Babar Azam: బాబర్ అజామ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పాక్ అభిమానులు.. కారణం ఏంటంటే?

పాకిస్థాన్‌ స్టార్‌ బ్యాటర్ బాబర్‌ అజామ్‌ (Babar Azam)పై సొంత దేశ అభిమానులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి వారి ఆగ్రహానికి గల కారణమేంటంటే?

Published : 26 May 2023 01:41 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఈ ఏడాది అక్టోబర్- నవంబర్‌ల మాసాల్లో భారత్‌ వేదికగా వన్డే ప్రపంచకప్‌ (World Cup 2023) జరగనుంది. ఈ మెగా టోర్నీ  కోసం ఇప్పటి నుంచే చాలా దేశాలు జట్ల కూర్పుపై దృష్టిపెట్టాయి. కీలకమైన ఆటగాళ్లకు పనిభారం పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో ప్రధాన ఆటగాళ్లు ఎంతో బాధ్యతాయుతంగా ఉండాల్సిన అవసరముంది. ఏదైనా అనుకోని ఘటన జరిగి గాయపడితే ఆ జట్లకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లే. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌ స్టార్‌ బ్యాటర్ బాబర్ అజామ్‌ (Babar Azam) చేసిన ఓ చర్యను ఆ దేశ అభిమానులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ‘ప్లీజ్.. మళ్లీ అలా చేయొద్దు’ అని కోరుతున్నారు. రహదారిపై  బాబర్‌ అజామ్‌ స్పోర్ట్స్‌ బైక్‌ను అతివేగంగా నడపడటమే ఇందుకు కారణం. తాజాగా తాను స్పోర్ట్స్‌ బైక్‌ను నడుపుతున్న వీడియోను బాబర్‌ అజామ్‌ ట్విటర్ ఖాతాలో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియోను చూసిన అభిమానులు ‘‘నువ్వు.. చాలా ముఖ్యమైన ఆటగాడివి. దయచేసి ఇలా ప్రమాదకరంగా బైక్‌ నడపకు’’ అని ఓ అభిమాని ట్వీట్ చేయగా.. ‘‘కెప్టెన్‌ రిస్క్‌ చేయకు.. ప్లీజ్‌ ప్రపంచకప్ వరకు నువ్వు బైక్‌లు నడపొద్దు’’ మరో అభిమాని కోరాడు. ‘‘కొన్ని నెలల్లో ప్రపంచకప్ ఉంది.. ఇష్టం వచ్చినట్టు డ్రైవింగ్ చేయకు’’ అని ఓ యూజర్‌ ట్వీట్‌ చేశాడు. ‘‘ఐదు నెలల్లో ప్రపంచకప్‌ ఆడబోతున్నారు. బాబర్‌ అజామ్‌ ఇటువంటి ప్రమాదకర చర్యలు అవసరమా? నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అతడిని కెప్టెన్సీ నుంచి తొలగించండి’’ అని ఓ అభిమాని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘‘వరల్డ్ కప్‌ కోసం నీ స్పీడ్‌ తగ్గించు’’ అని మరో అభిమాని ట్వీట్ చేశాడు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని