Cricket News: నా సక్సెస్‌ను వారు తట్టుకోలేకపోతున్నారన్న షమీ.. సూర్యకు కెప్టెన్సీపై అశ్విన్‌ స్పందన ఇదీ!

Published : 23 Nov 2023 11:07 IST

ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా షమీ అదరగొట్టాడు. అయితే, పాక్‌లోని కొందరు మాజీ ఆటగాళ్లకు తన సక్సెస్‌ నచ్చదని వ్యాఖ్యానించాడు. ఆసీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌ కోసం సూర్యను భారత కెప్టెన్‌గా నియమించిన సంగతి తెలిసిందే. నేడు ఇరు జట్ల  మధ్య విశాఖపట్నం వేదికగా మ్యాచ్‌ జరగనుంది. ఈ క్రమంలో అశ్విన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇలాంటి క్రికెట్ విశేషాలు మీ కోసం.. 

వారే అత్యుత్తమమని భావిస్తుంటారు: పాక్‌ మాజీలకు షమీ చురకలు

వన్డే ప్రపంచ కప్‌లో కేవలం ఏడు మ్యాచుల్లోనే 24 వికెట్లతో మహమ్మద్ షమీ టాప్‌ బౌలర్‌గా నిలిచాడు. దీంతో అతడిని టార్గెట్‌ చేస్తూ పాకిస్థాన్‌కు చెందిన కొందరు మాజీ ఆటగాళ్లు ఆరోపణలు గుప్పించారు. అయితే, వాటిని ఇప్పటికే ఖండించిన షమీ మరోసారి వాటిపై తన అసహనాన్ని వ్యక్తం చేశాడు.

 ‘‘వరల్డ్‌ కప్‌లో భారత మ్యాచ్‌లు మొదలైనప్పటి నుంచి ఇలాంటి మాటలు వింటున్నా. బంతులను మార్చారు. డీఆర్‌ఎస్‌ను టాంపరింగ్‌ చేశారంటూ వ్యాఖ్యలు వినిపించాయి. నేను తొలి నాలుగు మ్యాచుల్లో బెంచ్‌పైనే కూర్చున్నా. తుది జట్టులోకి వచ్చిన మొదటి మ్యాచ్‌లోనే ఐదు వికెట్లు తీశా. ఆ తర్వాత కూడా అద్భుతంగా రాణించా. దీంతో కొందరు పాక్‌ ఆటగాళ్లకు నా సక్సెస్‌ను జీర్ణించుకోవడం కష్టంగా మారింది. ఎందుకంటే వారికి వారే అత్యుత్తమమని భావిస్తుంటారు. నా వరకైతే మాత్రం ఆ మ్యాచ్‌లో ఎవరు గొప్పగా రాణిస్తే వారే బెస్ట్‌ బౌలర్’’ అని షమీ తెలిపాడు. 


జాతీయ జట్టుకు నాయకత్వం వహించడం ఎంతో గౌరవం: అశ్విన్‌

సూర్యకుమార్ యాదవ్‌ నాయకత్వంలో ఐదు టీ20ల సిరీస్‌లో ఆస్ట్రేలియాతో తలపడేందుకు టీమ్‌ఇండియా సిద్ధమైంది. ఇవాళ రాత్రి 7 గంటలకు విశాఖపట్నం వేదికగా తొలి మ్యాచ్‌ జరగనుంది. ఈ క్రమంలో భారత సారథిగా నియమితులైన సూర్యకుమార్‌ యాదవ్‌కు సీనియర్‌ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్‌ అభినందనలు తెలిపాడు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్టోరీ పెట్టాడు. ‘‘కంగ్రాట్స్‌ సూర్యకుమార్ యాదవ్. జాతీయ జట్టుకు నాయకత్వం వహించే అవకాశం రావడం ఎంతో గౌరవప్రదం. బెస్ట్‌ ఆఫ్‌ లక్‌’’ అని రాసుకొచ్చాడు. తొలి మూడు మ్యాచ్‌లకు సూర్యకుమార్‌ డిప్యూటీగా రుతురాజ్‌ గైక్వాడ్ వ్యవహరిస్తాడు. చివరి రెండు మ్యాచులకు శ్రేయస్‌ అయ్యర్ జట్టులోకి వచ్చి వైస్‌కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరిస్తాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని