IND vs AUS: షమీ వచ్చేస్తాడు.. పిచ్‌ తయారీపై ఎలాంటి సూచనల్లేవు: జీసీఏ

ఒక్క టెస్టు మ్యాచ్‌ ఓడిపోవడంతో టీమ్‌ఇండియా (Team India) పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఐసీసీ టాప్‌ ర్యాంక్‌తోపాటు టెస్టు సిరీస్‌ గెలవడం, డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూసుకెళ్లడంపై సందిగ్ధత ఏర్పడింది. చివరి మ్యాచ్‌లో గెలిస్తేనే ఇవన్నీ సాధ్యమవుతుంది. 

Published : 05 Mar 2023 01:36 IST

ఇంటర్నెట్ డెస్క్: బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో (Border - Gavaskar Trophy) మార్చి 9 నుంచి భారత్ - ఆస్ట్రేలియా (IND vs AUS) జట్ల మధ్య నాలుగో టెస్టు జరగనుంది. ఇందుకు అహ్మదాబాద్‌ వేదికగా నిలవనుంది. ప్రస్తుతం భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. మూడో టెస్టు మ్యాచ్‌కు దూరమైన టీమ్‌ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ అహ్మదాబాద్‌ మ్యాచ్‌లో ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పిచ్‌ మీద షమీ కీలకంగా మారతాడని జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తోంది. రివర్స్‌ స్వింగ్‌ రాబట్టి ప్రత్యర్థి ఆసీస్‌ బ్యాటర్లను ఇబ్బంది పెడితే టీమ్‌ఇండియా విజయం సాధించడం సులభమవుతుంది. మరి తుది జట్టులో ఎవరు ఉంటారనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే. నాలుగో టెస్టు మ్యాచ్‌కు సమయం ఉండటంతో టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన భార్యతో కలిసి ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ఆలయాన్ని సందర్శించాడు.

మాకేమీ సూచనలు అందలేదు: జీసీఏ

మూడు రోజులు ముగియకుండానే టెస్టు ముగియడం.. పిచ్‌పై తీవ్ర విమర్శలు రావడంతో ఇందౌర్ పిచ్‌కు ఐసీసీ ‘పేలవం’ రేటింగ్‌ ఇచ్చింది. దీంతో గుజరాత్‌ క్రికెట్‌ అసోషియేషన్‌ (GCA) అప్రత్తమమైంది. ఎలాంటి రిమార్క్‌ లేకుండా  అహ్మదాబాద్ పిచ్‌ను తయారు చేసేందుకు ఉపక్రమించింది. ఈ క్రమంలో భారత జట్టు మేనేజ్‌మెంట్‌ నుంచి పిచ్‌ తయారీపై ఎలాంటి సూచనలు రాలేదని జీసీఏ తెలిపింది. ‘‘భారత క్రికెట్‌ జట్టు మేనేజ్‌మెంట్ నుంచి మాకు ఎలాంటి సూచనలు రాలేదు. ప్రతి సీజన్‌లో తయారు చేసినట్లుగానే మా క్యురేటర్లు సిద్ధం చేస్తారు. జనవరిలో ఇక్కడే రంజీ మ్యాచ్‌ జరిగింది. రైల్వేస్ 500కిపైగా పరుగులు సాధించింది. ఇక గుజరాత్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 205, 247 పరుగులు చేసి ఇన్నింగ్స్‌తేడాతో ఓటమిపాలైంది. ఆడే విధానం బట్టి పిచ్‌ సహకరిస్తుంది. గత కొన్ని రోజులుగా బీసీసీఐ గ్రౌండ్స్‌, పిచ్‌ల కమిటీ ప్రతి క్యురేటర్‌కు మార్గదర్శకత్వం చేసింది. కాబట్టి, తప్పకుండా మంచి టెస్టు మ్యాచ్‌ పిచ్‌ను తయారు చేసేందుకు ప్రయత్నిస్తాం’’ అని అధికారులు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని