Ashwin: జయ్‌దేవ్‌పై విమర్శలు సరికాదు.. అతడి దేశీయ గణాంకాలు చూడాలి: అశ్విన్‌

బంగ్లాదేశ్‌పై టెస్టు సిరీస్‌ను గెలవడంలో రవిచంద్రన్ అశ్విన్‌ (ashwin) కీలక పాత్ర పోషించాడు. అలాగే దాదాపు 12 ఏళ్ల తర్వాత టెస్టుల్లోకి వచ్చిన జయ్‌దేవ్‌ను (jaydev unadkat) అశ్విన్‌ అభినందించాడు. ఈ మ్యాచ్‌లో జయ్‌దేవ్‌ మూడు వికెట్లు పడగొట్టిన విషయం తెలిసిందే.

Updated : 29 Dec 2022 14:21 IST

ఇంటర్నెట్ డెస్క్: టెస్టు కెరీర్‌ను ఆరంభించిన దాదాపు 12 ఏళ్ల తర్వాత రెండో మ్యాచ్‌ ఆడిన టీమ్‌ఇండియా ఫాస్ట్‌ బౌలర్‌ జయ్‌దేవ్‌ను తీసుకోవడంపై బీసీసీఐ సెలెక్షన్ కమిటీని విమర్శిస్తూ  సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ జరిగింది. బంగ్లాదేశ్‌పై రెండో టెస్టులో మూడు వికెట్లు తీశాడు. ఈ క్రమంలో జయ్‌దేవ్‌ను ఎంపిక చేయడంపై వచ్చిన విమర్శలను భారత సీనియర్‌ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ కొట్టిపడేశాడు. దేశీయ క్రికెట్‌లో అద్భుతంగా రాణించాడని గుర్తు చేశాడు. సౌరాష్ట్ర క్రికెట్‌కు టార్చ్‌బేరర్‌గా నిలిచాడని అభినందించాడు. 

‘‘బంగ్లాపై టెస్టు సిరీస్‌ గెలిచాక అందించిన ట్రోఫీని జయ్‌దేవ్‌ను పైకెత్తి పట్టుకోవాలని చెప్పా. ఎందుకంటే అతడు ఇప్పటికే రంజీ ట్రోఫీని తన జట్టుకు అందించాడు. సౌరాష్ట్ర క్రికెట్‌కు చేసిన సేవలకుగాను టెస్టు సిరీస్‌ను అందుకొనే అర్హత జయ్‌దేవ్‌కు ఉంది. ఎంతో అనుభవంతో బౌలింగ్‌ చేసే ఉనద్కత్‌ జట్టులో ఉండటం సానుకూలాంశం. ఒక్కసారి దేశీయ క్రికెట్‌లో అతడి బౌలింగ్ గణాంకాలను చూస్తే తెలిసిపోతుంది. సౌరాష్ట్ర క్రికెట్‌కు మార్గనిర్దేశకుడు. దేశవాళీ క్రికెట్‌లో సౌరాష్ట్ర ఒక శక్తి మారడంలో జయ్‌దేవ్‌ కీలక పాత్ర పోషించాడు. బంగ్లాతో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో నాటౌట్‌గా నిలిచిన జయ్‌దేవ్‌.. రెండో ఇన్నింగ్స్‌లోనూ విజయానికి అవసరమైన పరుగులు చేయగల సత్తా అతడిలో ఉంది’’ అని తెలిపాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 97 మ్యాచుల్లో 356 వికెట్లు తీశాడు. లిస్ట్‌ ఏ క్రికెట్‌లో 116 మ్యాచుల్లో 168 వికెట్లు పడగొట్టాడు. 

‘‘భారత్‌లో అత్యంత హాట్ టాపిక్‌ ఐపీఎల్‌. దేశీయ క్రికెటర్లతోపాటు అంతర్జాతీయ ఆటగాళ్ల వరకు ఐపీఎల్‌ చాలామంది జీవితాలను మార్చేసింది. ఐపీఎల్‌లో అత్యుత్తమ ప్రదర్శనతో జాతీయ జట్టులోకి వచ్చేందుకు మార్గం దొరికింది. అయితే, భారత్‌ తరపున ఆడిన వారిలో 70 నుంచి 80 శాతం మంది రంజీ ట్రోఫీలో అదరగొట్టి వచ్చినవారే. ఉనద్కత్, సౌరభ్‌ కుమార్, సర్ఫరాజ్‌ ఖాన్, యశస్వి జైస్వాల్, షహ్‌బాజ్‌ నదీమ్, అభిమన్యు ఈశ్వరన్... ఇలా వీరంతా రంజీ, దులీప్‌ ట్రోఫీ, ఇండియా - ఏ రాణించారు. అయితే ఏదొక సమయంలో విఫలమైనప్పుడు విమర్శలు చేయడం సర్వసాధారణం. ఐపీఎల్‌లో రాణిస్తే వెంటనే గుర్తిస్తున్నాం. అయితే, ఇతర టోర్నీల్లో బాగా ఆడిన క్రికెటర్లను గుర్తించడంలో మాత్రం విఫలమవుతున్నాం’’ అని అశ్విన్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని