AFG vs RSA: డస్సెన్‌ కీలక ఇన్నింగ్స్‌.. అఫ్గాన్‌పై సఫారీల విజయం

అహ్మదాబాద్‌ వేదిగా అఫ్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో తన చివరి లీగ్‌మ్యాచ్‌లో గెలుపొందింది.

Updated : 10 Nov 2023 22:00 IST

అహ్మదాబాద్: వన్డే ప్రపంచకప్‌లోని (ODI Worldcup) తన చివరి లీగ్‌ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా (South Africa) విజయం సాధించింది. అహ్మదాబాద్‌ వేదికగా అఫ్గానిస్థాన్‌తో (Afghanistan) జరిగిన పోరులో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొత్తం 9 మ్యాచుల్లో ఏడింట విజయం సాధించి +1.376 రన్‌రేట్‌తో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. డస్సెన్‌ (76*; 95 బంతుల్లో 6×4,1×6) అర్ధశతకంతో చెలరేగిన వేళ.. 47.3 ఓవర్లలోనే సఫారీ జట్టు విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. 245 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు.. ఓపెనర్లు డికాక్‌ (41; 47 బంతుల్లో 2×4, 3×6), బవుమా (23; 28 బంతుల్లో 3×4) శుభారంభాన్నిచ్చారు. క్రీజులో నిలదొక్కుకుంటూ వేగంగా పరుగులు రాబట్టారు. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని ముజీబ్‌ విడగొట్టాడు. 11వ ఓవర్ చివరి బంతికి భారీ షాట్‌ ఆడబోయిన బవుమా గుర్బాజ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అక్కడికి రెండు ఓవర్ల వ్యవధిలోనే డికాక్ కూడా నబీ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌ చేరాడు. 

డస్సెన్‌ మెరిసెన్‌..

తొలి డౌన్‌లో వచ్చిన డస్సెన్‌ కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఓ వైపు మార్‌క్రమ్‌ (25),క్లాసెన్‌ (10), డేవిడ్‌ మిల్లర్‌ (24) తక్కువ స్కోరుకే ఔటైనప్పటికీ.. తాను మాత్రం పట్టువిడవకుండా స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. చివరి 10 ఓవర్లలో 53 పరుగులు చేయాల్సిన తరుణంలో అఫ్గాన్‌ బౌలర్లు కూడా సఫారీలను కట్టడి చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఒక దశలో సమీకరణాలు 42-42, 36-36, 22-23గా నమోదయ్యాయి. ఓ వైపు అనుభవజ్ఞుడైన డస్సెన్‌ క్రీజులో ఉండటంతో సఫారీలు పెద్దగా ఆందోళన చెందకపోయినప్పటికీ.. అఫ్గాన్‌ బౌలర్ల ప్రయత్నలోపం లేదనే చెప్పాలి. చివరి మూడు బంతులకు  రెండు సిక్సర్లు, ఒక ఫోర్‌ బాదడంతో విజయం లాంఛనమైంది. డస్సెన్‌, అండిల్‌ ( 39*) నాటౌట్‌గా నిలిచారు. అఫ్గాన్‌ బౌలర్లలో రషీద్‌ ఖాన్‌, మహమ్మద్‌ నబి చెరో 2 వికెట్లు తీయగా.. ముజీబ్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు.

ఒమర్జాయ్‌ అద్భుత ఇన్నింగ్స్‌ వృథా

అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్‌ నిర్ణీత 50 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటయ్యింది. అజ్మతుల్లా ఒమర్జాయ్‌ (97*; 107 బంతుల్లో 7×4, 3×6) ఒంటరి పోరాటం చేసిన వేళ  అఫ్గాన్‌ 245 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దక్షిణాఫ్రికా బౌలర్లను ఎదుర్కొనేందుకు అఫ్గాన్‌ బ్యాటర్లు ఇబ్బంది పడిన వేళ ఒమర్జాయ్‌ మాత్రం నిలకడగా బ్యాటింగ్ చేశాడు. మరో మూడు పరుగులు చేసి ఉంటే శతకం అతడి ఖాతాలో పడేది. కానీ, అదృష్టం వరించలేదు. ఇక అఫ్గాన్‌ బ్యాటర్లు రహ్మానుల్లా గుర్బాజ్ 25, ఇబ్రహీం జద్రాన్ 15, రహ్మాత్ షా 26, హష్మతుల్లా షాహిది 2, ఇక్రామ్‌ అలిఖిల్ 12, మహమ్మద్‌ నబీ 2, రషీద్‌ ఖాన్ 14, నూర్‌ అహ్మద్‌ 26, ముజీబ్‌ 8, నవీన్‌-ఉల్‌-హక్‌ 2 పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లు లుంగి ఎంగిడి 2 , గెరాల్డ్‌ కోయిట్జీ 4 , కేశవ్ మహరాజ్‌ 2, ఫెహ్లూక్వాయో ఒక వికెట్‌ తీశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని