Mohammed Shami: అర్జున అవార్డు రేసులో మహ్మద్‌ షమి.. బీసీసీఐ స్పెషల్ రిక్వెస్ట్

టీమ్ఇండియా సీనియర్ ఫాస్ట్‌బౌలర్‌ మహ్మద్‌ షమి (Mohammed Shami) అర్జున అవార్డు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.

Updated : 13 Dec 2023 19:07 IST

ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా సీనియర్ ఫాస్ట్‌బౌలర్‌ మహ్మద్‌ షమి (Mohammed Shami) అర్జున అవార్డు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్‌లో షమి అద్భుతంగా బౌలింగ్ చేయడంతో అతడి పేరుని అర్జున అవార్డు కోసం సిఫార్సు చేసినట్లు సమాచారం. ఈ విషయంలో క్రీడా మంత్రిత్వ శాఖకు బీసీసీఐ (BCCI) ప్రత్యేక అభ్యర్థన చేసిందట. క్రీడా మంత్రిత్వ శాఖకు మొదటగా పంపిన జాబితాలో మహ్మద్ షమి పేరు లేదు. అలాగే, ‘‘మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న’’ అవార్డుకు పురుషుల బ్యాడ్మింటన్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌, చిరాగ్ శెట్టి పేర్లను సిఫారసు చేశారు. మన దేశంలో ఖేల్‌రత్న తర్వాత అర్జున అవార్డు రెండో అత్యున్నత క్రీడా పురస్కారంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ అవార్డులను ఏటా ప్రదానం చేస్తారు. 

ఈ ఏడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ ఫైనల్‌కు చేరడంలో షమి కీలకపాత్ర పోషించాడు. టోర్నీలో మొదటి నాలుగు మ్యాచ్‌ల్లో అవకాశం దక్కకపోగా.. న్యూజిలాండ్‌తో మ్యాచ్ ముంగిట హార్దిక్ పాండ్య గాయపడి జట్టుకు అందుబాటులో లేకుండా పోవడంతో షమిని తుది జట్టులో వచ్చాడు. తర్వాత షమి వెనక్కి తిరిగి చూసుకోలేదు. సంచలన బౌలింగ్‌తో ఆకట్టుకుని ఇన్నాళ్లూ ఎందుకు పక్కన పెట్టారా అని అందరూ ఆశ్చర్యపోయేలా చేశాడు. కేవలం ఏడు మ్యాచ్‌ల్లోనే 24 వికెట్లు పడగొట్టి లీగ్‌లో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. మూడు మ్యాచ్‌ల్లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టాడు. అత్యుత్తమ ప్రదర్శన (7/57) న్యూజిలాండ్‌పై. ప్రపంచ కప్‌ తర్వాత విశ్రాంతి తీసుకుంటున్న షమి.. డిసెంబరు 26 నుంచి దక్షిణాఫ్రికాతో జరిగే రెండు టెస్టుల సిరీస్‌తో మైదానంలో అడుగుపెట్టనున్నాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని