దంచేసిన నరైన్‌, రాణా: దిల్లీ లక్ష్యం 195

కోల్‌కతా అదరగొట్టింది. చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచులో నిలిచింది. సునీల్‌ నరైన్‌ (64; 32 బంతుల్లో 6×4, 4×6), నితీశ్‌ రాణా (81; 53 బంతుల్లో 13×4, 1×6) దంచికొట్టడంతో దిల్లీకి 195 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది. ఆన్రిచ్‌ నార్జె, రబాడా దెబ్బకు 11/1.. 35/2.. 42/3..తో నిలిచిన ఆ జట్టు భారీ...

Published : 24 Oct 2020 17:16 IST

భారీ సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడ్డ నరైన్‌, రాణా

అబుదాబి: కోల్‌కతా అదరగొట్టింది. చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచులో నిలిచింది. సునీల్‌ నరైన్‌ (64; 32 బంతుల్లో 6×4, 4×6), నితీశ్‌ రాణా (81; 53 బంతుల్లో 13×4, 1×6) దంచికొట్టడంతో దిల్లీకి 195 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది. ఆన్రిచ్‌ నార్జె, రబాడా దెబ్బకు 11/1.. 35/2.. 42/3..తో నిలిచిన ఆ జట్టు భారీ స్కోరు చేసిందంటే నరైన్‌, రాణా మెరుపుల వల్లే.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన మోర్గాన్‌ సేనకు శుభారంభం దక్కలేదు. రెండో ఓవర్లోనే ఓపెనర్‌ శుభ్‌మన్‌ (9; 8 బంతుల్లో 2×4)ను నోర్జె పెవిలియన్‌ పంపించాడు. మరికాసేపటికే రాహుల్‌ త్రిపాఠి (13; 12 బంతుల్లో 1×)ని క్లీన్‌బౌల్డ్‌‌ చేశాడు. ఆదుకుంటాడని భావించిన దినేశ్‌ కార్తీక్‌ (3; 6 బంతుల్లో) సైతం రబాడా ధాటికి  నిలవలేకపోయాడు.

ఈ క్రమంలో నితీశ్‌ రాణా, సునిల్‌ నరైన్‌ దూకుడుగా ఆడారు. వికెట్‌ పడకుండా అడ్డుకున్నారు. సీనియర్‌ స్పిన్నర్‌ అశ్విన్‌, మీడియం పేసర్‌ స్టాయినిస్‌ను లక్ష్యంగా ఎంచుకొని వినూత్నమైన షాట్లతో అలరించారు. వేగంగా అర్ధశతకాలు సాధించారు. నాలుగో వికెట్‌కు 115 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రమాదకరంగా మారిన ఈ జోడిని నరైన్‌ను ఔట్‌ చేయడం ద్వారా రబాడా విడదీశాడు. అప్పటికి జట్టు స్కోరు 157. ఆ తర్వాత ఇయాన్‌ మోర్గాన్‌ (17*; 9 బంతుల్లో 2×4, 1×6) సహకారంతో రాణా రెచ్చిపోయాడు. వరుస బౌండరీలతో చెలరేగి జట్టును 194/6తో నిలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని