Jasprit Bumrah: అతడికిదే తొలి పర్యటన.. నా స్పెల్‌ అంకితం చేస్తున్నా: జస్‌ప్రీత్ బుమ్రా

రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ బ్యాటర్లను బోల్తా కొట్టిస్తూ జస్‌ప్రీత్‌ బుమ్రా అదరగొట్టాడు. ఆరు వికెట్ల ప్రదర్శన చేశాడు.

Updated : 04 Feb 2024 10:57 IST

ఇంటర్నెట్ డెస్క్‌: రెండో టెస్టు మ్యాచ్‌లో ఆరు వికెట్ల ప్రదర్శనతో జస్‌ప్రీత్‌ బుమ్రా (6/45) ఇంగ్లాండ్‌ను బెంబేలెత్తించాడు. బెన్‌ స్టోక్స్‌, ఓలీ పోప్, జో రూట్‌ వంటి టాప్‌ బ్యాటర్లను బోల్తా కొట్టించాడు. టెస్టుల్లో మరోసారి అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు. భారత్‌ తరఫున వేగంగా 150+ వికెట్లు పడగొట్టిన పేసర్‌గా నిలిచాడు. ఇలాంటి అద్భుత స్పెల్‌ను ఎవరికి అంకితం చేస్తావని బుమ్రాను ప్రశ్నించగా.. ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ఆ వీడియోను బీసీసీఐ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది.

‘‘టెస్టుల్లో వేగంగా 150 వికెట్ల మైలురాయిని సాధించడం ఆనందంగా ఉంది. జట్టు విజయం సాధించినప్పుడే.. ఈ ప్రదర్శనకు ఓ అర్థముంటుంది. అంతకుమించిన ఆనందమూ ఉండదు. ఈ స్పెల్‌ను నా కుమారుడికి అంకితం ఇస్తున్నా. అతడితో కలిసి పర్యటించడం ఇదే తొలిసారి. నాకు ఇదెంతో స్పెషల్‌. 

టెస్టుల్లో నా వందో వికెట్ ఓలీ పోప్‌. 2021 పర్యటనలో ఓవల్‌ మైదానంలో అతడిని ఔట్‌ చేశా. ఇప్పుడు మరోసారి పోప్‌ను పెవిలియన్‌కు చేర్చా. లెంగ్త్‌ బాల్‌ వేద్దామని తొలుత భావించినా.. ఆఖర్లో యార్కర్‌ సంధించా. వికెట్‌ దక్కింది. స్వింగ్‌ కావడంతో పోప్ కూడా ఎదుర్కోలేకపోయాడు. బెన్‌ స్టోక్స్‌ వికెట్‌ కోసం ఎలాంటి ప్లాన్‌ చేయలేదు. ఔట్‌ స్వింగర్‌ కోసం ప్రయత్నించా. కానీ, బంతి స్వింగ్‌ కాలేదు. నేరుగా వికెట్ల మీదకు వెళ్లిపోయింది. టెస్టు ఫార్మాట్‌లో బౌలింగ్‌ చేయడాన్ని చాలా ఇష్టపడతా’’ అని బుమ్రా వ్యాఖ్యనించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని