World cup 2023: రోహిత్‌, బాబర్‌, గిల్ కాదు.. ఈసారి అతడే టాప్‌ స్కోరర్‌: జో రూట్‌

ఈ వన్డే ప్రపంచకప్‌లో ఏ ఆటగాడు అత్యధిక పరుగులు చేస్తాడనే పలువురు క్రికెటర్లు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఇంగ్లాండ్ బ్యాటర్ జానీ బెయిర్‌ స్టో (Jonny Bairstow) టాప్‌స్కోరర్‌గా నిలుస్తాడని జో రూట్‌ అభిప్రాయపడ్డాడు.

Updated : 07 Sep 2023 14:58 IST

ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్ (World Cup 2023) ప్రారంభానికి సరిగ్గా నెల రోజుల సమయం కూడా లేదు. దీంతో ప్రధాన జట్లన్నీ ఎలాగైనా టైటిల్‌ను దక్కించుకోవాలనే లక్ష్యంతో ప్రణాళికలను రచిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని దేశాలు జట్లను ప్రకటించేశాయి. ఈ టోర్నీకి భారత్‌కు ఆతిథ్యం ఇవ్వనుండటంతో టీమ్‌ఇండియాపై భారీ అంచనాలున్నాయి. సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్‌ శర్మలతోపాటు ఇప్పుడిప్పుడే ప్రధాన ఆటగాళ్లుగా ఎదుగుతున్న శుభ్‌మన్‌ గిల్, ఇషాన్ కిషన్‌ తదితర ఆటగాళ్లు చెలరేగి ఆడి భారత్‌కు ఐసీసీ కప్‌ కరవును తీర్చాలని అభిమానులు ఆశిస్తున్నారు.

‘ఇషాన్ 2 ఇన్‌ 1 ప్లేయర్‌.. ఆ ఓవర్లలో ఎలా ఆడాలో సూర్యకుమార్‌కు తెలీదు’

ఇదిలా ఉండగా.. ఈ మెగా టోర్నీలో ఏ ఆటగాడు అత్యధిక పరుగుల వీరుడిగా నిలుస్తాడనే దానిపై ఇప్పుడే చర్చ మొదలైపోయింది. ఫామ్‌లో ఉన్న బాబర్‌ అజామ్‌, శుభ్‌మన్‌ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలలో ఎవరో ఒకరు అత్యధిక పరుగుల చేసిన ఆటగాడిగా నిలుస్తాడని అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తుండగా.. ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ (Joe Root) ఆశ్చర్యకరంగా ఈ జాబితాలో లేని ఆటగాడిని ఎంచుకున్నాడు. ఈ సారి జానీ బెయిర్‌ స్టో (Jonny Bairstow) టాప్‌స్కోరర్‌గా నిలుస్తాడని జో రూట్‌ అభిప్రాయపడ్డాడు. బెయిర్‌స్టో  పరిమితి ఓవర్ల క్రికెట్‌లో అద్భుతమైన ఆటగాడని, టాప్‌ ఆర్డర్‌లో అతడెంతో నిలకడగా ఆడుతున్నాడని పేర్కొన్నాడు. మరోవైపు, ఇంగ్లాండ్ స్పిన్నర్‌ ఆదిల్ రషీద్‌ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలుస్తాడని జో రూట్ విశ్వాసం వ్యక్తం చేశాడు. అతనికి నైపుణ్యముందని, స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లపై సత్తాచాటుతాడని చెప్పాడు. వన్డే ప్రపంచకప్ అక్టోబర్‌ 5 నుంచి ప్రారంభంకానుంది. టోర్నీ ఆరంభపోరులో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌తో న్యూజిలాండ్ తలపడనుంది. భారత్, ఇంగ్లాండ్ మ్యాచ్‌ అక్టోబర్‌ 29న లఖ్‌నవూలో జరగనుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని