Shane Warne: ప్రత్యేక విమానంలో షేన్‌వార్న్‌ పార్థివదేహం తరలింపు..

లెజెండరీ స్పిన్నర్‌, దివంగత ఆటగాడు షేన్‌వార్న్‌ పార్థివదేహాన్ని తీసుకొని గురువారం ఉదయం ఓ ప్రత్యేక విమానం ఆస్ట్రేలియాకు బయలుదేరింది...

Published : 10 Mar 2022 12:45 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: లెజెండరీ స్పిన్నర్‌, దివంగత ఆటగాడు షేన్‌వార్న్‌ పార్థివదేహాన్ని గురువారం ఉదయం ఓ ప్రత్యేక విమానంలో ఆస్ట్రేలియాకు తరలించారు. థాయ్‌లాండ్‌లోని డాన్‌ మ్యూంగ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మెల్‌బోర్న్‌కు తరలించినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. వార్న్‌ మృతదేహాన్ని ఓ శవపేటికలో ఉంచి దానిపై ఆస్ట్రేలియా జాతీయ పతాకం చుట్టారని చెప్పారు. కొద్దిరోజుల క్రితం షేన్‌వార్న్‌ తన మిత్రులతో కలిసి థాయ్‌లాండ్‌లోని కోహ్‌ సమూయ్‌ ద్వీపానికి విశ్రాంతి కోసం రాగా.. అక్కడే ఓ విల్లాలో గత శుక్రవారం హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే.

అయితే, అతడు గుండెపోటుతో మరణించి ఉంటాడని అక్కడి అధికారులు పేర్కొన్నారు. మరోవైపు వార్న్‌ తల్లిదండ్రులు సైతం అతడు ఇటీవల ఛాతిలో నొప్పి వస్తుందని చెప్పినట్లు చెప్పారు. తాజాగా వచ్చిన పోస్టుమార్టం నివేదికలోనూ అతడు సహజ మరణం చెందాడని, అందులోనూ గుండెపోటే కారణం అయ్యుంటుందని తేలిందన్నారు. కాగా, షేన్‌వార్న్‌ మృతదేహానికి అక్కడి ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు మార్చి 30న మెల్‌బోర్న్‌ క్రికెట్‌ మైదానంలో వార్న్‌ సంస్మరణ సభ నిర్వహించనున్నట్లు విక్టోరియా స్టేట్‌ గవర్న్‌మెంట్‌ ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని