వచ్చాడు.. ఓటమి తప్పించాడు

మ్యాచ్‌లో 54 నిమిషాలు గడిచిపోయాయి.. అప్పటికే 3-1తో ఆధిక్యంలో ఉన్న సెర్బియాదే విజయమనిపించింది.

Published : 29 Nov 2022 02:27 IST

కామెరూన్‌ను గట్టెక్కించిన అబూబాకర్‌

అల్‌ వాక్రా: మ్యాచ్‌లో 54 నిమిషాలు గడిచిపోయాయి.. అప్పటికే 3-1తో ఆధిక్యంలో ఉన్న సెర్బియాదే విజయమనిపించింది. కానీ 55వ నిమిషంలో మైదానంలో అడుగుపెట్టిన కామెరూన్‌ సబ్‌స్టిట్యూట్‌ విన్సెంట్‌ అబూబాకర్‌ అద్భుతమే చేశాడు. ఓ గోల్‌ (63వ నిమిషంలో) చేయడమే కాకుండా.. మరో గోల్‌కు బాటలు వేసి జట్టుకు ఓటమి తప్పించాడు. చివరకు మ్యాచ్‌ 3-3తో డ్రాగా ముగిసింది. సోమవారం ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో మొదటి గోల్‌ కామెరూన్‌ ఖాతాలోనే చేరింది. 29వ నిమిషంలో ఆటగాళ్ల తలలను తాకుతూ వచ్చిన కార్నర్‌ కిక్‌ను గోల్‌పోస్టు దగ్గరే ఉన్న జియాన్‌ ఛార్లెస్‌ లోపలికి పంపించాడు. కానీ ఆ ఆధిక్యం ఎక్కువ సేపు నిలవలేదు. దూకుడు పెంచిన సెర్బియా మూడు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్‌ చేసింది. తొలి అర్ధభాగం అదనపు సమయంలో పావ్లోవిచ్‌ (45+1వ), మిలింకోవిచ్‌ (45+3వ) వెంటవెంటనే గోల్స్‌ కొట్టారు. విరామం తర్వాత కూడా ఆ జట్టు జోరు కొనసాగింది. మిత్రోవిచ్‌ (53వ) గోల్‌తో ఆ జట్టు 3-1తో ఆధిక్యం సాధించింది. బంతిని పాస్‌ చేసుకుంటూ ప్రత్యర్థి గోల్‌పోస్టు దాకా వెళ్లిన ఆటగాళ్ల సమష్టి కృషి ఫలితంగా మూడో గోల్‌ దక్కింది. కామెరూన్‌ పుంజుకుని ప్రత్యర్థిని అందుకోవడం కష్టమే అనిపించింది. కానీ ఆఫ్రికన్‌ కప్‌ ఆఫ్‌ నేషన్స్‌లో అత్యధిక గోల్స్‌ కొట్టిన ఆటగాడిగా నిలిచిన అబూబాకర్‌ కథ మార్చేశాడు. అడ్డుకునేందుకు వచ్చిన గోల్‌కీపర్‌ తల మీదుగా తెలివిగా అతను బంతిని నెట్‌లోకి పంపించాడు. ఆఫ్‌సైడ్‌ అని మొదట రిఫరీ గోల్‌ ఇవ్వలేదు. కానీ వీడియో సమీక్షలో కామెరూన్‌కు గోల్‌ దక్కింది. మరో మూడు నిమిషాలకే ప్రత్యర్థి రక్షణశ్రేణిని ఛేదించి గోల్‌పోస్టు వరకూ బంతిని తీసుకెళ్లిన అబూబాకర్‌.. దీన్ని ఎడమవైపున ఎరిక్‌ మాక్సిమ్‌కు అందించాడు. అతను ఎలాంటి పొరపాటు చేయకుండా గోల్‌ కొట్టాడు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని