కొరియా సాధించింది

గ్రూప్‌-హెచ్‌లో రెండు విజయాలతో పోర్చుగల్‌ ముందే నాకౌట్‌ బెర్తును ఖరారు చేసుకోగా.. మరో బెర్తు కోసం ఉరుగ్వే, దక్షిణ కొరియా, ఘనా పోటీలో నిలిచాయి. పోర్చుగల్‌ను కొరియా ఓడించడం కష్టం కాబట్టి.. ఘనాను ఓడించి ముందంజ వేయాలని ఉరుగ్వే చూసింది.

Published : 03 Dec 2022 05:16 IST

పోర్చుగల్‌కు షాకిచ్చి నాకౌట్‌కు

అల్‌ రయాన్‌: గ్రూప్‌-హెచ్‌లో రెండు విజయాలతో పోర్చుగల్‌ ముందే నాకౌట్‌ బెర్తును ఖరారు చేసుకోగా.. మరో బెర్తు కోసం ఉరుగ్వే, దక్షిణ కొరియా, ఘనా పోటీలో నిలిచాయి. పోర్చుగల్‌ను కొరియా ఓడించడం కష్టం కాబట్టి.. ఘనాను ఓడించి ముందంజ వేయాలని ఉరుగ్వే చూసింది. కోరుకున్నట్లే ఘనాను ఓడించింది. కానీ అవతల అనూహ్యంగా కొరియా.. పోర్చుగల్‌ను ఓడించి పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఒక విజయం, ఒక ఓటమి, ఒక డ్రాతో ఇరు జట్లూ పాయింట్లలో సమం కాగా.. గోల్‌ తేడా (0) కూడా ఒకటే అయింది. కానీ మొత్తం 2 గోల్‌లే కొట్టగా.. కొరియా 4 గోల్స్‌తో పైచేయి సాధించి ముందంజ వేసింది.

కొరియా సాధించింది.. బలమైన పోర్చుగల్‌కు షాకిచ్చి ప్రపంచకప్‌ ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. నాకౌట్‌ ఆశలు నిలవాలంటే తప్పక గెలవాల్సిన గ్రూప్‌-హెచ్‌ మ్యాచ్‌లో ఆ జట్టు 2-1తో పోర్చుగల్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో బంతిపై నియంత్రణలో పోర్చుగల్‌ (62 శాతం)దే పైచేయి కానీ.. కీలక సమయాల్లో స్కోరు చేసిన కొరియాను విజయం వరించింది. అయిదో నిమిషంలో రికార్డో కొట్టిన గోల్‌తో ఆధిక్యంలోకి వెళ్లిన పోర్చుగల్‌ ఆ తర్వాతా పదే పదే కొరియా డిఫెన్స్‌ను పరీక్షించింది. కానీ కొరియా అదను చూసి దెబ్బ కొట్టింది. ఒకవైపు రక్షణ శ్రేణిని పటిష్టం చేసుకుని మరోవైపు దాడులు చేసిన కొరియా 27వ నిమిషంలో ఫలితం సాధించింది. కార్నర్‌ నుంచి బంతిని దొరకబుచ్చుకున్న యంగ్‌వాన్‌ మెరుపు వేగంతో నెట్‌లోకి పంపేశాడు. ఓ కాలుని మడత పెట్టి కొట్టిన ఆ షాట్‌కు బంతి పోర్చుగల్‌ కీపర్‌ను బోల్తా కొట్టిస్తూ గోల్‌ అయింది. ఆ తర్వాత పోర్చుగల్‌ గోల్‌ కోసం గట్టి ప్రయత్నాలే చేసింది. కొరియా కీపర్‌ అడ్డుగోడగా నిలవడంతో ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి. నిర్ణీత సమయం ముగిసి ఆట ఇంజురీ టైమ్‌కు వెళ్లడంతో మ్యాచ్‌ డ్రా దిశగా సాగుతున్నట్లే కనిపించింది. అలా జరిగితే కొరియా ఆశలు గల్లంతే. సమయం టిక్‌ టిక్‌ మంటూ పరుగెడుతుండగా.. ఒత్తిడి కమ్మేస్తుండగా కొరియా అద్భుతమే చేసింది. హి చాన్‌ (91వ ని) ఓ సూపర్‌ గోల్‌ చేసి కొరియా నాకౌట్‌ ఆశలకు ప్రాణం పోశాడు. పోర్చుగల్‌ గోల్‌ బాక్స్‌ సమీపంలో పాస్‌ అందుకున్న చాన్‌ పొరపాటుకు తావీయకుండా గోల్‌ కొట్టేశాడు. 2-1 ఆధిక్యాన్ని ఆఖరిదాకా కాపాడుకున్న కొరియా విజయహాసం చేసింది.


ఉరుగ్వే ఔట్‌

అల్‌వాక్రా: రెండుసార్లు ఛాంపియన్‌ ఉరుగ్వేకు నిరాశే. తన చివరి గ్రూప్‌ మ్యాచ్‌లో ఉరుగ్వే ప్రణాళికాబద్ధంగా ఆడి ఘనాపై 2-0తో విజయం సాధించినా.. పట్టికలో మూడో స్థానానికే పరిమితం కావడంతో ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించక తప్పలేదు. ఘనాతో మ్యాచ్‌లో డి అరస్కేటా 26, 32 నిమిషాల్లో గోల్‌ కొట్టి ఉరుగ్వేను గెలిపించాడు. 21వ నిమిషంలో ఘనాకు పెనాల్టీ లభించినా ఆ జట్టు కెప్టెన్‌ అయెవ్‌ సద్వినియోగం చేయలేకపోయాడు. ఇంకో అయిదు నిమిషాల తర్వాత అస్కరేటా ఆరు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్‌ కొట్టి ఘనా కోలుకోలేకుండా చేశాడు. ముందుగా కెప్టెన్‌ సువారెజ్‌ రీబౌండ్‌ షాట్‌ను నెట్‌లోకి పంపిన అస్కరేటా.. కాసేపటికే సువారెజ్‌ పాస్‌తో మరో గోల్‌ సాధించాడు.


ఘనంగా గెలిచినా...

అల్‌ ఖోర్‌: 2018లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా ప్రపంచకప్‌లో అడుగుపెట్టి గ్రూప్‌ దశలోనే నిష్క్రమించిన జర్మనీ.. మరోసారి నాకౌట్‌ చేరలేకపోయింది. గ్రూప్‌లో చివరి మ్యాచ్‌లో ఆ జట్టు 4-2 తేడాతో కోస్టారికాను చిత్తుచేసినా ఇంటి ముఖం పట్టక తప్పలేదు. ప్రత్యర్థి గోల్‌పోస్టు దగ్గరే కాచుకుని ఉన్న జర్మనీ ఆటగాళ్లు గోల్స్‌ మోత మోగించారు. సెర్జ్‌ నార్బీ (10వ) ఆ జట్టు ఖాతా తెరిచాడు. రెండో అర్ధభాగంలో తెజెదా (58వ) గోల్‌తో స్కోరు సమం చేసిన కోస్టారికా.. జర్మనీ గోల్‌కీపర్‌ మాన్యుల్‌ నోయర్‌ (70వ) సొంత గోల్‌ చేయడంతో 2-1తో ఆధిక్యంలో వెళ్లింది. ప్రత్యర్థి ఆటగాళ్ల గోల్‌ ప్రయత్నాన్ని అడ్డుకునే క్రమంలో బంతి అతని కాళ్లకు తగిలి తమ గోల్‌పోస్టులోకే వెళ్లింది. దీంతో కోస్టారికా పుంజుకునేలా కనిపించింది. కానీ జర్మనీ ఆ అవకాశం ఇవ్వలేదు. వెంటనే హవెర్జ్‌ (73వ, 85వ) రెండు గోల్స్‌తో జట్టుకు తిరిగి ఆధిక్యాన్ని అందించాడు. మరో నాలుగు నిమిషాలకే నిక్లాస్‌ (89వ) గోల్‌తో జట్టుతో విజయపథంలో సాగింది. చివరి వరకూ ఆధిక్యాన్ని నిలబెట్టుకుని ఘన విజయం సాధించింది. అయినా బాధతో మైదానం వీడాల్సి వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని