Dhoni-Harman: రనౌట్లు ఎంత బాధపెడతాయో!.. నెట్టింట అభిమానుల కామెంట్లు

ఫీల్డింగ్‌లో ప్రత్యర్థి జట్టు చురుగ్గా ఉంటే బ్యాటర్లు అత్యంత జాగ్రత్తగా వ్యవరించాలి. ఏమాత్రం అవకాశం ఇచ్చినా రనౌట్‌ చేసేస్తారు. ఇలాంటి ప్రమాదమే భారత్‌కు (Team India) ఎదురైంది. ఆసీస్‌తో (INDw Vs AUS w) టీ20 ప్రపంచ కప్‌ సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో చోటు చేసుకుంది.

Published : 25 Feb 2023 01:41 IST

(ఫొటో సోర్స్: ట్విటర్)

ఇంటర్నెట్ డెస్క్‌: సెమీస్‌లో టీమ్‌ఇండియా ఓటమికి కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ (Harmanpreet kaur) రనౌట్ ప్రధాన కారణం. దీంతో ఈ రనౌట్ గురించి ఇప్పుడు ఒకటే చర్చ జరుగుతోంది. 2019 వన్డే ప్రపంచకప్‌లో ఎంఎస్ ధోనీ రనౌట్ మాదిరిగానే.. ఇప్పుడు హర్మన్‌ ఔట్‌ కావడం వల్లే భారత్‌ ఓటమిని చవిచూసిందని సోషల్‌ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. హర్మన్‌తోపాటు జెమీమా రోడ్రిగ్స్‌ శ్రమించినా ఆసీస్‌ చేతిలో ఓడిపోవాల్సి వచ్చిదని నెటిజన్లు పేర్కొన్నారు.

‘‘క్రికెట్ అనే గేమ్‌లో చిన్నపాటి మార్జిన్‌తోనే గెలుపోటములు చవిచూస్తాం. దానికి ఈ రెండు రనౌట్‌లు ప్రత్యక్ష ఉదాహరణలు’’

‘‘నిజమైన టీమ్‌ఇండియా క్రికెట్‌ అభిమానులు ఈ రెండు రనౌట్లను మరిచిపోలేరు. వుయ్‌ లవ్ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, ఎంఎస్ ధోనీ’’

‘‘2019 ప్రపంచకప్‌ రనౌట్ = ఎంఎస్ ధోనీ.. 2023 వరల్డ్‌ కప్‌ రనౌట్ = హర్మన్‌ప్రీత్‌ కౌర్. రనౌట్లు ఎప్పుడూ బాధపెడతాయి’’ 

‘‘జెర్సీ నంబర్ 7 ఐసీసీ టోర్నమెంట్‌ సెమీస్‌కు జట్టును తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే రనౌట్‌ రూపంలోనే ముగింపు ఇవ్వడం గమనార్హం. 5 పరుగుల తేడాతో ఓడిపోవడం బాధగా అనిపిస్తోంది. 2019లో ఎంఎస్ ధోనీ.. ఇప్పుడు హర్మన్‌ కెప్టెన్‌’’ అని అభిమానులు కామెంట్లు చేశారు.

అప్పుడు కూడా ధోనీ అలా..

2019 వన్డే ప్రపంచకప్‌లో ధోనీ, రవీంద్ర జడేజా అర్ధశతకాలు సాధించి విజయం వైపుగా దూసుకుపోతున్న వేళ.. వీరిద్దరూ ఔట్‌ కావడంతో న్యూజిలాండ్‌ చేతిలో ఓటమి తప్పలేదు. కివీస్‌ నిర్దేశించిన 240 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌ 92/6 స్కోరుతో ఉన్నప్పుడు... ధోనీ - జడేజా ఏడో వికెట్‌కు 116 పరుగులు జోడించారు. దీంతో భారత ఇన్నింగ్స్‌ గాడిన పడినట్లు అనిపించింది. అయితే, తొలుత జడేజా వికెట్‌ను నష్టపోయినప్పటికీ.. ధోనీ ఉన్నాడనే ధీమాతో భారత్‌ ఆడింది. కానీ, గప్తిల్‌ మార్టిన్‌ వేసిన డైరెక్ట్ త్రో వికెట్లను గిరాటేసింది. అర్ధశతకం సాధించి మరీ జట్టును విజయతీరాలకు చేర్చేలా అనిపించిన ధోనీ రనౌట్‌ కావడంతో భారత్‌ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. తర్వాత వచ్చిన బ్యాటర్లు విఫలం కావడం.. కివీస్‌ గెలవడం చకచకా జరిగిపోయాయి.

ఇప్పుడు ఇలా.. 

మహిళల టీ20 ప్రపంచకప్‌ 2023 సెమీస్‌లోనూ భారత్ అలాంటి పరిస్థితే ఎదురైంది. ఆసీస్‌ చేతిలో కేవలం 5 పరుగుల తేడాతో భారత్‌ ఓటమిపాలైంది. హర్మన్‌ప్రీత్ (52), జెమీమా రోడ్రిగ్స్ (43) రాణించడంతో ఒకానొక దశలో భారత్‌ విజయం దశగా సాగింది. 2019 ప్రపంచకప్‌లో ఎలా జరిగిందో.. అలాగే ఇప్పుడు కూడా రోడ్రిగ్స్‌ ఔటైన కాసేపటికే హర్మన్‌ రనౌట్‌ రూపంలో పెవిలియన్‌కు చేరడంతో భారత ఓటమి దిశగా సాగింది. చివర్లో బ్యాటర్లు రాణించకపోవడంతో పరాజయం తప్పలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని