రామోస్‌ మాయ

రొనాల్డో.. రొనాల్డో.. అంటూ స్టేడియం హోరెత్తిపోయింది! స్విట్జర్లాండ్‌తో మ్యాచ్‌లో అతడి ఆట కోసం వేలాది మంది  ఎదురుచూశారు..! కానీ అసలు హీరో మాత్రం అతడు కాదు.

Updated : 08 Dec 2022 03:14 IST

గొన్సాలో హ్యాట్రిక్‌  
క్వార్టర్‌ఫైనల్లో పోర్చుగల్‌
స్విట్జర్లాండ్‌పై 6-1తో ఘనవిజయం
పోర్చుగల్‌ 6, స్విట్జర్లాండ్‌ 1

రొనాల్డో.. రొనాల్డో.. అంటూ స్టేడియం హోరెత్తిపోయింది! స్విట్జర్లాండ్‌తో మ్యాచ్‌లో అతడి ఆట కోసం వేలాది మంది  ఎదురుచూశారు..! కానీ అసలు హీరో మాత్రం అతడు కాదు. ఫుట్‌బాల్‌ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో స్థానంలో పోర్చుగల్‌ తుది జట్టులో చోటు దక్కించుకున్న యువ కెరటం 21 ఏళ్ల గొన్సాలో రామోస్‌ హ్యాట్రిక్‌తో దుమ్మురేపాడు. ఈ ప్రపంచకప్‌లో తొలి హ్యాట్రిక్‌ కొట్టిన ఆటగాడిగా రామోస్‌ రికార్డు సాధించిన వేళ పోర్చుగల్‌ క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఏకపక్షంగా సాగిన ప్రిక్వార్టర్‌ఫైనల్లో 6-1తో స్విట్జర్లాండ్‌ను చిత్తు చేసి ముందంజ వేసింది. గురువారం ఆటకు విరామం. శుక్రవారం బ్రెజిల్‌, క్రొయేషియా మ్యాచ్‌తో క్వార్టర్‌ఫైనల్స్‌కు తెరలేవనుంది.

స్విట్జర్లాండ్‌తో పోర్చుగల్‌ మ్యాచ్‌ మొదలైంది. కానీ ఆట కంటే ఎక్కువగా రొనాల్డో గురించే చర్చ ఎక్కువగా సాగింది. కెప్టెన్‌ అయ్యుండి అతడు డగౌట్‌కు పరిమితమవడంపై రొనాల్డో భవితవ్యంపై విశ్లేషణలు మొదలయ్యాయి. ఇదంతా కాసేపే. ప్రపంచకప్‌లో ప్రధాన ఆటగాడిగా తొలి మ్యాచ్‌ ఆడిన రామోస్‌ ఫుట్‌బాల్‌ ప్రపంచం అంతా తన గురించి మాట్లాడుకునేలా చేశాడు. స్విస్‌ డిఫెన్స్‌ను ఛేదించుకుంటూ బాక్స్‌లోకి దూసుకొస్తూ ఫెలిక్స్‌ అందించిన పాస్‌ను అందుకున్న రామోస్‌.. 17వ నిమిషంలో ఎడమ కాలితో ఒడుపుగా బంతిని నెట్‌లోకి పంపాడు. అయిదు ప్రపంచకప్‌లు ఆడిన రొనాల్డో ఇప్పటివరకు ఒక్కసారి కూడా నాకౌట్‌ మ్యాచ్‌లో గోల్‌ చేయలేదు. అతడి స్థానంలో ఆడిన తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లోనే రామోస్‌ గోల్‌ కొట్టడంతో స్టేడియం హోరెత్తిపోయింది. ఆ తర్వాత ఆట అంతా రామోస్‌ చుట్టూనే తిరిగింది. మ్యాచ్‌లో బంతిపై నియంత్రణలో, ఎక్కువ పాస్‌లు అందించుకోవడంలో ఇలా చాలా విభాగాల్లో పోర్చుగల్‌పై స్విట్జర్లాండ్‌దే పైచేయి. అయితే కచ్చితమైన షాట్‌లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసిన పోర్చుగల్‌ మ్యాచ్‌పై ఆధిపత్యం చెలాయించింది. రామోస్‌ తొలి గోల్‌ సాధించిన తర్వాత ఆ జట్టు ఆటగాళ్లు స్వేచ్ఛగా దాడులు చేశారు. 33వ నిమిషంలో బ్రూన్‌ ఫెర్నాండాస్‌ కార్నర్‌ కిక్‌ను పెపె హెడర్‌ గోల్‌ చేశాడు. ప్రథమార్ధంలో మరో గోల్‌ నమోదు కాలేదు. ద్వితీయార్ధం మరింత దూకుడు ప్రదర్శించిన పోర్చుగల్‌ రెండు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్‌ కొట్టింది. గోల్‌ పోస్టు వద్ద పొంచివున్న రామోస్‌ 51వ నిమిషంలో బాక్స్‌ అంచు నుంచి ఫెలిక్స్‌ అందించిన పాస్‌ను నెట్‌లోకి పంపించాడు. మరో రెండు నిమిషాలకే రామోస్‌కు హ్యాట్రిక్‌ సాధించే అవకాశం లభించింది. సహచరుడు అందించిన పాస్‌ను బాక్స్‌కు సమీపంలో అందుకున్న అతడి ముందు ఇద్దరే డిఫెండర్లు ఉన్నారు. అతడు ప్రయత్నించివుంటే గోల్‌ అయ్యేదేమో. తన ఎడమవైపు గురీరో చుట్టూ డిఫెండర్లు లేనిది గమనించిన అతడు.. బంతిని అందించగా గురీరో ఎలాంటి పొరపాటు చేయలేదు. 4-0 ఆధిక్యంతో పోర్చుగల్‌ మ్యాచ్‌ను శాసించే స్థితికి చేరుకున్నాక స్విట్జర్లాండ్‌ ఓ గోల్‌ కొట్టింది. అకంజి (59వ నిమిషం) ఆ జట్టు తరఫున గోల్‌ సాధించాడు. 67వ నిమిషంలో రామోస్‌ మరోసారి మెరిశాడు. లాంగ్‌ పాస్‌ అందుకున్న ఫెలిక్స్‌.. బాక్స్‌లోకి దూసుకెళ్తున్న రామోస్‌కు బంతి అందించాడు. చురుగ్గా వ్యవహరించిన అతడు ప్రత్యర్థి గోల్‌కీపర్‌ సోమర్‌ను తప్పిస్తూ బంతిని గోల్‌ చేసి.. హ్యాట్రిక్‌ నమోదు చేశాడు. ఈ ప్రపంచకప్‌లో హ్యాట్రిక్‌ సాధించిన తొలి ఆటగాడు అతడు. మరో అయిదు నిమిషాలకు రొనాల్డో సబ్‌స్టిట్యూట్‌గా అడుగుపెట్టాడు. ఆ తర్వాత రామోస్‌ మైదానాన్ని వీడాడు. రొనాల్డో కొన్ని గోల్‌ ప్రయత్నాలు చేసినా సఫలం కాలేదు. అదనపు సమయంలో పోర్చుగల్‌ తరఫున రాఫెల్‌ లియో (90+2) గోల్‌ సాధించాడు. క్వార్టర్‌ఫైనల్లో పోర్చుగల్‌.. మొరాకోను ఢీకొంటుంది.


ఎందుకు తప్పించారు..!

క్రిస్టియానో రొనాల్డో.. ప్రతి ఫుట్‌బాల్‌ జట్టూ తమతో ఉండాలని కోరుకునే ఆటగాడు. ఫుట్‌బాల్‌ చరిత్రలోనే మేటి ఆటగాళ్లలో ఒకడైన అతణ్ని పోర్చుగల్‌ జట్టు తుది పదకొండు మందిలోకి ఎంపిక చేయకపోవడం అభిమానులకు పెద్ద షాక్‌. స్విట్జర్లాండ్‌తో ప్రిక్వార్టర్స్‌ మ్యాచ్‌లో కోచ్‌ ఫెర్నాండో సాంటోస్‌ మొదట ప్రకటించిన 11 మంది ఆటగాళ్లలో అతను లేడు. రొనాల్డో స్థానంలో రామోస్‌ను సాంటోస్‌ ఎంచుకున్నాడు. 72వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌గా క్రిస్టియానోను ఆడించడం గమనార్హం. దక్షిణ కొరియాతో మ్యాచ్‌ మధ్యలో కోచ్‌ తన స్థానంలో మరొకరిని సబ్‌స్టిట్యూట్‌గా దింపగా.. రొనాల్డో నోటిపై వేలు వేసుకుని అసహనంతో మైదానం వీడాడు. రొనాల్డోను సబ్‌స్టిట్యూట్‌గా దింపడంపై సాంటోస్‌ స్పందిస్తూ.. ఇదంతా జట్టు వ్యూహంలో భాగమన్నాడు. అయితే కోచ్‌తో రొనాల్డోకు చెడిందన్న చర్చ నడుస్తోంది.


3

పోర్చుగల్‌ క్వార్టర్‌ఫైనల్‌ చేరడం ఇది మూడోసారి. 1966, 2006లోనూ క్వార్టర్స్‌ ఆడింది.


* 1966లో మూడో స్థానం కోసం జరిగిన ప్లేఆఫ్‌ మ్యాచ్‌ తర్వాత నాకౌట్లో రెండు కంటే ఎక్కువ గోల్స్‌ చేయడం పోర్చుగల్‌కు ఇదే తొలిసారి.

* మిరస్లావ్‌ క్లోజ్‌ (2002) తర్వాత ప్రధాన ఆటగాడిగా ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లో హ్యాట్రిక్‌ నమోదు చేసిన ఆటగాడు రామోస్‌.

* పీలే (1958లో 17 ఏళ్లు) తర్వాత నాకౌట్‌లో హ్యాట్రిక్‌ కొట్టిన పిన్నవయస్కుడు రామోస్‌. 1990 తర్వాత హ్యాట్రిక్‌ సాధించిన తొలి ఆటగాడు కూడా.


రామోస్‌ (17, 51, 67వ నిమిషం)                  

పెపె (33వ), గురీరో (55వ),

రాఫెల్‌ లియో (90+2వ)  


క్వార్టర్స్‌లో ఎవరితో ఎవరు?

బ్రెజిల్‌   × క్రొయేషియా
నెదర్లాండ్స్‌ × అర్జెంటీనా
పోర్చుగల్‌ × మొరాకో
ఇంగ్లాండ్‌ × ఫ్రాన్స్‌

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని