MS Dhoni: అందుకే.. మైదానంలో ఎప్పుడూ కోపం తెచ్చుకోను: ధోనీ

‘‘నేనూ మనిషినే.. కానీ, మైదానంలో ఉన్నప్పుడు నా భావోద్వేగాలను నియంత్రించుకునేందుకు వీలైనంత ప్రయత్నిస్తుంటా’’ అని అంటున్నాడు టీమిండియా

Updated : 23 Sep 2022 17:28 IST

ఆసక్తికర విషయాలు పంచుకున్న ‘మిస్టర్‌ కెప్టెన్‌ కూల్‌’

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘‘నేనూ మనిషినే.. కానీ, మైదానంలో ఉన్నప్పుడు నా భావోద్వేగాలను నియంత్రించుకునేందుకు వీలైనంత ప్రయత్నిస్తుంటా’’ అని అంటున్నాడు టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ. ప్రముఖ ఇన్వర్టర్‌ బ్యాటరీల సంస్థ లివ్‌ఫాస్ట్‌ కార్యక్రమంలో ధోనీ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మహీ తన కెరీర్‌ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. మైదానంలో తాను ఎందుకు అంత కూల్‌గా కన్పిస్తాడో కూడా వివరించాడు.

‘‘మేము మైదానంలో ఉన్నప్పుడు ఎలాంటి తప్పులు చేయొద్దని అనుకుంటాం. అది మిస్‌ఫీల్డ్ అయినా.. క్యాచ్‌లు జారవిడవడం అయినా కావొచ్చు. కానీ, కొన్నిసార్లు అలాంటి పొరబాట్లు జరుగుతుంటాయి. ఆటగాళ్లు ఆ తప్పులు చేసినప్పుడు నేను వారి స్థానంలో ఉండి ఆలోచిస్తా. కేవలం కోపం తెచ్చుకోవడం వల్ల ఎలాంటి లాభం లేదు. దాదాపు 40వేల మంది స్టాండ్స్‌లో కూర్చుని మమ్మల్ని చూస్తుంటారు. టీవీల్లో నుంచి కొన్ని కోట్ల మంది గమనిస్తుంటారు. అందుకే కోపం తెచ్చుకోకుండా ఫీల్డింగ్‌లో తప్పు ఎలా జరిగిందో కారణాలు తెలుసుకుంటా. ఒక ఆటగాడు మైదానంలో 100శాతం శ్రద్ధగా ఉన్నప్పటికీ క్యాచ్‌ మిస్సయితే.. నాకు అది పెద్ద సమస్య కాదు. దాని వల్ల మేం మ్యాచ్‌ ఓడిపోవచ్చు.. కానీ, అతడు గతంలో ఎన్నో క్యాచ్‌లు పట్టి ఉంటాడు కదా. అది కాకుండా ఆటగాడు శ్రద్ధగా ఉండకపోతే మాత్రం అతడు ఆ తప్పును సరిదిద్దుకునేలా ప్రయత్నిస్తా. నేనూ మనిషినే. మీలాగే నాకు అనేక భావోద్వేగాలు ఉంటాయి. కానీ ఒకసారి బయటకు వెళ్లి వేల మంది మధ్య మ్యాచ్‌ ఆడుతుంటే మాత్రం మేం మా భావోద్వేగాలను నియంత్రించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మేం ఈ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాం’’ అని ధోనీ చెప్పుకొచ్చాడు.

ఆ సమావేశం.. ఒక్క నిమిషంలోపే..

ఈ సందర్భంగా మరో ఆసక్తికర సందర్భాన్ని ధోనీ గుర్తుచేసుకున్నాడు. భారత టీ20 లీగ్‌ సమయంలో ఓసారి చెన్నై జట్టు సమావేశం ఒక్క నిమిషంలోపే ముగిసిందన్నాడు. ‘‘నా కెరీర్‌లో అత్యంత చిన్న మీటింగ్‌ చెన్నై జట్టులోనే జరిగింది. అదీ కేవలం ఒక్క నిమిషంలోపే. అలా ఎలా జరిగిందని మీరు అడగొచ్చు. ఆ రోజు సాయంత్రం 5.30 గంటలకు సమావేశం ఏర్పాటు చేశారు. ఆటగాళ్లు, సపోర్ట్‌ స్టాఫ్‌ అంతా 5.28 గంటలకు రెడీ అయ్యాం. అందరూ వచ్చేశారు కదా ఇక మీటింగ్‌ స్టార్ట్‌ చేద్దామని అనుకున్నాం. 5.29 గంటలకు సమావేశం ప్రారంభమైంది. 5.30 గంటలకు ఎక్కడివాళ్లు అక్కడికి వెళ్లిపోయారు’’ అని ధోనీ తెలిపాడు. సాధారణంగా ధోనీ చిన్న చిన్న సమావేశాలనే ఇష్టపడతాడనే విషయం అందరికీ తెలిసిందే.

అప్పుడు నేను వేగం తగ్గించాల్సిందే..

ఈ కార్యక్రమంలో భాగంగా లివ్‌ఫాస్ట్‌ తరఫున వ్యాఖ్యాతగా ఉన్న విక్రమ్‌ సాథయే ధోనీని ఓ ఆసక్తికర ప్రశ్న అడిగారు. ఒకవేళ పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ ఇంజమామ్‌ ఉల్‌ హక్‌తో మీరు వికెట్ల మధ్య పరిగెత్తాల్సి వస్తే ఎలా ఉంటారు? అని మహీని ప్రశ్నించాడు. దీనికి ధోనీ స్పందిస్తూ.. ‘‘ఒకవేళ నేను ఇంజి భాయ్‌తో కలిసి వికెట్ల మధ్య పరిగెత్తాల్సి వస్తే అప్పుడు కచ్చితంగా నా వేగాన్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది. లేదంటే 100శాతం రనౌట్‌ జరుగుతుంది’’ అని సరదాగా చెప్పాడు.

(లివ్‌ఫాస్ట్‌ కార్యక్రమంలో ధోనీతో విక్రమ్‌ సాథయే)

ఇక, మ్యాచ్‌ ఓటముల గురించి కూడా మహీ స్పందించాడు. ‘‘మైదానం వెలుపల కూర్చుని ఇలా ఆడాలి.. అలా ఆడాలి అని చెప్పడం చాలా సులువు. కానీ మైదానంలో ఆడటం మాత్రం చాలా కష్టం. మేం మన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాం. ప్రత్యర్థి ఆటగాళ్లు కూడా అలాగే వారి దేశం తరఫున ఆడతారు. వారు కూడా గెలవడానికి ప్రయత్నిస్తారు. ఆటల్లో గెలుపోటములు ఉంటాయి’’ అని వివరించాడు. ఆట ఏదైనా.. క్రీడాకారులకు యావత్‌ దేశం అండగా ఉండాలని.. ఎందుకంటే ఆటగాళ్లు దేశం కోసం ఆడేందుకు ఎన్నో ఏళ్లు కష్టపడుతుంటారని ధోనీ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని