Shami: ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు సిద్ధమంటున్న షమీ.. బీసీసీఐ మాత్రం!

వన్డే ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) టాప్‌ వికెట్ టేకర్ షమీ (Shami). నాటి నుంచి గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్న అతడు.. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో ఆడాలని ఉత్సాహంగా ఉన్నట్లు సమాచారం.

Updated : 11 Jan 2024 10:55 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రపంచ కప్‌ తర్వాత గాయంతో ఇబ్బంది పడిన భారత స్టార్ పేసర్ మహమ్మద్ షమీ (Shami) కోలుకుంటున్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనకూ దూరమైన సంగతి తెలిసిందే. ఇప్పటికీ మైదానంలో సాధన ప్రారంభించలేదు. ఫిట్‌నెస్‌ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో (IND vs ENG) ఆడాలనే పట్టుదలతో ఉన్నట్లు సమాచారం. కానీ, తొలి రెండు టెస్టులకు షమీ దూరమవుతాడని వార్తలొస్తున్నాయి. ఫిట్‌నెస్‌ సాధిస్తేనే సెలక్షన్ కమిటీ అతడిని పరిగణనలోకి తీసుకోనుంది.

వన్డేలు, టెస్టుల్లో ఎక్కువగా కనిపిస్తున్న షమీకి అంతర్జాతీయ టీ20 జట్టులో మాత్రం చోటు దక్కడం లేదు. గత ఐపీఎల్‌లో రాణించిన అతడిని తీసుకోవాలనే డిమాండ్లూ ఉన్నాయి. తన టీ20 కెరీర్‌పై షమీ స్పందిస్తూ.. ‘‘ఎప్పుడు పొట్టి ఫార్మాట్‌ గురించి చర్చ వచ్చినా నేను సెలక్టర్ల దృష్టిలో ఉన్నానో లేదో తెలియడం లేదు. వచ్చే టీ20 ప్రపంచ కప్ ముందు ఐపీఎల్‌లో ఆడతా. అక్కడ రాణిస్తే వరల్డ్‌ కప్‌లో అవకాశం వస్తుందేమో చూడాలి. కానీ, నా బౌలింగ్‌ లయ అందుకొనేందుకు ఆ లీగ్‌ ఉపయోగపడుతుంది. మేనేజ్‌మెంట్ తీసుకోవాలని భావిస్తే మాత్రం సెలక్షన్‌కు అందుబాటులో ఉంటా’’ అని షమీ వెల్లడించాడు.

షమీ భవిష్యత్తు ప్రణాళికలకు సంబంధించి త్వరలోనే బీసీసీఐ స్పందించనుందని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. ‘‘షమీతో తప్పకుండా చర్చించాల్సిన అవసరం ఉంది. గత కొన్నేళ్లుగా పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు.  అతి త్వరలో మేనేజ్‌మెంట్, సెలక్టర్లు షమీతో చర్చిస్తారు. ఐపీఎల్, టెస్టు సిరీస్‌లు కాకుండా ఎంత మొత్తం క్రికెట్ ఆడాలని భావిస్తున్నాడనేది అప్పుడే తేలనుంది’’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని