Thomas Cup: మా వాట్సప్‌ గ్రూప్‌నకూ ఆ పేరే పెట్టాం: కిదాంబి శ్రీకాంత్‌

భారత బ్యాడ్మింటన్‌ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ ప్రతిష్ఠాత్మక థామస్‌ కప్‌ను సొంతం చేసుకున్నారు మన షట్లర్లు. ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఒక్క పతకం

Updated : 16 May 2022 11:42 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత బ్యాడ్మింటన్‌ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ ప్రతిష్ఠాత్మక థామస్‌ కప్‌ను సొంతం చేసుకున్నారు మన షట్లర్లు. ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఒక్క పతకం కూడా గెలవని భారత పురుషుల జట్టు.. ఏకంగా స్వర్ణంతో సత్తాచాటింది. అయితే ఈ టోర్నీ ముందు ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికీ.. సమష్టి కృష్టి, పట్టుదలతో తాము ఈ విజయాన్ని సాధించగలిగామని అన్నాడు స్టార్‌ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్‌.

మ్యాచ్‌ అనంతరం బ్యాడ్మింటర్‌ వరల్డ్‌ ఫెడరేషన్‌తో మాట్లాడిన శ్రీకాంత్‌.. టోర్నీకి ముందు జరిగిన ఆసక్తికర ఘటనలను గుర్తుచేసుకున్నాడు. ‘‘ఇది కొంచెం ఆశ్చర్యంగా అనిపించొచ్చు. కొరియా మాస్టర్స్‌లో ఆడేందుకు నేను దక్షిణ కొరియా వచ్చాను. ఆ తర్వాతి వారమే సెలక్షన్‌ ట్రయల్స్‌ జరిగాయి. ట్రయల్స్‌ పూర్తయిన వెంటనే థామస్‌ కప్‌ టోర్నీకి జట్టును ప్రకటించారు. ఆ తర్వాత జట్టు సభ్యులమంతా ఓ వాట్సప్‌ గ్రూప్‌ క్రియేట్‌ చేసుకున్నాం. దాని పేరేంటో తెలుసా.. ‘కప్‌తోనే ఇంటికి (We’ll Bring It Home)’. ఇదంతా టోర్నీకి ఒక వారం ముందు జరిగింది. అంటే, కప్పు సాధించే సత్తా, సామర్థ్యం మాకుందని మాకు మేము స్ఫూర్తి నింపుకొనేందుకు అలా పెట్టుకున్నాం. అయితే దీనికి పట్టుదల కూడా చాలా అవసరం’’ అని శ్రీకాంత్‌ చెప్పుకొచ్చాడు.

జట్టు పరంగా తామంతా ఓ అద్భుతమైన బృందమని అన్నాడు. ‘‘ఈ బృందంలో అనుభవమున్న సీనియర్లతో పాటు యువ ఆటగాళ్లు కూడా ఉన్నారు. మా మధ్య అనుబంధమే మేం సమష్టిగా రాణించేలా చేసింది. ఒత్తిడి సమయంలో పరస్పరం వెన్నుండి ప్రోత్సహించుకునేవాళ్లం. ఒకరి విజయాన్ని అందరం సెలబ్రేట్‌ చేసుకునేవాళ్లం. ముఖ్యంగా క్వార్టర్స్‌, సెమీస్‌లో అయితే ఇండియన్‌ క్యాంప్‌ నుంచి హెచ్‌ఎస్‌పీ.. హెచ్‌ఎస్‌పీ (హెచ్‌ఎస్‌ ప్రణయ్‌) అని వినిపించిన కేకలు మాలో మరింత స్ఫూర్తి నింపాయి’’ అని శ్రీకాంత్‌ ఆనందాన్ని పంచుకున్నారు.

సంతోషంతో నిద్ర పట్టలేదు: ప్రణయ్‌

థామస్‌కప్‌లో విజయం సాధించడంతో జట్టు ఆటగాళ్లంతా సంతోషంలో మునిగిపోయారు. ‘‘నాకు పడుకోవాలని అనిపించింది. కానీ నిద్ర పట్టలేదు. ఎందుకంటే మేం ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్స్‌’’ అంటూ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ ట్విటర్‌ వేదికగా ఆనందాన్ని వ్యక్తం చేశాడు. క్వార్టర్స్‌, సెమీస్‌లో ప్రత్యర్థులతో భారత స్కోరు 2-2తో సమమైనప్పుడు ప్రణయ్‌ అద్భుతమైన ప్రదర్శన చేసి మ్యాచ్‌లను గెలిపించాడు.

ఆదివారం జరిగిన థామస్‌కప్‌లో భారత్‌ 3-0తో 14 సార్లు విజేత అయిన ఇండోనేషియాను మట్టికరిపించిన విషయం తెలిసిందే. థామస్‌ కప్‌లో ఇప్పటివరకు కనీసం సెమీస్‌ కూడా చేరని భారత్‌.. స్వర్ణంతో బోణీకొట్టడం విశేషం. వరుసగా రెండు సింగిల్స్‌, ఒక డబుల్స్‌లో గెలిచి.. రెండో డబుల్స్‌, మూడో సింగిల్స్‌తో పనిలేకుండా భారత్‌ ఛాంపియన్‌గా అవతరించింది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని