INDvsNZ: టీమ్‌ఇండియా ఇన్నింగ్స్‌ విన్నింగ్స్‌..!

దాదాపు రెండేళ్లుగా ఎదురుచూస్తున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మరికొద్ది రోజుల్లో ప్రారంభంకానుంది. పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచిన టీమ్‌ఇండియా, న్యూజిలాండ్‌ జట్లు ఆ రసవత్తర పోరులో తలపడటానికి సిద్ధంగా ఉన్నాయి...

Published : 26 May 2021 09:22 IST

న్యూజిలాండ్‌పై ముచ్చటగా మూడు విజయాలు..

దాదాపు రెండేళ్లుగా ఎదురుచూస్తున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచిన టీమ్‌ఇండియా, న్యూజిలాండ్‌ జట్లు ఆ రసవత్తర పోరులో తలపడటానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రపంచ కప్‌కు ఏ మాత్రం తీసిపోని ఈ మెగా మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారనే విషయంపై ఇప్పటికే పలు రకాల కథనాలు వెలువడుతున్నాయి. అయితే, ఇరు జట్ల మధ్యా ఇప్పటివరకు జరిగిన టెస్టుల్లో టీమ్‌ఇండియా మూడుసార్లు ఆ జట్టుపై ఇన్నింగ్స్‌ తేడాతో గెలుపొందింది. అవి ఎప్పుడు జరిగాయో.. ఎవరు గెలిపించారో ఓసారి చూద్దాం..


‘వినో’ద మన్కడ్‌..

అది 1956 చెన్నైలోని నెహ్రూ స్టేడియం. న్యూజిలాండ్‌పై టీమ్‌ఇండియా సాధించిన తొలి గొప్ప విజయం. ఇన్నింగ్స్‌ 109 పరుగుల తేడాతో పాలీ ఉమ్రిగర్‌ నేతృత్వంలోని భారత జట్టు రికార్డు విజయం సాధించిన సందర్భం. ఆ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లే కోల్పోయి 537 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఓపెనర్లు వినో మన్కడ్‌ (231; 21x4), పంకజ్‌రాయ్‌ (173; 12x4) తొలి వికెట్‌కు 413 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. అది 52 ఏళ్ల పాటు ప్రపంచంలోనే అత్యుత్తమ తొలి వికెట్‌ భాగస్వామ్యంగా నిలిచింది. ఆపై కెప్టెన్‌ ఉమ్రిగర్‌ (79), గుల్బారాయ్‌ రామ్‌చంద్‌ (21) పరుగులు చేసి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేశారు. అనంతరం భారత బౌలర్లు శుభాష్‌ గుప్తె 5/72, జసుభాయ్‌ పటేల్‌ 3/63 రాణించడంతో న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 209 పరుగులకే ఆలౌటైంది. ఫాలోఆన్‌లో 219 పరుగులకే కుప్పకూలింది. శుభాష్‌ 4/73 మరోసారి మెరిశాడు. వినో మన్కడ్‌ 4/65 సైతం రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. ఇది టీమ్‌ఇండియాకు అప్పట్లో అతిపెద్ద విజయంగా రికార్డులకెక్కింది.


కలిసి‘కొట్టు’డు విజయం..

2010 నాగ్‌పూర్‌ వేదికగా జరిగిన ఇంకో టెస్టులో టీమ్‌ఇండియా.. న్యూజిలాండ్‌పై ఇన్నింగ్స్‌ 198 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఇన్నింగ్స్‌ పరుగుల తేడాలో ఆ జట్టుపై భారత్‌కిదే అత్యుత్తమ రికార్డు. ఈసారి టాస్‌ గెలిచి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 193 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లు ఇషాంత్‌ శర్మ 4/43, ప్రజ్ఞాన్‌ ఓజా 3/57 విజృంభించడంతో కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ క్రీజులో నిలవలేకపోయారు. జెస్సీ రైడర్‌ (59; 113 బంతుల్లో 5x4), బ్రెండన్‌ మెక్‌కలమ్‌ (40; 84 బంతుల్లో 4x4), టిమ్‌ సౌథీ (38; 68 బంతుల్లో 2x4, 3x6) మోస్తరు బ్యాటింగ్‌ చేశారు. ఆపై టీమ్‌ఇండియా బ్యాట్స్‌మెన్‌ కలిసికట్టుగా ఆడడంతో 8 వికెట్ల నష్టానికి 566 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఓపెనర్లు గంభీర్‌ (78; 127 బంతుల్లో 12x4) సెహ్వాగ్‌ (74; 73 బంతుల్లో 12x4, 1x6)తో పాటు వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ రాహుల్‌ ద్రవిడ్‌ (191; 396 బంతుల్లో 21x4) అద్భుతంగా ఆడారు. మధ్యలో సచిన్ ‌(61; 129 బంతుల్లో 8x4), ధోనీ (98; 156 బంతుల్లో 12x4, 1x6) సైతం అర్ధశతకాలతో రాణించారు. కివీస్‌ బౌలర్లలో వెటోరీ 3/178, క్రిస్‌ మార్టిన్‌ 2/82 వికెట్లు తీసినా అప్పటికే భారీ స్కోర్‌ ఇచ్చారు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఇషాంత్‌ 3/15, హర్భజన్‌ 3/56, రైనా 2/1, ఓజా 2/67 రాణించడంతో ఆ జట్టు 175 పరుగులకే కుప్పకూలింది.


అ‘స్పిన్‌’ మాయాజాలం..

టీమ్‌ఇండియా చివరిసారి న్యూజిలాండ్‌పై ఇన్నింగ్స్‌ 115 పరుగుల తేడాతో విజయం సాధించింది 2012 హైదరాబాద్‌ వేదికగా రాజీవ్‌గాంధీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో. తొలుత బ్యాటింగ్‌ చేసిన ధోనీసేన 438 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. అప్పటికి కొత్తగా వచ్చిన ఛెతేశ్వర్‌ పుజారా (159; 306 బంతుల్లో 19x4, 1x6).. ద్రవిడ్‌ను మరిపిస్తూ నయావాల్‌గా పేరుతెచ్చుకున్నాడు. అతడికి తోడు కెప్టెన్‌ ధోనీ (73; 147 బంతుల్లో 6x4, 1x6), విరాట్‌ కోహ్లీ (58; 107 బంతుల్లో 8x4) అర్ధశతకాలతో రాణించారు. అనంతరం రవిచంద్రన్‌ అశ్విన్‌ స్పిన్‌ బౌలింగ్‌తో చెలరేగడంతో కివీస్‌కు భారీ ఓటమి తప్పలేదు. తొలి ఇన్నింగ్స్‌లో 6/31, రెండో ఇన్నింగ్స్‌లో 6/54 ప్రదర్శనలతో ఆకట్టుకున్నాడు. అతడు విసిరిన గింగిరాల బంతులకు న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మెన్‌తో సమాధానం లేకపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో జేమ్స్‌ ఫ్రాంక్లిన్‌ (43; 122 బంతుల్లో 1x4, 1x6) టాప్‌ స్కోరర్‌గా నిలవగా జట్టు స్కోర్‌ 159గా నమోదైంది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో కేన్‌ విలియమ్సన్‌ (52; 163 బంతుల్లో 4x4) అర్ధశతకం సాధించగా జట్టు స్కోర్‌ 165కే పరిమితమైంది. మిగతా బ్యాట్స్‌మెన్‌ పూర్తిగా విఫలమయ్యారు. అలా టీమ్‌ఇండియా న్యూజిలాండ్‌పై ఇప్పటివరకు మూడు సార్లు ఇన్నింగ్స్‌ పరుగుల తేడాతో గెలుపొందింది.

-ఇంటర్నెట్‌డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని