IND vs SL: మా తొలి లక్ష్యమే పూర్తయింది.. ఆ నిర్ణయం వారికే వదిలేశా: రోహిత్

వన్డే ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) దిగ్విజయంగా సెమీస్‌కు దూసుకెళ్లిన తొలి జట్టుగా భారత్‌ (Team India) అవతరించింది. మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే అర్హత సాధించింది. శ్రీలంకను భారీ తేడాతో ఓడించి.. రన్‌రేట్‌ను కూడా గణనీయంగా పెంచుకుంది.

Published : 03 Nov 2023 08:48 IST

ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) ముందే సెమీస్‌కు చేరడం ఆనందంగా ఉందని భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) అన్నాడు. శ్రీలంకను 302 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడించిన తర్వాత రోహిత్ మాట్లాడుతూ తమ తొలి లక్ష్యం ఇప్పుడే పూర్తయిందని.. మున్ముందు రాబోయే సవాళ్లకు సిద్ధంగా ఉన్నామని తెలిపాడు. అలాగే డీఆర్‌ఎస్‌ను తీసుకొనే విషయంలో వికెట్ కీపర్‌, బౌలర్‌కే నిర్ణయం వదిలేసినట్లు వెల్లడించాడు. జట్టులోని ప్రతి ఒక్కరూ తమ పాత్రను పోషిస్తున్నారని అభినందించాడు.

‘‘వరల్డ్‌ కప్ ప్రారంభం నుంచి మా ఆటతీరు పట్ల గర్వంగా ఉంది. ఇప్పుడు అధికారికంగా సెమీస్‌కు చేరుకోవడం ఆనందంగానూ ఉంది. మా తొలి లక్ష్యం పూర్తయింది. తొలుత సెమీస్‌కు చేరుకోవాలనే ధ్యేయంతో ఆడాం. ఇక ఫైనల్స్‌పైనే గురి పెడతాం. ఇప్పటి వరకు జరిగిన ఏడు మ్యాచుల్లో మేం ఆడిన విధానంపట్ల సంతృప్తిగా ఉన్నా. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత ప్రదర్శనతో జట్టుకు అండగా నిలుస్తున్నారు. స్కోరు బోర్డుపై భారీగా పరుగులు ఉంచడం వల్ల బౌలర్లకు మరింత స్వేచ్ఛ లభిస్తోంది. 350+ స్కోరు ఎలాంటి పిచ్‌పైనైనా మంచి టార్గెట్. శ్రేయస్‌ అయ్యర్ ఆడిన తీరు అద్భుతం. మానసికంగా ఎంతో దృఢంగా ఉండే అయ్యర్ ఇలాంటి ఇన్నింగ్స్‌లను అలవోకగా ఆడేస్తాడు. సూర్యకుమార్‌ కూడా కీలకమైన పరుగులు అందించాడు.

మా బౌలర్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇంగ్లాండ్‌తో అదరగొట్టిన వారు మరోసారి శ్రీలంకపైనా అద్భుత ప్రదర్శన చేశారు. సిరాజ్‌ నాణ్యమైన బౌలర్‌ అనడంలో సందేహం లేదు. కొత్త బంతితో అద్భుతాలు చేస్తాడు. బౌలర్లు ఆధిపత్యం ప్రదర్శించి జట్టును గెలిపించడం బాగుంది. ఇదే ఊపును చివరి వరకూ కొనసాగిస్తారని ఆశిస్తున్నా. ఇక షమీ బౌలింగ్‌లో రివ్యూ విషయంలో నిర్ణయం బౌలర్, వికెట్ కీపర్‌కే వదిలేశా. బంతి గమనం వారిద్దరికే బాగా తెలుస్తుంది. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిపై నాకు నమ్మకం ఉంది. డీఆర్‌ఎస్‌లో ఇవాళ ఒక నిర్ణయం అనుకూలంగా వచ్చింది. మరొకటి చేజారింది. ఇక తదుపరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో తలపడబోతున్నాం. ఈ వరల్డ్‌ కప్‌లో సఫారీ జట్టు అద్భుతంగా ఆడుతోంది. తప్పకుండా కోల్‌కతా వేదికగా జరగబోయే ఆ మ్యాచ్‌ను ప్రతి ఒక్కరూ ఆస్వాదిస్తారని భావిస్తున్నా’’ అని రోహిత్ శర్మ వెల్లడించాడు.

నాతో సహా అందరూ విఫలం: కుశాల్ మెండిస్‌

‘‘భారత్‌తో మ్యాచ్‌లో మా ప్రదర్శన తీవ్రంగా నిరాశపరిచింది. నాతో సహా మిగతా వారంతా విఫలమయ్యారు. బౌలింగ్‌లో రాణించినప్పటికీ బ్యాటింగ్‌లో తేలిపోయాం. లైట్ల వెలుతురులో పిచ్‌ బౌలింగ్‌కు మరింత సహకరించింది. దానిని మేం ఊహించలేకపోయాం. అందుకే టాస్‌ గెలిచిన తర్వాత తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నా. తొలి అర్ధభాగంలో వికెట్‌ కాస్త నెమ్మదిగా ఉండి బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటుందని భావించా. మదుషంక అద్భుతంగా బౌలింగ్‌ వేశాడు. కానీ గిల్, విరాట్‌ను అడ్డుకోవడంలో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాం. లేకపోతే మ్యాచ్‌ ఫలితం మరోలా ఉండేది. ఇక భారత బౌలర్లు తొలి ఆరు ఓవర్లు అద్భుతంగా వేశారు. అందుకే, ఈ విజయం క్రెడిట్‌ అంతా వారికే దక్కుతుంది. మేం ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాలి. తప్పకుండా పుంజుకుని విజయం కోసం పోరాడతాం’’ అని శ్రీలంక కెప్టెన్ కుశాల్ మెండిస్‌ (Kushal Mendis) తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని