Ashwin - Ravi Shastri: శాస్త్రి అన్న ఆ మాటతో..

అప్పట్లో కోచ్‌ రవిశాస్త్రి అన్న మాటలకు తనను బస్సు కిందకు తోసేసినట్లు అనిపించిందని టీమ్‌ఇండియా ఆఫ్‌స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అన్నాడు. కెరీర్‌లో విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్న ఆ దశలో అనేకసార్లు రిటైర్మెంట్‌ గురించి ఆలోచించినట్లు

Updated : 22 Dec 2021 07:24 IST

దిల్లీ

ప్పట్లో కోచ్‌ రవిశాస్త్రి అన్న మాటలకు తనను బస్సు కిందకు తోసేసినట్లు అనిపించిందని టీమ్‌ఇండియా ఆఫ్‌స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అన్నాడు. కెరీర్‌లో విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్న ఆ దశలో అనేకసార్లు రిటైర్మెంట్‌ గురించి ఆలోచించినట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. 2019 సిడ్నీ టెస్టులో కుల్‌దీప్‌ అయిదు వికెట్లు పడగొట్టగా.. అప్పటి కోచ్‌ రవిశాస్త్రి అతడిపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఆ క్రమంలో అతడే విదేశాల్లో భారత నంబర్‌వన్‌ స్పిన్నర్‌ అని ప్రకటించాడు. అప్పుడు మీకేమనిపించిందని అశ్విన్‌ను ప్రశ్నిస్తే.. ‘‘రవి భాయ్‌ అంటే నాకెంతో గౌరవం ఉంది. మనమంతా కూడా కొన్నిసార్లు తోచింది మాట్లాడతాం. ఆ తర్వాత ఆ మాటలను వెనక్కి తీసుకుంటాం. కానీ రవిశాస్త్రి అలా మాట్లాడిన ఆ క్షణంలో మాత్రం నాకు చితికిపోయినట్లనిపించింది’’ అని అశ్విన్‌ అన్నాడు. అయితే కుల్‌దీప్‌ ప్రదర్శన తనకు సంతోషం కలిగించినట్లు తెలిపాడు. ‘‘నేను అయిదు వికెట్ల ఘనత సాధించలేకపోయా. కానీ ఆస్ట్రేలియాలో అతడు అది సాధించాడు. అది ఎంత గొప్ప ప్రదర్శనో నాకు తెలుసు. కుల్‌దీప్‌ ప్రదర్శన నిజంగానే నాకు సంతోషాన్నిచ్చింది. ఆస్ట్రేలియాలో గెలవడం చాలా ఆనందం కలిగించే విషయం. కానీ కుల్‌దీప్‌ సంబరంలో, జట్టు  సంబరాల్లో పాలుపంచుకోవాలంటే నాకు ఆ అర్హత ఉందని అనిపించాలి. కానీ నాకు మాత్రం.. బస్సు కింద తోసేసిన భావన కలిగింది. అలాంటప్పుడు జట్టు లేదా ఆటగాళ్ల విజయాన్ని ఆస్వాదించడానికి ఏర్పాటు చేసిన పార్టీకి ఎలా హాజరు కాగలను?’’ అని అశ్విన్‌ చెప్పాడు. అయినా తాను పార్టీకి హాజరైనట్లు అతను వెల్లడించాడు. ‘‘నేను నా గదికి వెళ్లి నా భార్యతో మాట్లాడా. ఏమీ పట్టించుకోద్దని నిర్ణయించుకున్నాం. నేను పార్టీకి వెళ్లా. ఏదైమనా ఆస్ట్రేలియాలో సిరీస్‌ గెలవడం చాలా గొప్ప విషయం కదా’’ అని అన్నాడు.

రిటైరవుదామనుకున్నా..: గాయాలతో బాధపడుతూనే ఆ సిరీస్‌ (2018-19 ఆస్ట్రేలియా పర్యటనలో) తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లో మూడేసి వికెట్లు పడగొట్టానని, జట్టు విజయంలో గొప్ప పాత్ర పోషించినట్లు భావించానని అశ్విన్‌ చెప్పాడు. అయినా రవిశాస్త్రి అలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని అతడు జీర్ణించుకోలేకపోయాడు. ‘‘అప్పటికి (కుల్‌దీప్‌ 5 వికెట్లు తీసింది చివరి టెస్టులో) మొదటి టెస్టును మరిచిపోయినట్లున్నారు. మా జట్టు తక్కువకే ఆలౌటయ్యాక ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో మొదటి నాలుగు వికెట్లలో మూడు నేనే పడగొట్టా. నిర్జీవంగా మారిన పిచ్‌పై ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో 50 ఓవర్లకు పైగా బౌలింగ్‌ చేసి మూడు వికెట్లు చేజిక్కించుకున్నా. గాయంతో బాధపడుతూనే బౌలింగ్‌ చేశా. నొప్పితో ఇబ్బందిపడుతూనే జట్టు కోసం గొప్పగా ఆడా అనుకున్నా. కానీ ‘‘నాథన్‌ లైయన్‌ ఆరు వికెట్లు పడగొట్టాడు. అశ్విన్‌ మూడు తీశాడు’’ అన్న మాటలే వినిపించాయి. బౌలింగ్‌లో మంచి ఫామ్‌లో ఉన్నా.. శరీరం సహకరిస్తలేనందుకు అప్పటికే నేను అసహనంతో ఉన్నా. ఆపై ఈ పోలికలు. ఆ తర్వాత సిడ్నీలో వ్యాఖ్యల వల్ల జట్టు సిరీస్‌ విజయంలో నా పాత్రేమీ లేదన్న భావన కలిగింది’’ అని అశ్విన్‌ చెప్పాడు. భారత మేటి స్పిన్నరే అయినప్పటికీ.. 2018 నుంచి 2020 వరకు అశ్విన్‌ కాస్త గడ్డుకాలాన్ని ఎదుర్కొన్నాడు. ఆ సమయంలో తాను రిటైరవుదామనుకున్నానని అతడు చెప్పాడు. ‘‘2018, 2020 మధ్య కాలంలో  వివిధ సందర్భాల్లో ఆటను వదిలేద్దామనిపించింది. ఎంత గట్టిగా కృషి చేసినా సరైన ఫలితాలు రావట్లేదని అనిపించింది. గాయాల వల్ల శారీరకంగా ఇబ్బందిపడ్డా. ఆరు బంతులు వేస్తే ఊపిరితీసుకోవడం కోసం కష్టపడాల్సివచ్చేది’’ అన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని