరులో, వ్యూహాల్లో తప్పుల మీద తప్పులు చేసిన జట్టుకు కప్పు గెలిచే అర్హత లేదన్నది కఠిన వాస్తవం!


‘‘నాకౌట్‌ మ్యాచ్‌లు ముఖ్యమైనవి. అందులో మెరుగైన ప్రదర్శన చేస్తే ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అదే సమయంలో ఒక్క నాకౌట్‌ మ్యాచ్‌లో విఫలమైనంత మాత్రాన ఆటగాళ్ల ప్రదర్శనపై ఓ అంచనాకు రాకూడదు’’.. ఇంగ్లాండ్‌తో సెమీస్‌ ముంగిట టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వ్యాఖ్యలివి! తన జట్టు మీద తనకే నమ్మకం లేదో ఏమో.. సెమీస్‌ మ్యాచ్‌ ఆడబోతూ సమరోత్సాహంతో మాట్లాడాల్సిన వాడు కాస్తా వైఫల్యం గురించి ప్రస్తావించాడు. జట్టుతో పాటు కెప్టెన్‌ ఆత్మవిశ్వాస లోపాన్ని సూచించే విషయం ఇది. ప్రతిసారీ మన జట్టు కప్పు గెలవాలని ఆశిస్తాం కానీ.. నిజంగా మన జట్టుకు అది సాధించే సత్తా ఉందా అని టోర్నీ ముంగిట అడిగితే అభిమానులు ధీమాగా ‘అవును’ అని చెప్పలేని పరిస్థితి. ఓవైపు గాయాల బాధ, ఇంకోవైపు కీలక ఆటగాళ్ల ఫామ్‌ లేమి, కుదరని కూర్పు, ఆసియా కప్‌ సహా కొన్ని కీలక మ్యాచ్‌ల్లో దారుణమైన బౌలింగ్‌ ప్రదర్శన చూశాక జట్టు మీద ఎలా నమ్మకం కలుగుతుంది?

ఏడాది కసరత్తు.. ఏం సాధించారు?: నిరుడు టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా తొలి దశలోనే నిష్క్రమించాక ఈ ఏడాది పొట్టి కప్పు లక్ష్యంగా పెద్ద కసరత్తే జరిగింది. తీరిక లేని క్రికెట్‌తో ఆటగాళ్లు అలసిపోయారని, జట్టు ఎంపికలో పొరపాట్లు జరిగాయని విమర్శలు రావడంతో కీలక ఆటగాళ్లకు తరచుగా విశ్రాంతినిస్తూ, చాలామంది కుర్రాళ్లకు అవకాశాలిస్తూ ప్రయోగాల మీద ప్రయోగాలు చేశారు. కానీ ఏడాది వ్యవధిలో పెద్దగా మ్యాచ్‌లు ఆడింది లేకపోయినా, కావాల్సినంత విశ్రాంతి పొందినా.. బుమ్రా, దీపక్‌ చాహర్‌, జడేజా టోర్నీ ముంగిట ఫిట్‌నెస్‌ సమస్యలతో జట్టుకు దూరం అయ్యారు. ఇక కుర్రాళ్లకు బోలెడన్ని అవకాశాలిచ్చినా.. అందులో ఒక ప్రణాళిక అంటూ కనిపించలేదు. మ్యాచ్‌ మ్యాచ్‌కూ మార్పులు చేర్పులు చేస్తూ ఎవ్వరికీ కుదురుకునే అవకాశం లేకుండా చేశారు. అర్ష్‌దీప్‌ ఒక్కడు జట్టులో స్థిరపడ్డాడు. పెద్దగా నిరూపించుకున్నదేమీ లేకపోయినా దీపక్‌ హుడాకు ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కడం ఆశ్చర్యకరం. ఒక ప్రణాళిక అంటూ లేకుండా ఇష్టానుసారం ప్రయోగాలు చేసి చివరికి పెద్దగా టీ20 క్రికెట్‌ ఆడని షమి, అశ్విన్‌లను ప్రపంచకప్‌ కోసం ఎంపిక చేయడంలో ఔచిత్యమేంటో అర్థం కాని విషయం. నిలకడగా 150 కి.మీ వేగంతో బంతులేసే ఉమ్రాన్‌ మాలిక్‌ ఒకట్రెండు మ్యాచ్‌ల్లో విఫలం కాగానే పక్కన పెట్టేశారు. మిగతా ఆటగాళ్లకు ఇచ్చినట్లు అవకాశాలు ఇచ్చి ఉంటే అతను ఈ ప్రపంచకప్‌లో జట్టుకు బాగా ఉపయోగపడేవాడేమో. రవి బిష్ణోయ్‌ పరిస్థితీ అంతే.

ప్రపంచమంతా ఒకవైపు..: ప్రపంచ క్రికెట్లో ఆఫ్‌ స్పిన్నర్ల ఆధిపత్యానికి తెరపడి చాలా కాలం అయింది. కొన్నేళ్ల నుంచి అంతర్జాతీయ క్రికెట్లో అయినా, లీగ్‌ క్రికెట్లో అయినా మణికట్టు స్పిన్నర్లదే హవా. భారత క్రికెట్లోనూ అందుకు భిన్నమేమీ కాదు.  చాహల్‌, వరుణ్‌ చక్రవర్తి, రవి బిష్ణోయ్‌ లాంటి మణికట్టు స్పిన్నర్లే సత్తా చాటుతూ వస్తున్నారు. ఇలాంటి స్థితిలో ప్రపంచకప్‌కు అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌లను ఎంపిక చేయడం విడ్డూరం. అక్షర్‌.. నెదర్లాండ్స్‌ లాంటి పసికూనపై, అశ్విన్‌.. జింబాబ్వే లాంటి చిన్న జట్టుపై సత్తా చాటడం తప్ప ప్రపంచకప్‌లో సాధించిందేమీ లేదు. వీళ్లిద్దరూ బ్యాటుతో కూడా జట్టుకు పెద్దగా ఉపయోగపడింది లేదు. రెండు మ్యాచ్‌ల్లో అక్షర్‌తో ఒక్కో ఓవర్‌ మాత్రమే వేయించి, తర్వాత మళ్లీ అతడికి బంతి ఇవ్వడానికి భయపడ్డాడు రోహిత్‌. అశ్విన్‌ సంగతి సరేసరి. ఒక్క జింబాబ్వే మ్యాచ్‌లో మినహా అతను ఏమాత్రం ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను భయపెట్టేలా కనిపించలేదు. సెమీస్‌ మ్యాచ్‌నే తీసుకుంటే మొదట ఆదిల్‌ రషీద్‌కు తోడు పార్ట్‌ టైమర్‌ అయిన లివింగ్‌స్టోన్‌.. కోహ్లి, సూర్య, హార్దిక్‌లను ఎంత ఇబ్బంది పెట్టారో చూశాం. వాళ్లంత బాగా బౌలింగ్‌ చేసిన పిచ్‌పై అశ్విన్‌, అక్షర్‌ తేలిపోయారు. రషీద్‌, లివింగ్‌స్టోన్‌లిద్దరూ లెగ్‌ స్పిన్నర్లే కావడం గమనార్హం. చాహల్‌ కొన్ని మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడని.. లెగ్‌స్పిన్నర్లే ఎక్కువ ప్రభావం చూపుతున్న ప్రపంచకప్‌లో అతణ్ని ఒక్కటంటే ఒక్క మ్యాచ్‌లో ఆడించలేదు. బిష్ణోయ్‌ని అసలు ప్రపంచకప్‌ కోసం ఎంపికే చేయలేదు. ఒక బౌలర్‌ బంతినందుకుంటే వికెట్‌ తీస్తాడనో, పరుగులు కట్టడి చేస్తాడనో భరోసా కలగకపోగా.. జట్టు అవకాశాలను దెబ్బ తీస్తాడనే భయం కలుగుతున్నపుడు అలాంటి బౌలర్‌ జట్టులో ఎందుకు? అశ్విన్‌, అక్షర్‌లకు తోడు భువనేశ్వర్‌దీ ఇలాంటి పరిస్థితే. గత ప్రపంచకప్‌లోనే కాక ప్రస్తుత టోర్నీకి ముందు కొన్ని కీలక మ్యాచ్‌ల్లో భువి దారుణమైన ప్రదర్శన చేశాడు. అయినా అతణ్ని ప్రపంచకప్‌కు ఎంపిక చేశారు. సూపర్‌-12లో బౌలింగ్‌ పిచ్‌ల మీద పర్వాలేదనిపించినా.. సెమీస్‌లో మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు.

ఏదీ కెప్టెన్‌ ముద్ర?: గత ఏడాది టీ20 ప్రపంచకప్‌లో కెప్టెన్‌గా కోహ్లి వైఫల్యం తర్వాత ఎన్నో ఆశలు, అంచనాల మధ్య జట్టు పగ్గాలు అందుకున్నాడు రోహిత్‌. ఐపీఎల్‌లో అయిదుసార్లు ముంబయికి టైటిల్‌ అందించిన అతను భారత జట్టు కెప్టెన్‌ అయ్యాక తన ప్రత్యేకతను చాటుకోలేకపోయాడు. ఆసియా కప్‌లో కెప్టెన్‌గా రోహిత్‌ తేలిపోయాడు. ఇప్పుడు ప్రపంచకప్‌లోనూ అతను తన ముద్రను వేయలేకపోయాడు. బ్యాటింగ్‌ వైఫల్యానికి తోడు కెప్టెన్‌గా తుది జట్టు ఎంపిక, కూర్పు, బౌలింగ్‌-ఫీల్డింగ్‌ వ్యూహాల్లో రోహిత్‌ ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు. బౌలింగ్‌ ఎంత బలహీనమైనా, పరిస్థితులు ఎలా ఉన్నా 169 పరుగుల లక్ష్యాన్ని ఒక్క వికెట్‌ కూడా కోల్పోకుండా ఇంకో 4 ఓవర్లుండగానే ఛేదించడం కెప్టెన్సీ వైఫల్యానికి సూచికే. ఈ వైఫల్యం టీ20ల్లో కెప్టెన్‌గా అతడి భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసేదే.

రోహిత్‌ కంటనీరు..  
టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌లో ఓటమి ఆటగాళ్లను దుఃఖంలో ముంచెత్తింది. ఓటమిని తట్టుకోలేక భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఏడ్చేశాడు. మ్యాచ్‌ ముగిశాక డగౌట్లో కన్నీళ్లు పెట్టుకున్నాడు. తల వంచుకుని, ముఖంపై చేతులు పెట్టుకుని కూర్చున్న అతను.. కన్నీళ్లు తుడుచుకోవడం కనిపించింది. ముందు కూర్చున్న పంత్‌తో ఏదో మాట్లాడిన అతను మళ్లీ బాధలో మునిగిపోయాడు. అప్పుడే కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అక్కడికి వచ్చి రోహిత్‌ను ఓదార్చాడు. భుజం తట్టి అతడికి సాంత్వన చేకూర్చే ప్రయత్నం చేశాడు. ద్రవిడ్‌ అక్కడి నుంచి వెళ్లాక రోహిత్‌ మళ్లీ భావోద్వేగానికి గురయ్యాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని