Rohit: ఇక్కడ అడుగుపెట్టే నాటికే వరల్డ్‌ కప్‌ జట్టుపై ఓ అంచనాకు వచ్చేశాం: రోహిత్

వన్డే ప్రపంచ కప్‌ (ODI World Cup 2023) కోసం టీమ్‌ఇండియా జట్టును ప్రకటించాల్సిన డెడ్‌లైన్‌ ఇవాళే. దీంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎవరికి అవకాశం ఇస్తారు..? ఎవరిని తప్పిస్తారు? అనే చర్చకు తెరలేసింది. ఈ క్రమంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Updated : 05 Sep 2023 10:40 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఆసియా కప్‌లో (Asia Cup 2023) నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ ఘన విజయం సాధించింది. దీంతో సూపర్ -4కి చేరిపోయింది. మరోసారి పాకిస్థాన్‌తో సెప్టెంబర్ 10న తలపడే అవకాశం వచ్చింది. అయితే, ఇప్పుడంతా చర్చ వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2023) కోసం ప్రకటించే జట్టుపైనే ఉంది. ఇవాళ ప్రాథమిక జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఈ క్రమంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆసియా కప్‌ (Asia Cup 2023) కోసం వచ్చేటప్పటికే వరల్డ్‌ కప్‌ జట్టు ఎలా ఉండాలో ఓ అంచనాకు వచ్చామని తెలిపాడు. నేపాల్‌తో మ్యాచ్‌లో అర్ధశతకం సాధించిన రోహిత్ ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. అనంతరం మాట్లాడాడు. కీలక ఇన్నింగ్స్‌ ఆడినందుకు ఆనందంగా ఉందా..? అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. 

India ODI World Cup Squad: ఎవరా 15 మంది?

‘‘కీలక ఇన్నింగ్స్‌ ఆడినప్పటికీ నిజాయతీగా చెప్పాలంటే సంతోషంగా లేదు. ప్రారంభం కాస్త నిదానంగా చేయాల్సి వచ్చింది. అయితే, క్రీజ్‌లో కుదురుకున్నాక పరుగులు రాబట్టడం సులువైంది. షార్ట్‌ ఫైన్‌లెగ్, డీప్‌ బ్యాక్‌వర్డ్‌ స్క్వేర్‌ లెగ్‌ వైపు షాట్లు అప్పటికప్పుడు అనుకొని కొట్టినవే. ఇక మేం ఇక్కడికి వచ్చేటప్పటికే ప్రపంచ కప్‌ కోసం బరిలోకి దిగే జట్టుపై ఓ అంచనాతో వచ్చాం. ఇప్పుడున్న జట్టు నుంచే ఒకరిద్దరిని పక్కన పెట్టే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచులపైనే ఇది ఆధారపడి ఉండదు. ఒక మ్యాచ్‌లో బ్యాటింగ్‌ చేసే అవకాశం.. ఇప్పుడు రెండో మ్యాచ్‌లో బౌలింగ్‌లో పూర్తిస్థాయి ఓవర్లు సంధించాం. రెండింట్లో మేం అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించలేకపోయాం. కొందరు చాలా రోజుల తర్వాత మైదానంలోకి వచ్చారు. లీగ్‌ స్టేజ్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో టాప్‌ ఆర్డర్‌ ఒత్తిడికి గురైనప్పటికీ హార్దిక్‌, ఇషాన్‌ ఆదుకున్నారు. ఇక నేపాల్‌తో మా బౌలింగ్‌ ఫర్వాలేదు కానీ.. ఫీల్డింగ్‌ నాసిరకంగా ఉంది. తప్పకుండా మెరుగుపర్చుకుని సూపర్ -4లో బరిలోకి దిగుతాం. అయితే, సూపర్ -4లో వ్యక్తిగత ప్రదర్శన కంటే.. జట్టు గెలుపే ముఖ్యం’’ అని రోహిత్ తెలిపాడు. 

నేపాల్‌తో మ్యాచ్‌ విశేషాలు.. 

  • ఈ మ్యాచ్‌లో ఓపెనర్లు శుభ్‌మన్‌ గిల్ - రోహిత్ శర్మ తొలి వికెట్‌కు 147 పరుగులు జోడించారు. ఆసియా కప్‌లో భారత్‌కు ఇది మూడో అత్యుత్తమ భాగస్వామ్యం. పాక్‌పై 2018లో రోహితశర్మ-శిఖర్ ధావన్ 210 పరుగులు జోడించారు. 
  • ఇక పది వికెట్ల తేడాతో వన్డే మ్యాచ్‌ గెలిచిన సందర్భంలో.. అత్యధిక ఓపెనింగ్‌ భాగస్వామ్య ఇన్నింగ్స్‌ల్లో ఇది నాలుగోది.  
  • ఆసియా కప్‌లోని ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన ఐదో ఆటగాడు రోహిత్ శర్మ. నేపాల్‌పై 5 సిక్స్‌లు బాదాడు. ఇక 2000లో గంగూలీ బంగ్లాదేశ్‌పై ఏడు సిక్స్‌లు కొట్టాడు. ఎంఎస్ ధోనీ ఆరు (2008లో హాంకాంగ్‌పై), సురేశ్‌ రైనా ఐదు (2008లో హాంకాంగ్‌పై), వీరేంద్ర సెహ్వాగ్‌ (2008లో పాక్‌పై) ఐదు సిక్స్‌లు కొట్టారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని