Delhi Vs Rajasthan: ఈ నిర్ణయం థర్డ్‌ అంపైర్‌కూ కష్టమే.. సంజూ ఔట్‌తోనే ఓడిపోయాం: సంగక్కర

సంజూ శాంసన్ ఇచ్చిన క్యాచ్‌ను దిల్లీ ఫీల్డర్‌ షై హోప్ అద్భుతంగా పట్టాడు. కానీ, బౌండరీ లైన్‌కు అతడి పాదం తాకిందనే ఆరోపణలు వచ్చాయి. థర్డ్‌ అంపైర్‌ మాత్రం ఔట్‌గా ఇవ్వడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.

Published : 08 May 2024 13:37 IST

ఇంటర్నెట్ డెస్క్: ఇప్పుడందరి నోటా సంజూ శాంసన్‌ (Sanju Samson) ఔట్‌పైనే చర్చ. రాజస్థాన్‌ కెప్టెన్ ఇచ్చిన క్యాచ్‌ను దిల్లీ ఫీల్డర్‌ షై హోప్‌ పట్టుకొనే క్రమంలో బౌండరీ రోప్‌కు కాలు తాకినట్లు ఆరోపణలు వచ్చాయి. థర్డ్‌ అంపైర్‌ ఇంకాస్త నిశితంగా పరిశీలించి ఉంటే బాగుండేదన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో రాజస్థాన్‌ ఫ్రాంచైజీ డైరెక్టర్ కుమార సంగక్కర స్పందించాడు. తమ జట్టు ఓడిపోవడానికి ఇది కూడా ఒక కారణమని చెబుతూనే.. దిల్లీ ఆటగాళ్లు అద్భుతంగా ఆడారని కితాబిచ్చాడు. 

‘‘క్యాచ్‌ పట్టిన విధానంపై ఒక్కోరిది ఒక్కో అభిప్రాయం ఉంటుంది. రిప్లేల్లో కనిపించేది, చూసిన కోణాలనుబట్టి దృక్కోణం మారుతూ ఉంటుంది. ఈ వీడియోలను చూస్తుంటే రోప్‌ను తాకినట్లే అనిపిస్తుంది. థర్డ్‌ అంపైర్‌కు కూడా నిర్ణయం తీసుకోవడం కష్టమే. మ్యాచ్‌ చాలా కీలక దశలో ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయం రావడం నిరాశకు గురి చేసింది. చివరికి థర్డ్‌ అంపైర్‌ తీసుకున్న నిర్ణయానికే కట్టుబడాల్సి ఉంటుంది. మా అభిప్రాయం విభిన్నంగా ఉంది. దానిని అంపైర్లతో పంచుకొని సమస్యను పరిష్కరించుకుంటాం. మ్యాచ్‌ను తప్పకుండా గెలిచేవాళ్లమే. ఆ వికెట్‌ చేజారడం వల్లే నష్టపోయాం. ఇక్కడ దిల్లీ ఆటగాళ్ల ప్రదర్శనను తక్కువ చేయడానికి వీల్లేదు. చాలా బాగా ఆడారు. చివరి వరకూ పోరాడి విజయం సాధించారు. నాణ్యమైన బౌలింగ్‌తో మమ్మల్ని కట్టడి చేశారు. ఈ సీజన్‌లో సంజూ తన పాత్రపై స్పష్టమైన అవగాహనతో ఉన్నాడు. సోషల్ మీడియాకు అతడు చాలా దూరం. వ్యక్తిగతంగా ప్రైవసీని కోరుకుంటాడు’’ అని కుమార సంగక్కర వెల్లడించాడు. 

హోప్‌ అద్భుతంగా క్యాచ్‌ పట్టాడు: ప్రవీణ్‌ ఆమ్రే

‘‘ఐపీఎల్‌లో విజయం సాధించాలంటే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే మ్యాచ్‌పై పట్టు సాధించేందుకు అవకాశం ఉంటుంది. సంజూ శాంసన్‌ అద్భుతంగా ఆడాడు. ఇలాంటి ఒత్తిడి సమయంలో నియంత్రణ కోల్పోకుండా షై హోప్‌ క్యాచ్‌ను ఒడిసిపట్టాడు. క్యాచ్‌పై అనుమానాలు ఉండటం సహజమే. కానీ, అక్కడ అంపైర్లు ఉన్నారు. సాంకేతికత ఉంది. వారు తీసుకున్న నిర్ణయమే శిరోధార్యం. ఇలాంటి క్లిష్టమైన క్యాచ్‌ను అందుకున్న షై హోప్‌ను అభినందించాల్సిందే. మ్యాచ్‌ తర్వాత నేను అతడితో మాట్లాడా. బంతి అంత వేగంగా వస్తుందని ఊహించలేదని చెప్పాడు. ఈ క్యాచ్‌ మా జట్టుకు మ్యాచ్‌ను దక్కేలా చేసింది’’ అని ప్రవీణ్‌ తెలిపాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు