Azaj Patel : అజాజ్‌ పటేల్‌కు ఐసీసీ అవార్డు

న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్‌ ఐసీసీ అవార్డు గెలుచుకున్నాడు. డిసెంబర్‌ నెలకుగానూ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు సొంతం చేసుకున్నాడు. టీమ్‌ఇండియా ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్..

Published : 10 Jan 2022 17:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్‌ ఐసీసీ అవార్డు గెలుచుకున్నాడు. డిసెంబర్‌ నెలకుగానూ అతడు ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు సొంతం చేసుకున్నాడు. టీమ్‌ఇండియా ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్, ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్‌ స్టార్క్‌ వంటి కీలక ఆటగాళ్లు రేసులో నిలిచినా.. అజాజ్‌ పటేల్‌ను అవార్డు వరించడం గమనార్హం. గత నెలలో న్యూజిలాండ్‌, భారత్ జట్ల మధ్య వాంఖడే మైదానంలో జరిగిన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో.. అజాజ్‌ పటేల్‌ పది వికెట్ల ప్రదర్శనతో రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో అతడు ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. మాజీ ఆటగాళ్లు జిమ్‌లేకర్‌, అనిల్‌ కుంబ్లే తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. రెండో ఇన్నింగ్స్‌లోనూ మరో నాలుగు వికెట్లు పడగొట్టాడు. దీంతో అజాజ్‌ ఒకే టెస్టులో 16.07 సగటులో 14 వికెట్లు తీసినట్లయింది.

మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన అజాజ్‌ పటేల్‌.. ‘నా క్రికెట్‌ కెరీర్లో దీన్ని ఓ గొప్ప ఘనతగా భావిస్తున్నాను. భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో మెరుగైన ప్రదర్శనలు చేయాలనుకుంటున్నాను’ అని చెప్పిన విషయం తెలిసిందే. ముంబైలో జన్మించిన అజాజ్ తన తొలి భారత పర్యటనలో చరిత్ర సృష్టించాడు. అజాజ్‌ సాధించిన అరుదైన ఘనత పట్ల టీమ్‌ఇండియా ఆటగాళ్లు సైతం అప్పట్లో ప్రశంసలు కురిపించారు.

అవార్డు ప్రకటన సందర్భంగా దక్షిణాఫ్రి మాజీ ఆటగాడు, ఐసీసీ ఓటింగ్‌ కమిటీ మెంబర్‌ జేపీ డుమినీ మాట్లాడుతూ.. ‘ఇదో చారిత్రక ఘనత. ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీయడం మామూలు విషయం కాదు. అజాజ్ ప్రదర్శన క్రికెట్‌ చరిత్రలో ఓ మైలురాయిగా మిగిలిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు’ అని  అన్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని