
IND vs NZ: టెస్టుల్లో టీమ్‌ఇండియా మళ్లీ నంబర్ 1
ఇంటర్నెట్‌డెస్క్: టీమ్‌ఇండియా టెస్టు క్రికెట్‌లో మళ్లీ నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. ముంబయి వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో కోహ్లీసేన సోమవారం 372 పరుగుల తేడాతో రికార్డు విజయం సాధించిన నేపథ్యంలో ఈ ఘనత సాధించింది. ఐసీసీ తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో భారత్ 124 పాయింట్లతో తొలి స్థానం సంపాదించగా.. కివీస్ 121 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇక యాషెస్ సిరీస్‌కు సిద్ధమవుతున్న ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు.. వరుసగా 108, 107 పాయింట్లతో మూడు, నాలుగు స్థానాల్లో చోటు దక్కించుకున్నాయి. ఈ క్రమంలోనే పాకిస్థాన్ 92 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతోంది.
మరోవైపు 2021-23 ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పట్టికలో టీమ్ఇండియా మూడో స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు ఇంగ్లాండ్, న్యూజిలాండ్ సిరీస్‌ల్లో మొత్తం ఆరు టెస్టులు ఆడిన కోహ్లీసేన 3 విజయాలు, ఒక ఓటమి, రెండు డ్రాలతో మొత్తం 42 పాయింట్లు సాధించింది. దీంతో విజయాల శాతంలో మూడో స్థానం సంపాదించింది. మరోవైపు శ్రీలంక రెండు విజయాలతో 100 శాతం మెరుగైన ఫలితాలు సాధించి 24 పాయింట్లతోనే అగ్ర స్థానం సంపాదించింది. అలాగే పాకిస్థాన్ రెండు మ్యాచ్‌లు గెలిచి ఒకటి ఓటమిపాలవ్వడంతో 66.66 విజయ శాతంతో రెండో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా 58.33 విజయ శాతంతో మూడో స్థానం సంపాదించింది.