Rohit Sharma: విరాట్‌ కోహ్లి స్థానంలో రోహిత్‌ శర్మే సరైనోడు: గంగూలీ

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమ్‌ఇండియా  కెప్టెన్‌గా రోహిత్ శర్మ నియమిస్తున్నట్లు బీసీసీఐ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.  ‘హిట్‌మ్యాన్‌’కి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించడంపై పలువురు క్రికెట్‌ దిగ్గజాలు, మాజీ క్రికెటర్ల నుంచి మిశ్రమ స్పందనలు వచ్చాయి. ఈ క్రమంలో రోహిత్‌ని

Published : 17 Dec 2021 01:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్: పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమ్‌ఇండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ నియమిస్తున్నట్లు బీసీసీఐ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘హిట్‌మ్యాన్‌’కి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించడంపై పలువురు క్రికెట్‌ దిగ్గజాలు, మాజీ క్రికెటర్ల నుంచి మిశ్రమ స్పందనలు వచ్చాయి. ఈ క్రమంలో రోహిత్‌ని కెప్టెన్‌గా నియమించాలని తీసుకున్న నిర్ణయానికి భారత మాజీ క్రికెటర్‌, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ మద్దతు పలికాడు. ప్రస్తుత పరిస్థితుల్లో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో సారథిగా ఉండటానికి ‘హిట్‌మ్యాన్‌’ సరైన వ్యక్తి అని ఆయన అభిప్రాయపడ్డారు. అతడి సారథ్యంలో టీమ్ఇండియా భవిష్యత్‌లో మెరుగైన ఫలితాలను సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

‘కెప్టెన్‌గా అతడు సాధించిన ఘనతల వల్ల ఈ అవకాశం వచ్చింది. ఐపీఎల్‌లో సారథిగా ముంబయి ఇండియన్స్‌కి ఐదు టైటిల్స్ అందించాడు. 2009లో ఛాంపియన్‌గా నిలిచిన డెక్కన్ ఛార్జర్స్‌ జట్టులో అతడు సభ్యుడిగా ఉన్నాడు. ఒత్తిడిలో అతడి సామర్థ్యాన్ని తెలియజేయడానికి ఈ గణాంకాలు చాలు. టీ20ల్లో నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకోవాలని విరాట్‌ కోహ్లి నిర్ణయించుకున్న తర్వాత ఆ పాత్రను నిర్వర్తించడానికి రోహిత్‌ శర్మ ఉత్తమ ఎంపిక. అతడి సారథ్యంలో ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో 3-0తో టీమ్‌ఇండియా గెలిచింది. ఈ ఏడాది చూసిన దానికంటే వచ్చే ఏడాది భారత్‌కు మెరుగైన ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాం' అని 'బ్యాక్‌స్టేజ్‌ విత్ బోరియా' అనే కార్యక్రమంలో గంగూలీ అన్నారు.

‘2017 ఛాంపియన్స్ ట్రోఫీ, 2019 వన్డే ప్రపంచ కప్‌లో టీమ్ఇండియా బాగా ఆడింది. ముఖ్యంగా 2019 ప్రపంచ కప్‌లో అద్భుతమైన ఆటతీరును కనబరిచింది. కానీ, 2021 టీ20 ప్రపంచ కప్‌లో టీమ్ఇండియా ప్రదర్శన పట్ల నిరాశ చెందాను. గత నాలుగైదేళ్లలో ఇదే అత్యంత చెత్త ప్రదర్శన. ఏమైందో జరిగిందో నాకు తెలీదు. మేం (టీమ్‌ఇండియా) స్వేచ్ఛగా ఆడలేదని భావిస్తున్నా. పాకిస్థాన్, న్యూజిలాండ్‌లపై మేము ఆడిన విధానాన్ని చూస్తే కేవలం 15 శాతం సామర్థ్యంతో ఆడినట్లు నాకు అనిపించింది. ఈ ఓటములకు గల కారణాలను విశ్లేషించుకుని తప్పులను సరిదిద్దుకుంటామని ఆశిస్తున్నా’ అని బీసీసీఐ అధ్యక్షుడు ముగించారు.

Read latest Sports News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని