IPL Auction: ‘షాక్‌కు గురయ్యా.. తీవ్ర నిరాశ చెందా’ : ఐపీఎల్‌ వేలంపై పేసర్‌ ఆవేదన

ఇప్పటి వరకు 104 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడి 114 వికెట్లు పడగొట్టిన పేసర్‌ సందీప్‌ శర్మను ఇటీవల జరిగిన వేలంలో ఏ జట్టూ కొనుగోలు చేయలేదు. దీనిపై అతడు తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు.

Updated : 27 Dec 2022 12:36 IST


ఇంటర్నెట్‌ డెస్క్‌ :  ఐపీఎల్‌ మినీ వేలం(IPL 2023 auction).. కొందరు యువ ఆటగాళ్లను రాత్రికి రాత్రే మిలియనీర్లుగా మార్చింది. అయితే, అదే సమయంలో పలువురు వెటరన్‌ ఆటగాళ్లను ఒక్క ఫ్రాంఛైజీ కూడా కొనుగోలు చేయకుండా నిరాశ పర్చింది. ఈ జాబితాలో భారత పేసర్‌ సందీప్‌ శర్మ(Sandeep Sharma) కూడా ఉన్నాడు. కొచ్చిలో జరిగిన వేలంలో తనను ఏ జట్టూ కొనుగోలు చేయకపోవడంపై అతడు తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు.

‘నేను షాక్‌కు గురయ్యాను. తీవ్ర నిరాశ చెందాను. నన్నెందుకు కొనలేదో నాకే తెలియదు. ఏ జట్టుకు ఆడినా మంచి ప్రదర్శనే ఇచ్చాను. నన్ను ఏదో ఒక జట్టు కొనుగోలు చేస్తుందని అనుకున్నాను. ఇలా జరగడం ఊహించలేదు. ఎక్కడ తప్పు జరిగిందో తెలియదు. దేశవాళీ క్రికెట్‌లో రాణించాను. రంజీ ట్రోఫీ చివరి రౌండ్‌లో ఏడు వికెట్లు తీశాను. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలోనూ రాణించా’ అని సందీప్‌ ఆవేదన వ్యక్తం చేశాడు.

పవర్‌ప్లేలో స్థిరమైన వికెట్‌ టేకర్‌గా పేరున్న సందీప్‌.. ఇప్పటి వరకు 104 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడి 114 వికెట్లు పడగొట్టాడు. భారత్‌ తరఫున రెండు టీ20 మ్యాచ్‌లు ఆడి ఒక వికెట్‌ తీశాడు. ‘బౌలింగ్‌లో నిలకడగా వికెట్లు తీయడానికి నేను ప్రయత్నిస్తాను. అదొక్కటే నా చేతుల్లో ఉంది. జట్లు నన్ను ఎంచుకోవడం, ఎంచుకోకపోవడం నా చేతుల్లో లేదుగా’ అని నిరాశ వ్యక్తం చేశాడు. ఈ వేలంలో రూ.50 లక్షల బేస్‌ ప్రైస్‌తో ఉన్న ఇతడిని ఏ జట్టూ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని