SA vs IND: అతడు లేని లోటు కనిపించడం లేదు.. రోహిత్ టెస్టు మోడ్‌లోకి రావాలి

మహ్మద్ షమి (Mohammed Shami) అందుబాటులో లేకున్నా టీమ్‌ఇండియా (Team India) బౌలింగ్ లైనప్‌ బలంగానే ఉందని సౌతాఫ్రికా కెప్టెన్ తెంబా బావుమా (Temba Bavum) అన్నాడు.

Updated : 25 Dec 2023 16:09 IST

ఇంటర్నెట్ డెస్క్‌: దక్షిణాఫ్రికా, భారత్ (SA vs IND) మధ్య రేపటి (డిసెంబరు 26) నుంచి రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌లో ఓటమి తర్వాత టీమ్‌ఇండియా అగ్రశ్రేణి జట్టుతో ఆడుతున్న తొలి సిరీస్‌ ఇదే. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతోపాటు సీనియర్ ఫాస్ట్‌బౌలర్ బుమ్రా ఈ సిరీస్‌లో ఆడుతున్నారు. చీలమండ గాయం నుంచి కోలుకుంటున్న షమి (Mohammed Shami) మాత్రం టెస్టు సిరీస్‌కు దూరంగా ఉన్నాడు. షమి అందుబాటులో లేకపోవడం టీమ్ఇండియా (Team India)కు లోటేనని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. కానీ, సౌతాఫ్రికా కెప్టెన్ తెంబా బావుమా (Temba Bavum) ఇందుకు భిన్నంగా స్పందించాడు. అతడు లేకున్నా ప్రస్తుత భారత జట్టు బలంగానే ఉందని పేర్కొన్నాడు. తొలి టెస్టుకు ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో బావుమా మాట్లాడాడు.

‘‘క్రికెటర్లుగా అత్యుత్తమ ప్రత్యర్థితో తలపడాలని భావించడం సహజం. షమి కూడా అదే కోవకు చెందుతాడు. అతడు అద్భుతమైన పేసర్. మా జట్టులో చాలామంది అతడి బౌలింగ్‌లో ఆడాలనుకుంటారు. కానీ, టీమ్‌ఇండియా.. టీమ్‌ఇండియానే. వారికి బలమైన జట్టు ఉంది. అతడి స్థానంలో ఎవరు బౌలింగ్‌ చేసినా మమ్మల్ని ఒత్తిడికి గురిచేస్తారు. సొంతగడ్డపై ఆడటం మాకు సానుకూలాంశమే అయినా.. బలమైన బౌలింగ్ లైనప్‌ ఉన్న భారత్‌తో పోటీ సవాలుతో కూడుకున్నదే. షమి లేకున్నా భారత బౌలింగ్ దళం పటిష్ఠంగానే ఉంది. గత 5-10 ఏళ్లలో టెస్టుల్లో భారత్ అద్భుత విజయాలు సాధించింది. బౌలింగ్ ఎటాక్‌ బలంగా ఉండటం వల్లే ఇది సాధ్యమైంది’’ అని బావుమా పేర్కొన్నాడు.


రోహిత్ టెస్టు మోడ్‌లోకి రావాలి: సునీల్ గావస్కర్ 

సఫారీలతో టెస్టు సిరీస్‌ రోహిత్ శర్మ (Rohit Sharma)కు కీలకం కానుంది. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా రాణించి.. జట్టును విజేతగా నిలిపితే అతడి పేరు భారత క్రికెట్‌ చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోతుంది. ఒకవేళ రోహిత్‌ విఫలమైతే.. అది అతడి భవితవ్యంపైనా ప్రభావం చూపే ఆస్కారముంది. ఈ నేపథ్యంలోనే భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ (Sunil Gavaskar) రోహిత్‌ శర్మకు కీలక సూచన చేశాడు. ‘‘రోహిత్ మొట్టమొదటగా తన మానసిక స్థితిని టెస్టు మ్యాచ్‌లకు అనుగుణంగా మార్చుకోవాలి. అతడు వన్డే ఫార్మాట్‌లో దూకుడుగా ఆడాలని నిర్ణయించుకున్నాడు. పవర్‌ ప్లేలో వీలైనంత ఎక్కువ స్కోరు చేయాలని ప్రయత్నించాడు. ప్రపంచకప్‌లో ఎలా ఆడాడో మనం చూశాం. కానీ, టెస్టు క్రికెట్‌కు వచ్చేసరికి ఈ విధానాన్ని పూర్తిగా మార్చుకోవాలి. ఎందుకంటే, ఈ ఫార్మాట్‌లో రోజంతా బ్యాటింగ్ చేయాలనే కోణంలో ఆలోచించాలి. రోహిత్ రోజంతా బ్యాటింగ్ చేస్తే కచ్చితంగా తనదైన షాట్లతో చెలరేగి 150 కంటే ఎక్కువ స్కోరు చేస్తాడు. అదే జరిగితే టీమ్‌ఇండియా స్కోరుబోర్డుపై 300 లేదా 350 కంటే ఎక్కువ పరుగులు ఉంటాయి’’ అని సునీల్ గావస్కర్‌ వివరించాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని