INDvsENG: రెండో రోజు ఆట పూర్తి.. ఇంగ్లాండ్‌ 119/3

టీమ్‌ఇండియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ దీటుగా ఆడుతోంది. కెప్టెన్‌ జో రూట్‌ (48 నాటౌట్‌; 75 బంతుల్లో 6x4) మరో కీలక ఇన్నింగ్స్‌ ఆడుతున్నాడు...

Updated : 27 Feb 2024 16:01 IST

లండన్‌: టీమ్‌ఇండియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ దీటుగా ఆడుతోంది. కెప్టెన్‌ జో రూట్‌ (48 నాటౌట్‌; 75 బంతుల్లో 6x4) మరో కీలక ఇన్నింగ్స్‌ ఆడుతున్నాడు. అతడికి ఓపెనర్‌ రోరీ బర్న్స్‌ (49; 136 బంతుల్లో 7x4) చక్కటి సహకారం అందించాడు. దాంతో వీరిద్దరూ మూడో వికెట్‌కు 85 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఆట పూర్తయ్యేసరికి ఇంగ్లాండ్‌ 119/3 స్కోర్‌తో నిలిచింది. రూట్‌, బెయిర్‌స్టో (6 నాటౌట్‌; 17 బంతుల్లో) క్రీజులో ఉన్నారు. అంతకుముందు టీమ్‌ఇండియా 276/3 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో రెండో రోజు బ్యాటింగ్‌ ప్రారంభించగా 364 పరుగులకు ఆలౌటైంది.

గురువారం శతకంతో చెలరేగిన కేఎల్‌ రాహుల్‌ (129; 250 బంతుల్లో 12x4, 1x6) రెండో రోజు ఆట ప్రారంభమైన రెండో బంతికే ఔటయ్యాడు. మరుసటి ఓవర్‌లోనే అజింక్య రహానె(1) సైతం పెవిలియన్‌ చేరాడు. రాబిన్‌సన్‌ వేసిన తొలి ఓవర్‌లో రాహుల్‌.. సిబ్లీ చేతికి చిక్కగా తర్వాత అండర్సన్‌ బౌలింగ్‌లో రహానె.. రూట్‌ చేతికి చిక్కాడు. దాంతో టీమ్‌ఇండియా ఆరు పరుగుల తేడాతో రెండు వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడిపోయింది. అనంతరం జడేజా (40; 120 బంతుల్లో 3x4), రిషభ్‌ పంత్‌ (37; 58 బంతుల్లో 5x4) కాస్త నిలకడగా ఆడి ఆరో వికెట్‌కు 49 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే, పంత్‌ వేగంగా ఆడే క్రమంలో మార్క్‌వుడ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అప్పటికి భారత్‌ స్కోర్‌ 331/6గా నమోదైంది. మరుసటి ఓవర్‌లో షమి(0) కూడా పెవిలియన్‌ చేరాడు. ఆపై జడేజా, ఇషాంత్‌(8) కొంచెంసేపు నిలకడగా ఆడి ఎనిమిదో వికెట్‌కు 26 పరుగులు జోడించారు. అయితే, జట్టు స్కోర్‌ 362 పరుగుల వద్ద ఇషాంత్‌ ఔటైన తర్వాత బుమ్రా, జడేజా సైతం ఎక్కువసేపు నిలవలేదు. ఇంగ్లాండ్ బౌలర్లలో అండర్సన్‌ ఐదు వికెట్లు, రాబిన్‌సన్‌, మార్క్‌వుడ్‌ చెరో రెండు, మోయిన్‌ అలీ ఒక వికెట్ తీశారు.

ఇక ఛేదనకు దిగిన ఇంగ్లాండ్‌ ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. సిరాజ్‌ వేసిన 15వ ఓవర్‌లో సిబ్లీ(11), హసీబ్‌ హమీద్‌(0) ఔటయ్యారు. తర్వాత జోడీ కట్టిన రూట్‌, బర్న్స్‌ నిలకడగా ఆడుతూ భారత బౌలర్లపై ఆధిపత్యం చెలాయించారు. వీరిద్దరూ ప్రమాదకరంగా మారుతున్న సమయంలో షమి.. బర్న్స్‌ను ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌ పంపాడు. దాంతో ఇంగ్లాండ్‌ 108 పరుగుల వద్ద మూడో వికెట్‌ కోల్పోయింది. ఇక మూడో రోజు టీమ్‌ఇండియా బౌలర్లు రూట్‌, బెయిర్‌స్టోను ఎంత త్వరగా ఔట్‌ చేస్తే మ్యాచ్‌పై అంత పట్టు సాధించే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని