IND vs NZ: రహానె కన్నా పుజారాపైనే ఒత్తిడెక్కువ: జహీర్

న్యూజిలాండ్‌తో జరగబోయే రెండో టెస్టు్కు టీమ్ఇండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ తిరిగి వస్తుండటంతో ఇప్పుడు ఎవరిని పక్కనపెడతారనే విషయం సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది...

Updated : 02 Dec 2021 09:51 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: న్యూజిలాండ్‌తో జరగబోయే రెండో టెస్టుకు టీమ్ఇండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ తిరిగి జట్టులోకి వస్తుండటంతో ఇప్పుడు ఎవరిని పక్కనపెడతారనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ విషయంపై జట్టు యాజమాన్యం సైతం తర్జనభర్జన పడుతోంది. అరంగేట్రం మ్యాచ్‌లోనే శ్రేయస్‌ అయ్యర్‌ (105, 65) శతకం, అర్ధశతకంతో రాణించిన సంగతి తెలిసిందే. దీంతో రెండో టెస్టులోనూ అతడి స్థానం కచ్చితమని చెప్పొచ్చు. మరోవైపు సీనియర్‌ బ్యాట్స్‌మెన్‌ అజింక్య రహానె (35, 4), ఛెతేశ్వర్‌ పుజారా (26, 22) నిరాశపర్చడంతో.. వీరిలో ఒకరిని పక్కకు పెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇందులో ప్రధానంగా రహానెను తప్పిస్తారనే అభిప్రాయం బలంగా వినిపిస్తున్నా టీమ్‌ఇండియా మాజీ పేసర్‌ జహీర్‌ఖాన్‌ మరో విధంగా స్పందించాడు.

‘తొలి టెస్టులో శ్రేయస్‌ అద్భుతంగా రాణించడం వల్లే రెండో టెస్టుకు మిడిల్‌ ఆర్డర్‌ సమస్య తలెత్తింది. అందివచ్చిన అవకాశాన్ని అతడు సద్వినియోగం చేసుకున్నాడు. రెండో టెస్టుకు కోహ్లీ తిరిగి వస్తుండటంతో మిడిల్‌ ఆర్డర్‌లో కచ్చితంగా స్థానం కల్పించాలి. దీంతో పుజారాపైనే కొంచెం ఎక్కువ ఒత్తిడి ఉంటుందని భావిస్తున్నా. అది కూడా బ్యాటింగ్‌ ప్రదర్శన ఆధారంగా కాదని చెప్తున్నా. సహజంగా ఎవరినైనా తొలగించాలంటే ఓపెనర్లలో ఒకరిని తప్పించడం మనం చాలాసార్లు చూశాం. అలాంటప్పుడు జట్టు యాజమాన్యం సైతం పుజారాను ఓపెనింగ్‌ చేయమని అడిగే వీలుంది. అప్పుడు జట్టు కూర్పులో మార్పులు జరగవని కచ్చితంగా చెప్పలేం. మరోవైపు తొలి టెస్టులో అద్భుతంగా ఆడిన శ్రేయస్‌ రెండో టెస్టులోనూ కచ్చితంగా ఉంటాడు. దానిలో ఎటువంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా ఒక ఓపెనర్‌నైనా పక్కనపెట్టాలి. లేదంటే, రహానె, పుజారా.. ఇద్దరిలో ఒకర్ని తప్పించాలి’ అని జహీర్‌ ఓ క్రీడా ఛానెల్‌తో పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని